కెనాల్‌లో దూకి మహిళ ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-09-13T05:38:09+05:30 IST

కుటుంబ కలహాల నేపథ్యంలో కెనాల్‌లో దూకి యువతి మృతిచెందింది. ఆమెను కాపాడాలని యత్నించిన బంధువూ ఆ నీటిలోనే పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని నార్నెపాడు -గుంటూరు జీబీపీ కెనాల్‌ వద్ద సోమవారం చోటుచేసుకుంది.

కెనాల్‌లో దూకి మహిళ ఆత్మహత్య

 కాపాండేందుకు యత్నించిన బంధువూ మృతి


 ముప్పాళ్ల, సెప్టెంబరు12: కుటుంబ కలహాల నేపథ్యంలో కెనాల్‌లో దూకి యువతి మృతిచెందింది. ఆమెను కాపాడాలని యత్నించిన బంధువూ ఆ నీటిలోనే పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని నార్నెపాడు -గుంటూరు జీబీపీ కెనాల్‌ వద్ద సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని పాకాలపాడు గ్రామానికి చెందిన శానంపూడి హరినాథ్‌రెడ్డికి నాలుగేళ్ల కిందట సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన కృష్ణవేణి(20)తో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల బాలుడు ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరు తరచు గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో కృష్ణవేణి 15రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. అయితే ఆదివారం హరినాథ్‌రెడ్డి వరసకు బావ అయిన వెంకటరమణారెడ్డి(47)ని తన భార్యను తీసుకురావాల్సిందిగా కోరాడు. దీంతో వెంకటరమణారెడ్డి ఏల్చూరు వెళ్లి పెద్దలతో మాట్లాడి కృష్ణవేణిని, ఆమె కుమారుడిని సోమవారం ఉదయం బైక్‌పై బయలుదేరాడు. బ్రాంచ్‌ కెనాల్‌ వద్దకు రాగానే కృష్ణవేణి బహిర్భూమికి వెళ్లాలని, బైక్‌ను ఆపమని కోరింది. బైక్‌ ఆపిన వెంటనే కృష్ణవేణి వెళ్లి కాలువలో దూకింది. హఠాత్‌ పరిణామంతో కృష్ణవేణిని కాపాడేందుకు వెంకటరమణారెడ్డి కూడా కాలువలోకి దూకాడు. అప్పటికే నీటి ప్రవాహంలో కృష్ణవేణి మునిగిపోగా అక్కడే ఉన్న స్థానికులు చిన్నతాడు సాయంతో వెంకటరమణారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకపోగా ప్రవాహానికి అతను మునిగిపోయాడు. దీంతో ఇద్దరు మృతిచెందారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పట్టాభిరామయ్య తెలిపారు. వెంకటరమణారెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

Updated Date - 2022-09-13T05:38:09+05:30 IST