బాలుడి కిడ్నాప్‌.. రూ.కోటి డిమాండ్‌

ABN , First Publish Date - 2022-10-04T06:03:45+05:30 IST

కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ల బాలుడిని పోలీసులు గంటల వ్యవధిలో రక్షించారు

బాలుడి కిడ్నాప్‌.. రూ.కోటి డిమాండ్‌
బాలుని కుటుంబాన్ని పరామర్శిస్తున్న మంత్రి విడదల రజిని

గంటల వ్యవధిలోనే బాలుడిని రక్షించిన పోలీసులు

పారిపోయిన కిడ్నాపర్లు


చిలకలూరిపేట, నరసరావుపేట లీగల్‌, అక్టోబరు3: కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ల బాలుడిని పోలీసులు గంటల వ్యవధిలో రక్షించారు. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. చెన్నైలో శరవణన్‌ అనే ఽధాన్యం వ్యాపారికి ఇద్దరు మగ పిల్లలు. అతని భార్య చిలకలూరిపేట పట్టణానికి చెందిన వారు. దసరా సెలవులు కావటంతో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకొని చిలకలూరిపేట మారుతీనగర్‌లోని పుట్టింటికి వచ్చింది. ఆదివారం రాత్రి వారిని తీసుకొని సమీపంలో ఉన్న గుడికి వెళ్లింది. ఇంటికి తిరిగి వచ్చే సమయంలో వారిలో చిన్న కుమారుడైన రాజీవ్‌సాయి కనిపించలేదు. చుట్టు పక్కల వెతికినప్పటికీ ప్రయోజనం లేదు. కొద్దిసేపటి తరువాత గుర్తు తెలియని వ్యక్తులు తాము ఆ బాలుడిని కిడ్నాప్‌ చేశామని చెన్నైలోని అతని తండ్రికి ఫోన్‌ చేసి చెప్పారు. రూ.కోటి ఇస్తేనే ఆ బాలుడిని క్షేమంగా వదిలి పెడతామన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు అర్బన్‌ పోలీసులకు సమాచారం అందించారు. మంత్రి విడదల రజినికి కూడా ఈ సమాచారం చెప్పారు. రజిని ఈ సంఘటనపై పోలీసులను అప్రమత్తం చేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి కిడ్నాపర్ల గురించి తెలుసుకొనేందుకై రెండు స్పెషల్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్‌ సూచనల మేరకు చిలకలూరిపేట అర్బన్‌ సీఐ జి.రాజేశ్వరరావు, అర్బన్‌ ఎస్‌ఐ ఫిరోజ్‌, మరి కొంతమంది కిడ్నాపర్ల ఆచూకీ తెలుసుకొనేందుకు ఫోన్‌ను ట్రాక్‌ చేశారు. ఈ లోగా పోలీసుల సూచన మేరకు చెన్నైలో ఉన్న బాలుని తండ్రి శరవణన్‌ కూడా తాను రూ.కోటి ఇవ్వలేనని, కొంత డబ్బు ముట్ట చెపుతానని కిడ్నాపర్లకు సమాచారం ఇచ్చాడు. చివరకు కిడ్నాపర్లు కావలి ప్రాంతంలో కారులో చెన్నై వైపు వెళ్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రోడ్డు పక్కన ఒక బ్యాగ్‌ను పెట్టి అక్కడ వదిలి వెళ్ళాలని బాలుని తండ్రికి కిడ్నాపర్లు సూచించారు. ఆ ప్రాంతంలో నెల్లూరు పోలీసుల సహాయంతో చిలకలూరిపేట పోలీసులు నిఘా వేశారు. ఈ సమయంలో బాలుని కిడ్నాప్‌ చేసి తీసుకు వెళ్తున్న కారును చిలకలూరిపేట పోలీసులు కావలి వద్ద గుర్తించారు. ఆ కారును వెంబడించారు. కిడ్నాపర్లు ఆ బాలుడిని కారులో నుంచి కిందకు నెట్టి వేసి కారుతో సహా పరారయ్యారు. కిడ్నాపర్లు మొత్తం ముగ్గురు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ కారు వివరాలు కూడా పోలీసులు సేకరించారు. కాగా మంత్రి విడదల రజిని సోమవారం కిడ్నాప్‌ అయిన బాలుని గృహాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కేవలం పది గంటల్లోనే కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులను ఆమె అభినందించారు.  

Updated Date - 2022-10-04T06:03:45+05:30 IST