90రోజులలో పేదలకు ఇంటి పట్టాలందజేయండి

ABN , First Publish Date - 2022-12-10T01:35:14+05:30 IST

బాపట్ల, డిసెంబరు 9: నిరుపేదలకు 90రోజులలో ఇంటి పట్టాలు పంపిణీ చేయటానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ ఆదేశించారు.

90రోజులలో పేదలకు ఇంటి పట్టాలందజేయండి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌, పక్కన జేసీ శ్రీనివాసులు, డీఆర్వో లక్ష్మీ శివజ్యోతి

బాపట్ల, డిసెంబరు 9: నిరుపేదలకు 90రోజులలో ఇంటి పట్టాలు పంపిణీ చేయటానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై సంబంధిత శాఖాధికారులతో శుక్రవారం స్థానిక స్పందన సమావేశపు మందిరంలో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యాలను గుర్తించి నిరుపేదలకు నివాసం కల్పించాలని కలెక్టర్‌ చెప్పారు. జిల్లావ్యాప్తంగా 1995 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. భూమి ఉన్నప్పటికీ పేదలకు ఇంటి స్థలం ఎందుకు కేటాయించటంలేదని అధికారులను నిలదీశారు. బాపట్లలో చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలన్నారు. భూ హక్కు పత్రాల జారీలో జాప్యాన్ని ఆమె ప్రశ్నించారు. వివిధ అంశాలలో పురోగతి లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.1.96కోట్ల నిధులు సర్వే కోసం విడుదలైనప్పటికి వినియోగించకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. భూ బదలాయింపులపై 1643 అర్జీలు పెండింగ్‌లో ఉండటం సరికాదన్నారు. ఓటర్ల జాబితా సవరణ కోసం ప్రజల నుంచి 29,082 దరఖాస్తులు రాగా నేటికి 17వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండటంపై తక్షణమే విచారించాలన్నారు. జిల్లాలో మృతి చెందిన 33,478 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించే అంశంపై సమగ్ర విచారణ చేయాలన్నారు. వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలోని తహసీల్దార్ల పనితీరు సరిగ్గా లేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు.

ఫ భూముల రీ సర్వేలో హద్దురాళ్లు వేసే ప్రక్రియ ఆశాజనకంగా లేదని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటివరకు 277 గ్రామాలలో డ్రోన్‌ ద్వారా భూముల చిత్రీకరణ సాగుతుందన్నారు. 82గ్రామాలలో డ్రోన్‌ ప్రక్రియ ముగిసిందన్నారు. భూ హక్కుల పత్రాలు 829 సిద్ధం కాగా కేవలం 323 మందికి ఈకేవైసీ పూర్తిచేయటంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్‌వో కె.లక్ష్మీశివజ్యోతి, ఆర్డీవోలు గంధం రవీందర్‌, పి.సరోజనీ, పార్ధసారధి, తహసీల్దార్లు పాల్గొన్నారు.

కర్లపాలెం, వేమూరు కార్యదర్శుల సస్పెన్షన్‌

బాపట్ల, డిసెంబరు 9: ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలను ప్రారంభించకపోతే బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తామని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వాహణపై నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్‌ అధికారులతో శుక్రవారం కలెక్టర్‌ సమీక్షించారు. గ్రామాలకు శాశ్వత సంపదగా ప్రభుత్వ భవనాలను మంజూరు చేస్తే ఇప్పటి వరకు నిర్మాణాలను ఎందుకు ప్రారంభించలేదని అధికారులను నిలదీశారు. సామాజిక మరుగుదొడ్ల సముదాయ భవనాలు 476 డిసెంబరు 31లోగా పూర్తి చేయాలని లక్ష్యం నేటికి నెరవేరలేదని కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. అన్ని పంచాయతీ బ్యాంక్‌ ఖాతాలకు నిధులు సమకూర్చినప్పటికి పనులు చేయటంలేదని వారం రోజులలో పనులలో పురోగతిలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్‌ ఇంజనీర్ల పనితీరు సరిగాలేదన్నారు. వేమూరు, కర్లపాలెం గ్రామ కార్యదర్శులను సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.

సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, డీఆర్‌వో కె.లక్ష్మీశివజ్యోతి, ప్రకాశం జడ్పీ సీఈవో బి.జాలిరెడ్డి, డ్వామా పీడీ వై.శంకర్‌నాయక్‌, డీఆర్‌డీఏ పీడీ డాక్టర్‌ బి.అర్జునరావు, మెప్మా పీడీ పి.రవికుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, పీఆర్‌ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

ఫ గ్రామాలలో జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ చెప్పారు. ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలతో స్థానిక స్పందన హాలులో శుక్రవారం సమావేశమైన కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాలలో విద్యుత్‌ దీపాల సర్వే పక్కాగా చేపట్టాలన్నారు. పంచాయతీలలో అనధికార లేఅవుట్‌లకు చట్టబద్ధత కల్పించే అంశంపై అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు చెప్పారు. సమావేశంలో డీపీవో, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:35:27+05:30 IST