నేడు జిల్లాకు సీజేఐ రాక
ABN , First Publish Date - 2022-12-30T00:36:43+05:30 IST
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ్ వై చంద్రచూడ్ నేడు గుంటూరు జిల్లాకు రానున్నారు.

గుంటూరు(లీగల్), డిసెంబరు 29: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ్ వై చంద్రచూడ్ నేడు గుంటూరు జిల్లాకు రానున్నారు. గురువారం సాయంత్రం తిరుపతి నుంచి ఆయన విజయవాడ చేరుకున్నారు. మంగళగిరి మండలం కాజలో నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యూడిషియల్ అకాడమీని శుక్రవారం ఉదయం 9 గంటలకు జస్టిస్ చంద్రచూడ్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్యాట్రన్ ఇన్‌చీఫ్‌గా, జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ప్రెసిడెంట్‌గా, జస్టిస్ ఏవీ శేషసాయి, జిస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ డీవీవీ సోమయాజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రరాయ్లు గవర్నర్లుగా విభజిత ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఈ జ్యూడీషియల్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక నుంచి రాష్ట్రంలోని న్యాయమూర్తులకు శిక్షణా కార్యక్రమం ఇక్కడి నుంచే నిర్వహించనున్నారు. అకాడమీ ప్రారంభించిన అనంతరం జస్టిస్ చంద్రచూడ్ ఏఎన్‌యూలో డైక్మెన్ ఆడిటోరియానికి చేరుకుంటారు. 9.45 గంటలకు రాష్ట్ర హైకోర్టు రికార్డులను డిజిటలీకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఫౌండేషన్ కార్యక్రమంతో పాటు కోర్టులో ఉన్న పత్రాలకు నకళ్లను ఆన్లైన్ ద్వారా జారీ చేసే సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం రాష్ట్రంలో పనిచేస్తున్న న్యాయమూర్తుల నుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్ర హైకోర్టులోని మాన్యువల్ రిపోర్టును కూడా విడుదల చేయనున్నారు.
Read more