అమరావతినే రాజధానిగా కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-09-09T05:11:48+05:30 IST

అమరావతి నుండి అరసవల్లి వరకు అమరావతి రైతుల పాదయాత్రకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు అన్నారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి
ప్రసంగిస్తున్న సీపీఎం రాష్ట్రకార్యదర్శి వీ. శ్రీనివాసరావు

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ఉండవల్లి నుంచి తుళ్లూరుకు సీపీఎం బైక్‌ ర్యాలీ 

తాడేపల్లి, సెప్టెంబరు8: అమరావతి నుండి అరసవల్లి వరకు అమరావతి రైతుల పాదయాత్రకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీ.శ్రీనివాసరావు అన్నారు. గురువారం తాడేపల్లి మండలం ఉండవల్లి కూడలి నుంచి తుళ్ళూరు వరకు అమరావతి రైతులకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కోర్టు తీర్పును గౌరవించి, ప్రభుత్వం అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని, అమరావతి నిర్మాణానికి కేంద్ర నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానుల అంశానికి స్వస్తి పలకాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, కళ్లం రాజశేఖర్‌రెడ్డి సీపీఎం నేతలు సీహెచ్‌.బాబూరావు, పాశం రామారావు, జొన్నా శివశంకర్‌, ఎం.రవి, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, అమరావతి జేఏసీ నేతలు, సీపీఎం నేతలు బైకు ర్యాలీగా తుళ్ళూరు వెళ్లారు. 

పాదయాత్రకు మద్దతుగా 10న సీపీఎం దీక్ష..

ఈ నెల 12న అమరావతి నుండి అరసవల్లి వరకు జేఏసీ ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఈ నెల 10న ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం తాడేపల్లి మండల కమిటి ఆధ్వర్యంలో పాతూరు రోడ్డు వద్ద దీక్షా, సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు మోదుగుల శ్రీనివాసరెడ్డి, కాజ వెంకటేశ్వరరావు తెలిపారు.


రైతుల దీక్షలకు సంఘీభావం..

తుళ్లూరు: బైకు యాత్రలో భాగంగా సీపీఎం నేతలు మందడం, వెలగపూడి, తుళ్లూరు రైతు ధర్నా శిబిరాల వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తుళ్లూరు రైతు శిబిరంలో బాబురావు మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి అయినా అమరావతిని కొనసాగేలా చేస్తామన్నారు. అమరావతి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ముద్దాయిలేనని పేర్కొన్నారు. సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఢిల్లీని తలదన్నే రీతిలో అమరావతిని నిర్మాస్తామని చెప్పి మోదీ మోసం చేశారని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లు  మోదీ పెట్టవద్దని అంటే సీఎం జగన్‌రెడ్డి పెడతాడా.. అని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం రాజధాని డివిజన్‌ నాయకులు ఎం.రవి, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 


Read more