ఏమరపాటు తగదు

ABN , First Publish Date - 2022-12-10T01:25:02+05:30 IST

‘ప్రజల్లో వస్తున్న స్పందన చూసి గెలుపు ధీమా వద్దు.. ఏమరుపాటు అవసరం.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. జగన్‌ అనే దుర్మార్గుడితో మనం పోరాడుతున్నాం.

ఏమరపాటు తగదు
పొన్నూరు నియోజకవర్గం చింతలపూడిలో శతాధిక వృద్ధురాలు ధూళిపాళ్ల ఇందిరాదేవి నుంచి ఆశీస్సులు తీసుకుంటున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు

పొన్నూరుటౌన్‌, డిసెంబరు 9: ‘ప్రజల్లో వస్తున్న స్పందన చూసి గెలుపు ధీమా వద్దు.. ఏమరుపాటు అవసరం.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. జగన్‌ అనే దుర్మార్గుడితో మనం పోరాడుతున్నాం. కుట్రలు, కుతంత్రాలతో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని అవకాశాలు ఉంటే అన్నిటినీ వాడుకుంటున్నాడు. ప్రతి కార్యకర్త, నాయకుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి.. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం..’ అని చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం పొన్నూరలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించాలని చూడడంతోపాటు దొంగ ఓట్లను చేర్చుకోవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా కుయుక్తులు పన్నుతున్నారన్నారు. ఇటువంటి కుయుక్తులు, కుతంత్రాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలన్నారు. 2019 ఎన్నికల్లో జరిగిన పొరపాట్ల వల్ల రాష్ట్రం అధోగతిపాలైందని మళ్లీ ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. ఎవరి స్థాయిలో వారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకంపై చర్చిస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. నరేంద్రలాంటి సమర్ధుడిని శాసనసభకు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. అలాంటి సమర్ధుడు రైతుల తరపున పోరాడుతుంటే అమూల్‌ బేబి జగన్‌ అక్రమ కేసులతో నరేంద్రను జైల్లో నిర్బంధించారన్నారు. నరేంద్ర గుండె ధైర్యం కలవాడు కాబట్టి వైసీపీ అక్రమాలను తట్టుకుని నిలబడి సంగం డెయిరీని కాపాడుకోవడంతోపాటు పొన్నూరులో ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఇలాంటి సమర్ధుడిని గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలన్నారు. నరేంద్రకుమార్‌ అధ్యక్షత వహించిన సమావేశంలో కార్యకర్తల్లో చంద్రబాబు సమరోత్సాహాన్ని నింపారు. ఈ సమావేశంలో టీడీపీ గుంటూరు జిల్లా కన్వీనర్‌ తెనాలి శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం అక్కడే బాత్‌చిత్‌ విత్‌ బాబు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నియోజకవర్గానికి చెందిన మైనార్టీ సోదరులు హాజరై చంద్రబాబుతో ముఖాముఖి సంభాషించారు. మైనార్టీ సోదరులు అడిగిన ప్రతి ప్రశ్నకు, సమస్యకు చంద్రబాబు నేరుగా సమాధానమిచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అధినేతతో నేరుగా సంభాషించే అవకాశం లభించడంతో మైనార్టీ సోదరులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. రెండు గంటలకు పైగా మాటామంతి కార్యక్రమం సాగింది.

చంద్రబాబుతో నేతల ముఖాముఖి

ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొనేందుకు పొన్నూరు విచ్చేసిన చంద్రబాబుతో గుంటూరు, బాపట్ల జిల్లాల ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. చంద్రబాబు గురువారంరాత్రి బస చేసిన జీబీసీ రోడ్డులోని కన్వ్షెన్‌ సెంటర్‌కు ఉదయం టీడీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తిని జయలక్ష్మి, శాసన మండలి మాజీ చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌, బాపట్ల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎంపీ శ్రీరామ్‌మాల్యాద్రి తదితరులు భేటీ అయ్యారు. చంద్రబాబు బస చేసిన కార్‌వ్యాన్‌లోకి ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్లి చంద్రబాబుతో చర్చలు జరిపారు.

వర్షంలోనూ స్వాగతాలు..

పొన్నూరులో కార్యక్రమాల అనంతరం చంద్రబాబు కాన్వాయ్‌ బాపట్ల బయల్దేరగా ఆకాశం మేఘావృతమై మార్గమధ్యలో వర్షం పడింది. అయినా దారిపొడవునా ప్రజలు చంద్రబాబు కోసం బంతిపూలతో స్వాగతం పలికారు. ఒకవైపు వాన చినుకులు.. మరోవైపు పూల వర్షంతో చంద్రబాబు కాన్వాయ్‌ సాగింది. వీవర్స్‌కాలనీ వద్ద నేత సంఘాల నాయకులు, మహిళలు, కార్మికులు చంద్రబాబును చూసేందుకు పోటీపడ్డారు. అక్కడి నుంచి నరేంద్ర స్వగ్రామమైన చింతలపూడి చేరుకునేటప్పటికి ఆ గ్రామంలో టిడిపి శ్రేణులు చంద్రబాబుకు ఘనస్వాగతమిచ్చారు. చింతలపూడిలో వద్ద వేచి ఉన్న ప్రజల మధ్య వీల్‌ఛైర్‌లో 102 ఏళ్ల వయస్సున్న ధూళిపాళ్ళ ఇందిరాదేవిని చూసిన చంద్రబాబు కాన్వాయ్‌ని ఆపించి మరీ వృద్ధురాలి వద్దకు వెళ్లి యోగక్షేమాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇందిరాదేవి చంద్రబాబుతో మాట్లాడుతూ ఆయనను చూడడానికి వేచి ఉన్నానని చెప్పడంతో చంద్రబాబు ఉబ్బితబ్బియి ఆమె కాళ్లకు ప్రణమిళ్లారు. ఈ సందర్భంగా ఇందిరాదేవి చంద్రబాబు తలపై పూలు వేసి మళ్ళీ నువ్వే రావాలి నీ కోసం వచ్చే ఎన్నికల్లో వీల్‌ఛైర్‌లో వెళ్లి మరీ ఓటు వేస్తానని చెప్పడంతో చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు. నరేంద్ర గృహం వద్ద ఆయన సతీమణి ధూళిపాళ్ళ జ్యోతిర్మయి ఆధ్వర్యంలో మహిళలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. అప్పటికే వర్షం ప్రారంభమవడంతో చంద్రబాబు గొడుగు సహాయంతో కాన్వాయ్‌ నుంచే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. మాచవరం, ములుకుదురు, చుండూరుపల్లి మీదగాయాత్ర బాపట్ల నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జోరువానను సైతం లెక్క చేయకుండా రెట్టించిన ఉత్సాహంతో శ్రేణులు చంద్రబాబుకు అపూర్వరీతిలో వీడ్కోలు పలికారు.

Updated Date - 2022-12-10T01:25:06+05:30 IST