సచివాలయాలను పర్యవేక్షిస్తున్నారా.. లేదా?

ABN , First Publish Date - 2022-11-03T00:32:47+05:30 IST

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల పనితీరు మెరుగుపరచడంలో పర్యవేక్షణాధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి హెచ్చరించారు

సచివాలయాలను పర్యవేక్షిస్తున్నారా.. లేదా?
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆదేశాలిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ ఆగ్రహం

గుంటూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల పనితీరు మెరుగుపరచడంలో పర్యవేక్షణాధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సచివాలయాల తనిఖీలు నిర్దేశించిన లక్ష్యాల మేరకు చేయని అదికారులపై శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు. వారంలో మూడురోజుల పాటు మండల స్థాయి, ప్రత్యేక, వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, నోడల్‌ ఆఫీసర్లు సచివాలయాల తనిఖీలకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి అయిన సచివాలయాల్లో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు అందించాలన్నారు. మన బడి నాడు నేడు పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ రాజకుమారి, ట్రైనీ కలెక్టర్‌ శివ నారాయణ శర్మ, డిప్యూటీ కలెక్టర్లు భాస్కర్‌నాయుడు, మోవిడి వాణి, జడ్పీ సీఈవో శ్రీనివాసరెడ్డి, సచివాలయాల అఽధికారి మోహన్‌రావు, హౌసింగ్‌ ఈఈ శంకరరావు, డీఈవో శైలజ, డీఆర్‌డీఏ పీడీ హరిహరనాథ్‌, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు, సీపీవో శేషశ్రి పాల్గొన్నారు.

సచివాలయాల ద్వారా సేవలు పెంచాలి

సచివాలయాల ద్వారా అందిస్తోన్న సర్వీసుల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్‌ ఎంవేణుగోపాల్‌రెడ్డి సూచించారు. బుధవారం ఉదయం ఆయన స్థానిక అమరావతి రోడ్డులోని ముత్యాలరెడ్డినగర్‌లో 137, 138 వార్డు సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత సిబ్బంది హాజరుపట్టికని పరిశీలించిన కలెక్టర్‌ ఆ తర్వాత అక్కడ ప్రజలకు లభిస్తున్న సర్వీసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. రిజిష్టర్ల నిర్వహణ సక్రమంగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తాను సూచించిన అంశాలను చెప్పమని కోగా సిబ్బంది నీళ్లు నమలడంతో కలెక్టర్‌ వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో తాను మళ్లీ వస్తానని, అప్పటికి పనితీరు మెరుగుపడకపోతే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ శివన్నారాయణ శర్మ, నోడల్‌ అధికారి రవికిరణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-03T00:33:41+05:30 IST