దోచేసి.. దర్జాగా..

ABN , First Publish Date - 2022-12-12T00:05:21+05:30 IST

గుంటూరు నగరపాలక సంస్థలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.

దోచేసి..  దర్జాగా..

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు11: గుంటూరు నగరపాలక సంస్థలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వసూల్‌ రాజాలు చేసిందే చెల్లుబాటు అవుతోంది. తాజాగా జీఎంసీలో రికార్డుల ట్యాపరింగ్‌పై ‘రికార్డుల్లో.. గోల్‌మాల్‌’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడిన విషయం పాఠకులకు తెలిసిందే. దీనిపై స్పందించిన నగర మేయర్‌ మనోహర్‌ నాయుడు నేరుగా కమిషనర్‌ కీర్తి చేకూరిని కలిసి ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. విచారణ అధికారిగా ఎవరినీ నియమించలేదు. విషయం తెలుసుకున్న సంబంధిత అధికారి ఒకరు వీఆర్‌ఎస్‌ పెట్టి వెళ్లిపోవాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.

నగరపాలక సంస్థ పరిధిలో 1985కి ముందు ఆస్తిపన్ను ఉంటే ఆ స్థలంలో నిర్మాణాలకు జీఎంసీ అనుమతుల్లో కొంతమేరకు రాయితీ ఉంటుంది. ఆ స్థలంలో నిర్మాణం చేపట్టే భవనాలకు 14శాతం సిటీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(సీడీఎఫ్‌) చెల్లించే పనిలేకుండా అనుమతులు పొందవచ్చు. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు అధికారులు 1985కు ముందు ఆయా స్థలాలకు పన్ను లేకపోయినప్పటికీ, ఉన్నట్లుగా రికార్డ్‌ రూమ్‌లో పలు రికార్డులను ట్యాంపరింగ్‌ చేసినట్లు సమాచారం. తద్వారా దరఖాస్తుదారులకు భారీగా మేలు జరిగే విధంగా అక్కడి అధికారులు సహకరించారు. అధికారులు సహకరించినందుకు గాను వారికి కూడా భారీగా లక్షల్లో ముడుపులు చెల్లించారు. ఇలా కోట్లాది రూపాయలను కాజేసినట్లు ఆరోపణల గుప్పుమంటున్నాయి. మొత్తం 925 తప్పుడు ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు తెలుస్తోంది.

కాగా.. రికార్డు రూమ్‌లో ఈ అక్రమాలకు సంబంధం ఉన్న అధికారి తాను స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి వెళ్తానని, తనకు రావలసిన బెనిఫిట్స్‌ ఇప్పించాలని కమిషనర్‌ను కోరినట్లు సమాచారం. తన సామాజికవర్గానికి చెందిన ఒక కార్పొరేటర్‌ ద్వారా అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ పెద్ద వద్ద పంచాయతీ పెట్టినట్టు తెలిసింది. గతంలో కార్పొరేషన్‌లో ఓ ఉద్యోగి ఒకరు ఏకంగా కాంట్రాక్టర్ల సొమ్ము దోచుకున్నాడు. బ్యాంక్‌ అధికారులు, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌తో చేతులు కలిపి ఈ అక్రమాలకు పాల్పడ్డాడు. అధికార పార్టీ చెందిన కొందరు పెద్దలు ఈ రెండు కుంభకోణాలపై రంగంలోకి దిగారు. తొందరపడి ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, దర్యాప్తుకు ఆదేశించవద్దని కమిషనర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గుతారా? లేక నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపిస్తారా వేచి చూడాల్సిందే.

Updated Date - 2022-12-12T00:05:21+05:30 IST

Read more