ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి

ABN , First Publish Date - 2022-10-04T06:12:19+05:30 IST

పట్టణ పరిధిలో ఓగేరు వాగులో సోమవారం ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన జరిగింది.

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి
కార్తీక్‌, మోహన సాయి హనీష్‌

చిలకలూరిపేట, అక్టోబరు 3: పట్టణ పరిధిలో ఓగేరు వాగులో సోమవారం ఈతకు వెళ్ళి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంఘటన జరిగింది. స్థానిక బొబ్బాల సత్యనారాయణ వీధికి చెందిన నూతలపాటి కార్తీక్‌(14), దాసరి బజారుకు చెందిన పి.మోహన సాయి హనీష్‌(13) స్నేహితులు. వారిద్దరు వేర్వేరు పాఠశాలల్లో 8, 7 తరగతులు చదువుతున్నారు. వీరిద్దరు కొంతసేపు సరదాగా క్రికెట్‌ ఆడుకొని అనంతరం ఓగేరు వాగులో ఈతకు దిగారు. పట్టు తప్పి వాగులో కొట్టుకు పోతుండగా కేకలు విన్న స్థానికులు హుటాహుటిన వారిద్దరిని వాగులో నుంచి బయటకు తీసుకు వచ్చారు. తొలుత స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు వారు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more