అమరావతి అభివృద్ధితోనే రాష్ర్టానికి మేలు

ABN , First Publish Date - 2022-12-30T01:16:45+05:30 IST

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని కొనసాగించి ఉంటే అప్పు అడిగే దుస్థితికి వచ్చేది కాదని 33 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.

అమరావతి అభివృద్ధితోనే రాష్ర్టానికి మేలు
తుళ్లూరు ధర్నా శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

తుళ్లూరు, డిసెంబరు 29: రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని కొనసాగించి ఉంటే అప్పు అడిగే దుస్థితికి వచ్చేది కాదని 33 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, హైకోర్టు తీర్పును అమలు చేయాలని రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న ఆందోళనలు శుక్రవారం 1108వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, ప్రభుత్వం ఆడుతున్న మూడుముక్కల ఆటతో అప్పులు పాలై బజారున పడ్డామన్నారు. ప్రత్యేక హోదాను అడిగే దమ్ము సీఎం జగన్‌రెడ్డికి లేదని విమర్శించారు. విభజన చట్టంలో హామీలు ప్రధాని వద్ద ప్రస్తావించకపోవటం ఏపీ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. సీఆర్డీఏ చట్టాన్ని కూడా కాదని మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవటంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. ప్రభుత్వం మేల్కొని అమరావతి అభివృద్ధిని చేస్తే కొంతవరకు రాష్ర్టానికి మేలు జరుగుతుందన్నారు. రైతులకు ప్రజల మద్దుతు పూర్తిగా ఉందని పేర్కొన్నారు. మూడు ముక్కల ఆటకు స్వస్తి పలకపోతే ప్రజలు తగిన బుద్ధి చెపుతారని హెచ్చరించారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి నినాదాలు చేశారు.

Updated Date - 2022-12-30T01:16:47+05:30 IST