ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలి

ABN , First Publish Date - 2022-07-08T04:54:04+05:30 IST

అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం పర్యవేక్షించడం ద్వారా నిర్దేశించిన మేరకు లక్ష్యాలను అధిగమించొచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు.

ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలి
సచివాలయం నుంచి ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి హాజరైన కలెక్టర్‌, జేసీ

జిల్లా అధికారులకు సీఎస్‌ సమీర్‌ శర్మ ఆదేశాలు

గుంటూరు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం పర్యవేక్షించడం ద్వారా నిర్దేశించిన మేరకు లక్ష్యాలను అధిగమించొచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ జిల్లా కలెక్టర్‌ని ఆదేశించారు. గురువారం వెలగపూడి సచివాలయం నుంచి గృహనిర్మాణం, భూముల రీసర్వే, సచివాలయాలు, స్పందన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ సమీర్‌శర్మ మాట్లాడుతూ పేదలందరికి ఇళ్ల పథకం లేఅవుట్లలో నిర్దేశించిన మేరకు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. సమగ్ర భూ సర్వేకి సంబంధించి సర్వే ముమ్మరంగా నిర్వహించాలన్నారు. సచివాలయాలు, స్పందన ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీలను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతి పైనా సీఎస్‌ సమీక్షించారు. 

ప్రభుత్వ ప్రాధాన్య భవనాలను పూర్తి చేయాలి

ప్రభుత్వ ప్రాధాన్య భవనాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ అహ్మద్‌ బాబు, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏపీఎంఎఫ్‌సీ, ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణం, జగనన్న పాల వెల్లువ అంశాలపై ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు సమీక్షించారు. ఈ సందర్భంగా అహ్మద్‌బాబు మాట్లాడుతూ జనన్న పాలవెల్లువకు సంబంధించి ఏఎంసీయూ, బీఎంసీయూల భవనాలను పూర్తి చేయాలన్నారు. మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్నా మాట్లాడుతూ ఏపీఎంఎఫ్‌సీ భవనాలకు సంబంధించి తొలి దశ నిర్మాణాలు 100 శాతం గ్రౌండింగ్‌ చేయాలన్నారు. రెండో దశలో మంజూరు చేసిన భవనాలకు నిర్దేశించిన నిబంధనల ప్రకారం స్థలాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ ఎం. వేణుగోపాల్‌రెడ్డి, జేసీ గణియా రాజకుమారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ నిధి మీనా, జిల్లా సహకార శాఖ అధికారి వీరాచారి, పశుసంవర్థక శాఖ జేడీ జేపీ వెంకటేశ్వర్లు, సీపీవో శేషశ్రీ, సచివాలయాల ఇన్‌చార్జి అధకారిణి గీతరాణి, ఆర్‌డీవో ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-08T04:54:04+05:30 IST