వర్షంలోనూ.. జనసందోహం

ABN , First Publish Date - 2022-12-10T01:15:40+05:30 IST

తుఫాన్‌ హెచ్చరికలు.. మరోవైపు వర్షపు చినుకుల మధ్య శుక్రవారం చంద్రబాబు పర్యటన సాగింది. దారిపొడవునా చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వర్షపు చినుకుల మధ్యే రోడ్డుకు ఇరువైపులా వేచిఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు రోడ్డుషోలో పాల్గొన్నారు.

వర్షంలోనూ.. జనసందోహం
బాపట్ల సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

ఒకవైపు వర్షం.. మరోవైపు పూల స్వాగతం.. చినుకులు పడుతున్నా.. లెక్కచేయకుండా అభిమాన నేతకు స్వాగతం పలికేందుకు జన నిరీక్షణల మధ్య శుక్రవారం చంద్రబాబు పర్యటన సాగింది. రెండో రోజు ఇదేంఖర్మ ఈ రాష్ర్టానికి కార్యక్రమంలో భాగంగా పొన్నూరు, బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించారు. తొలుత రాత్రి బస అనంతరం శుక్రవారం పొన్నూరులో ముస్లింలతోను ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో వేర్వురుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత చుండూరుపల్లి నుంచి ర్యాలీగా బయల్దేరిన చంద్రబాబుకు దారి పొడవునా అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు బారులు తీరి ఆహ్వానం పలికారు. తమకు ఉపాధి దొరకాలంటే మళ్లీ మీరే రావాలనే నినాదాలతో యువత హోరెత్తించింది.

బాపట్ల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ హెచ్చరికలు.. మరోవైపు వర్షపు చినుకుల మధ్య శుక్రవారం చంద్రబాబు పర్యటన సాగింది. దారిపొడవునా చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వర్షపు చినుకుల మధ్యే రోడ్డుకు ఇరువైపులా వేచిఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు రోడ్డుషోలో పాల్గొన్నారు. చుండూరుపల్లి గ్రామం మీదగా బాపట్ల నియోజకవర్గంలోకి ప్రవేశించిన చంద్రబాబుకు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ స్వాగతం పలికారు. అక్కడ నుంచి బైక్‌ ర్యాలీతో ఈతేరు గ్రామానికి చేరుకున్న చంద్రబాబు సాధారణ వ్యక్తిగా రోడ్డుపక్కనే ఎస్సీకాలనీలో ఉన్న బత్తుల విజయకుమారి టీస్టాల్‌ వద్దకు వెళ్ళి టీతాగుతూ వారితో ముచ్చటించారు. ప్రస్తుత పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అప్పికట్ల చేరుకున్న చంద్రబాబుకు మహిళలు రంగవల్లులతో స్వాగతం పలికారు. అక్కడ నుంచి కొండ్రుభట్లవారిపాలెం, బ్రిడ్జి మీదగా ర్యాలీ బాపట్లకు చేరుకోగానే ఇసుకేస్తే రాలనంత జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. అక్కడ నుంచి జనసంద్రం మధ్యలో చీలురోడ్డు, గడియార స్థంభం మీదగా ర్యాలీ అంబేడ్కర్‌ కూడలికి చేరుకుంది. అక్కడ హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. బైక్‌ ర్యాలీలో యువత కేరింతలు కొట్టింది. జయహో చంద్రబాబు అంటూ అభిమానులు చేసిన సందడితో బాపట్ల పట్టణం దద్దరిల్లింది. బాపట్లలో వరుసగా నాలుగు సార్లు టీడీపీ పరాజయం పాలైంది. ఈ దఫా విజయం సాధించి కిక్‌ అందిద్దామని ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ అన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ బాపట్లలో వర్మ గెలుపే ధ్యేయంగా అందరూ పనిచేయాలని సూచించారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌ చుండూరుపల్లి వరకు చంద్రబాబు సహా వచ్చి ఆయనకు వీడ్కోలు పలికారు. అక్కడ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్‌, బాల వీరాజంనేయస్వామితో కలిసి టీడీపీ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మ బాపట్ల నియోజకవర్గంలోకి చంద్రబాబును ఆహ్వానించారు. వీరితో పాటు టీడీపీ నాయకులు మల్యాద్రి, దామచర్ల సత్య, మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజా తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో ర్యాలీతో వచ్చిన చీరాల ఇన్‌చార్జి ఎంఎం కొండయ్య చంద్రబాబుకు అంబేడ్కర్‌ కూడలి వద్ద స్వాగతం పలికారు

నేటి చీరాల పర్యటన రద్దు

తుఫాన్‌ వల్ల చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ ప్రకారం శనివారం జరగాల్సిన కార్యక్రమాలు రద్దయ్యాయి. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం శుక్రవారం రాత్రి బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో బస చేసి శనివారం ఉదయం ఎస్సీ నేతలతో సమావేశం, విద్యార్థులతో ఇంటరాక్షన్‌ కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం నుంచి చీరాలలో రోడ్డు షో జరగాల్సి ఉంది. అయితే తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఆయా కార్యక్రమాలను రద్దు చేశారు. దీంతో శుక్రవారం రాత్రి బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి చంద్రబాబు తిరుగుపయనమయ్యారు

కోనా.. సమాధానం చెప్పు

అసైన్డ్‌ భూముల్లో మట్టి తవ్వకాలు, ఇసుక మాఫియా, వైద్య కళాశాల అసైన్డ్‌ భూముల్లో 30 కోట్లకు స్కెచ్‌, అంగన్‌వాడీ టీచర్‌ కొలువుల అమ్మకం, గరుడాచలంనాయుడు తూర్పు సరత్రాన్ని కొట్టేయడానికి పథకం, పెట్రోలు బంకు విషయంలో ఏకఛత్రాధిపత్యం.. ఇలా అన్ని విషయాలపై వచ్చి సమాధానం చెప్పాలని స్థానిక ఎమ్మెల్యే కోనరఘుపతి అరాచకాలపై సూటిగా ధ్వజమెత్తారు. సూర్యలంకలో సినిమా స్టూడియో నిర్మాణం కోసం 500 ఎకరాల స్వాహా కోసం పథకం రచించారని ఆరోపించారు. ఏ-2 విజయసాయిరెడ్డితో కలిసి 4,000 ఎకరాల అటవీ భూములను కైంకర్యం చేయడానికి పథకం రచిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్‌ కూడలి దగ్గర ఉన్న స్థలాన్ని తనకు అమ్మలేదని చెప్పి టాయిలెట్స్‌ కట్టించిన ఘనత ఆయనదని స్థానిక ఎమ్మెల్యేపై మండిపడ్డారు. కోన అక్రమాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని వారికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

====================================================================

Updated Date - 2022-12-10T01:15:43+05:30 IST