మతలబేమిటో?
ABN , First Publish Date - 2022-12-30T00:38:40+05:30 IST
ఏపీసీపీడీసీఎల్ గుంటూరు సర్కిల్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్ల వ్యవహారం అనేక విమర్శలకు తావిస్తోంది.

నెల కిందట భారీగా ట్రాన్స్‌ఫార్మర్ల డంప్
నేడు ఇంధనశాఖ కార్యదర్శి సమీక్ష
ఆఘమేఘాలపై ఇక్కడి నుంచి తరలింపు
అవసరానికి మించి కొనుగోళ్లంటూ విమర్శలు
గుంటూరు, డిసెంబరు 29: ఏపీసీపీడీసీఎల్ గుంటూరు సర్కిల్ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్ల వ్యవహారం అనేక విమర్శలకు తావిస్తోంది. పైకి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అని చెబుతున్నప్పటికీ అవసరానికి మించి కొనుగోలు చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా విద్యుత్‌శాఖలో ఎటువంటి పరికరాలు కొన్నా విద్యుత్‌శాఖ స్టోర్స్‌లో భద్రంగా ఉంచుతారు. అటువంటిది కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను పొన్నూరు రోడ్డులోని ఆపరేషన్ ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలోనే పడేశారు. వందలాదిగా ఉన్న 25 కేవీ, 40 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు నెలలుగా ఎండ, వానలోనే ఆరుబయటే పడేశారు. ఇందులో సీపీడీసీఎల్ పెద్దలపాత్రే ఉందని, భారీగా లబ్ధిపొందేందుకు లోపాయికారి ఒప్పందంతో తమ జేబులు నింపుకొనేందుకే అవసరానికి మించి కొనుగోళ్లు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఇతర పరికరాల కొనుగోళ్లకు నిధుల్లేవని, ఉద్యోగుల జీతాలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో పెద్దఎత్తున ట్రాన్స్‌ఫార్మర్లు డంప్ చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బహిరంగమార్కెట్లో కంటే అదనంగా నగదు వెచ్చించి కొనుగోలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.
నేడు ఇంధనశాఖ కార్యదర్శి సమీక్ష..
విద్యుత్‌శాఖలో ఈఈ స్థాయి అధికారులతో ఇంధనశాఖ కార్యదర్శి విజయానంద్, సీఎండీ పద్మజనార్ధన్‌రెడ్డి, ఎస్‌ఈ ఆవుల మురళీకృష్ణయాదవ్‌తో కలిసి శుక్రవారం పొన్నూరురోడ్డులోని విద్యుత్‌భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌భవన్‌లో నెలలు తరబడి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గురువారం సాయంత్రమే లారీలతో తరలించారు. నెలలుగా ఉంచిన ట్రాన్స్‌ఫార్మర్లను ఇంధనశాఖ కార్యదర్శి సమీక్ష నేపథ్యంలో ఆఘమేఘాలపై తరలించటంలో ఆంతర్యం ఏంటోనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోళ్లపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు తేలుతాయని వినియోగదారులు కోరుతున్నారు.
Read more