మాపై హత్య కేసు బనాయించాలని చూస్తున్నారు..

ABN , First Publish Date - 2022-09-14T05:26:15+05:30 IST

వైసీపీ నేతల్లోనే ఓ వ్యక్తిని చంపి తమపై హత్యకేసు బనాయించాలని చూస్తున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు.

మాపై హత్య కేసు బనాయించాలని చూస్తున్నారు..
విలేకరులతో మాట్లాడుతున్న బ్రహ్మారెడ్డి

ఇందుకోసం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు..

వైసీపీపై జూలకంటి బ్రహ్మారెడ్డి తీవ్ర ఆరోపణలు

మాచర్ల, సెప్టెంబరు 13: వైసీపీ నేతల్లోనే ఓ వ్యక్తిని చంపి తమపై హత్యకేసు బనాయించాలని చూస్తున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గంలో చంద్రయ్య, జల్లయ్యలను హత్య చేసి ఫిర్యాదుదారులనే దోషులుగా చూపారన్నారు. తనపై, పార్టీ నేతలపై గానీ హత్యకేసులు పెట్టేందుకు పథకం పన్నుతున్నారని ఇందుకు టీడీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇందులో భాగంగానే మండలంలోని తోట చంద్రయ్య పొలంలో కలుపు మందు చల్లారని ఆరోపించారు. దీనిపై పోలీస్‌స్టేషన్లో కేసుపెడితే అందులో ఒకరిని అరెస్ట్‌ చూపి, టీడీపీ నేతలపై మర్డర్‌ కేసు బనాయించాలనేది వైసీపీ ఆలోచన అన్నారు. ఇటువంటి పథకాలు రచించే వారి పతనానికి ఇది నాంది అవుతుందన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తల దాడిలో టీడీపీ నేతలు గాయపడితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పరిస్థితి లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుటుంబీకులపై పిచ్చి ప్రేలాపణలు చేయడం హేయమన్నారు. ఇళ్లలో ఉండే ఆడవారి గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. మీకు చెల్లి, తల్లి లేరా, వారిని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. బూతులు మాట్లాడే వారికి మంత్రి పదవులివ్వడం వైసీపీ సంస్కృతి అన్నారు. ఇటువంటి వ్యక్తులను చట్టసభలకు పంపామా అంటూ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. సమావేశంలో  తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కుర్రి శివారెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మున్నా రాంబాబు యాదవ్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు సాతులూరి కుమార్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమెర దుర్గారావు, మండల అధ్యక్షుడు నేరేటి వీరాస్వామి యాదవ్‌, సబ్బవరపు అబ్బిరెడ్డి, దుగ్గెంపూడి రామలక్ష్మయ్య, చప్పిడి రాము, పంగులూరి పుల్లయ్య, అంజయ్య, సింగు నాగేశ్వరరావు యాదవ్‌, మున్నా హనుమంతు, యర్రం పోలురెడ్డి, మాచర్ల బాబు, బొల్లెద్దుల బాబు, ప్రకాష్‌, నాగూర్‌, అన్వర్‌, బాబుఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-14T05:26:15+05:30 IST