’వీర’ బాదుడు

ABN , First Publish Date - 2022-06-08T05:21:27+05:30 IST

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో ’వీర’ బాదుడు కొనసాగుతోంది. దినసరి ఉద్యోగులు బ్యాంక్‌ను శాసిస్తున్నారు. వీరు ఫోన్‌ చేస్తేనే సొసైటీలు, బ్రాంచిల్లో ఫైళ్లు కదులుతున్నాయి.

’వీర’ బాదుడు
డిసిసిబి ప్రధానకార్యాలయం యన్‌టిఆర్‌ సహకార భవన్‌

’వీరు’ చెబితేనే ఫైల్‌పై అధికారుల సంతకాలు  

కీలకంగా మారిన దినసరి వేతన ఉద్యోగులు 

ఎల్‌టీ రుణాల పేరుతో రూ.కోట్లు పంపిణీ

మామూళ్ళు ఇస్తేనే ఫైల్‌ ముందుకు..


          (గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌లో ’వీర’ బాదుడు కొనసాగుతోంది. దినసరి ఉద్యోగులు బ్యాంక్‌ను శాసిస్తున్నారు. వీరు ఫోన్‌ చేస్తేనే సొసైటీలు, బ్రాంచిల్లో ఫైళ్లు కదులుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 42 బ్రాంచ్‌లు, ప్రధాన కార్యాలయంలో సుమారు 50 మంది రోజువారి వేతన ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. అధికారపార్టీ కీలకనేతల సిఫారసులతో వీరిని నియమించారు. వీరందరికీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ’వీరు’ నేతగా వున్నారు.  బ్యాంకుల్లో సొసైటీ అధ్యక్షులు, అధికారపార్టీ నేతలు, చైర్మన్‌, పాలకవర్గసభ్యుల సిఫార్స్‌ చేయించినా పనులుకావు. కానీ వీరు ఫోన్‌చేస్తే ఫైల్‌ ఎక్కడా ఆగదు. రుణాల వ్యవహారాలను చక్కబెట్టటానికి 11 శాతం మామూళ్ళుగా నిర్ణయించి ఎందరికి ఎంత ఇవ్వాలో ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఈ దినసరి ఉద్యోగే నిర్ణయిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు.   


కీలకంగా దినసరి వేతన ఉద్యోగులు...

తెనాలి చెంచుపేట నకిలీ బంగారం రుణాల వ్యవహారంలో ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఈ ఉద్యోగి అనుచరుల పాత్ర ఎక్కువగా వుంది. వీరి అనుచరుడే బంగారం తాకట్టు అప్రైజర్‌గా వున్నాడు. వీరి శిష్యులు రూ.20 లక్షల వరకు నకిలీ బంగారం తాకట్టుపై రుణాలు పొందారు. దీనిని అవకాశంగా తీసుకొని బ్రాంచ్‌ కీలక అధికారి కుటుంబ సభ్యులు సుమారు రూ.30 లక్షలు తీసుకొన్నారు. వీరి వ్యవహారం గిట్టని ప్రధాన కార్యాలయ సిబ్బంది నకిలీ బంగారం తాకట్టును సీఈవో కృష్ణవేణి దృష్టికి తెచ్చారు. దీంతో అంతా మునుగుతామని  నకిలీ బంగారం తాకట్టు రుణాల వ్యవహారాన్ని చక్కదిద్దారు. వీరి అనుచరులు ముందుగానే డబ్బు చెల్లించటంతో సమస్య గడపదాటకుండా సెటిల్‌ అయింది. బోగస్‌ పాస్‌పుస్తకాల రుణాల వ్యవహారాన్ని నడిపిన కీలకనేత బందువు వద్దకు రూ.10 కోట్లు చేరాయి. దానిలో వాటా ఇవ్వాలని విశ్రాంత అధికారితో రాయబారం నడిపారు. 


దినసరి ఉద్యోగులుగా పాత్రికేయులు.. 

జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న 50 మంది దినసరి ఉద్యోగులలో ఇద్దరు పాత్రికేయులున్నట్లు అధికారులు తెలిపారు. ఒకరు అధికారపార్టీ పత్రికకు చెందిన వారుకాగా, మరొకరు మాజీ ఎంపీ పత్రికలో పని చేస్తున్నారు. దినసరి ఉద్యోగులలో గుంటూరు మండలంలోని కీలకనేత గ్రామానికి చెందినవారు 15 మంది, బ్యాంక్‌ వ్యవహారాలను చక్కబెడుతున్న నేత గ్రామానికి చెందిన వారు మరికొందరు ఉన్నట్లు  అధికారులు చెప్పారు. బ్రాంచ్‌లు, ప్రధాన కార్యాలయంలో ఇద్దరు పాత్రికేయులు  అవినీతి వ్యవహారాలను చక్కబెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

భారీగా ఎల్‌టీ రుణాలు..

బ్యాంక్‌లో సుమారు రూ.700 - రూ.1,000 కోట్ల వరకు  దీర్ఘకాలిక రుణాలు(ఎల్‌టీ) రుణాలిచ్చినట్లు అధికారులు చెప్పారు. గొర్రెలు, గేదెలు లేకుండానే అవి ఉన్నట్లు, వాటికీ బీమా చేయించినట్లు ధ్రువపత్రాలు సృష్టించి రుణాలు పొందుతున్నారు. వీరి అనుచరులే ఇవన్నీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వ్యవహారాలపై ఫిర్యాదులు చేసే మల్లెల హరేంద్రనాథ్‌ చౌదరిని సొసైటీ నుంచి వ్యూహాత్మకంగా తప్పించినట్లు విశ్రాంత అధికారులు తెలిపారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లో  జరుగుతున్న వ్యవహారాలు ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని సీఎం పేషీకి ఫిర్యాదులు అందాయి. మరోవైపు కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి ప్రత్తిపాడు బ్రాంచ్‌లో నలుగురిని సస్పెండ్‌ చేయడంతో పాలకవర్గం, భోక్తలు, అధికారులు బెంబేలెత్తుతున్నారు. 

 

Updated Date - 2022-06-08T05:21:27+05:30 IST