జూనియర్లకు బదిలీలు.. సీనియర్లకు ఆప్షన్లు

ABN , First Publish Date - 2022-03-16T05:58:37+05:30 IST

ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలనా ప్రక్రియ ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పని, సిబ్బంది విభజన ప్రక్రియ జరుగుతున్నది.

జూనియర్లకు బదిలీలు.. సీనియర్లకు ఆప్షన్లు
గుంటూరు కలెక్టరేట్‌

కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు 

సమీకృత కలెక్టరేట్లకు కొనసాగుతున్న స్థలాల గుర్తింపు 

చివరి వారం లోపే కార్యాలయాలు, క్యాంపు ఆఫీసులు సిద్ధం

ఆంధ్రజ్యోతితో జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌



గుంటూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలనా ప్రక్రియ ప్రారంభించనున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో పని, సిబ్బంది విభజన ప్రక్రియ జరుగుతున్నది. ఈ క్రమంలో ప్రతిపాదిత బాపట్ల, పల్నాడు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ప్రతీ ప్రభుత్వ శాఖలో ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతున్నదన్నారు. సర్వీసులో జూనియర్లకు తప్పనిసరిగా కొత్త జిల్లాలకు బదిలీలు ఉంటాయన్నారు. అలా బదిలీ అయిన వారికి కొత్త జిల్లాల్లో పోస్టింగ్‌ చేస్తామన్నారు. సీనియర్లకు మాత్రం ఆప్షన్‌ ఇచ్చి కొత్త జిల్లాలకు వెళ్లే వారిని బదిలీ చేయడం జరుగుతుందన్నారు. అయితే కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు ఏ నిష్పత్తిలో చేస్తారన్న విషయంపై ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని తెలిపారు. వైశాల్యంపరంగా గుంటూరు చిన్నది అయినప్పటికీ జనాభా పరంగా ఎక్కువ జనసాంద్రత కలిగి ఉన్నదన్నారు. నరసరావుపేట, బాపట్ల జిల్లాల్లో జనాభా తక్కువ, విస్తీర్ణం ఎక్కువగా ఉన్నదన్నారు. ఆయా అంశాలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. దీనిపై చీఫ్‌ సెక్రెటరీ నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు చేపడతామన్నారు. ఇక ఫైళ్లన్నీ ఈ-ఆఫీసులోనే నడుస్తోన్నందున పెద్దగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి తాత్కాలిక భవనాలను గుర్తించినట్లు తెలిపారు. వాటిల్లో ప్రభుత్వం ప్రకటించిన తేదీ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోన్నామని కలెక్టర్‌ చెప్పారు. ప్రధానంగా 30 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందాయన్నారు. వాటిల్లో ముఖ్యంగా సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులతో పాటు ఆ ప్రాంత ప్రజలు కోరారని, దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు.  ఈ విషయంలో ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందన్నారు.


నరసరావుపేటలో పనులు ప్రారంభం

నరసరావుపేట/పల్నాడు జిల్లాకు సంబంధించి తాత్కాలిక కలెక్టరేట్‌, ఎస్‌పీ ఆఫీసుకు అవసరమైన కార్యాలయాలను నాగార్జునసాగర్‌ లింగంగుంట్ల ప్రాజెక్టు ఆఫీసు భవనాలను గుర్తించినట్లు తెలిపారు. అలానే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, ఎంపీడీవో ఆఫీసు, రాజీవ్‌ స్వగృహా భవనాల్లో అన్ని శాఖలు ఏర్పాటు చేస్తామన్నారు. అలానే కలెక్టర్‌ క్యాంపు ఆఫీసు - కమ్‌ రెసిడెన్స్‌, జాయింట్‌ కలెక్టర్లు, డీఆర్‌వో, ఎస్పీ క్యాంపు ఆఫీసునకు కూడా భవనాలు గుర్తించి వాటిల్లో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ నెల చివరి వారం లోపే ఆయా కార్యాలయాలు, క్యాంపు ఆఫీసులు/నివాసాలు సిద్ధం చేస్తామన్నారు. సమీకృత కలెక్టరేట్‌ల ఏర్పాటుకు నరసరావుపేటలో భూమిని గుర్తించినట్లు తెలిపారు. లింగంగుంట్ల అగ్రహారం గ్రామంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నదన్నారు.


ఏపీహెచ్‌ఆర్‌డీఐలో బాపట్ల కార్యాలయాలు

బాపట్ల జిల్లాలో ఏపీహెచ్‌ఆర్‌డీఐ భవనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిల్లో అధికారుల కార్యాలయాలు, క్యాంపు ఆఫీసుల ఏర్పాటుకు పనులు ప్రారంభించామని కలెక్టర్‌ చెప్పారు. బాపట్లకు సంబంధించి సమీకృత కలెక్టరేట్‌ల ఏర్పాటుకు వ్యవసాయ, మార్కెట్‌ కమిటీ స్థలాలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. 

 

Updated Date - 2022-03-16T05:58:37+05:30 IST