‘మార్గదర్శి’ హెడ్‌ఆఫీసులో ఆడిట్‌

ABN , First Publish Date - 2022-12-10T02:20:42+05:30 IST

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ చట్టప్రకారం ఏటా ఇవ్వాల్సిన సమాచారం తమకు ఇవ్వడం లేదని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వి. రామకృష్ణ అన్నారు.

‘మార్గదర్శి’ హెడ్‌ఆఫీసులో ఆడిట్‌

ఆర్థిక స్థితి అంచనాకు త్వరలో చేపడతాం

ఏపీలో చిట్స్‌పై సమాచారం ఇవ్వడంలేదు: ఐజీ రామకృష్ణ

అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ చట్టప్రకారం ఏటా ఇవ్వాల్సిన సమాచారం తమకు ఇవ్వడం లేదని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వి. రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో ఉన్న మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో తనిఖీలకు వెళ్లిన తమ శాఖ అధికారులకు సహకరించలేదని, అడిగిన రికార్డులను ఇవ్వలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి త్వరలోనే పొరుగు రాష్ట్రంలోని(హైదరాబాద్‌) ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆడిట్‌ చేస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియలో నిపుణులైన ఆడిటర్లు, ఫోరెన్సిక్‌ ఆడిటర్లు పాలుపంచుకుంటారని తెలిపారు. ఈ క్రమంలో ఏవైనా లోపాలు బయటపడితే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామన్నారు. తాము అడిగిన రికార్డులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటీవలికాలంలో రాష్ట్రంలోని 35 చిట్‌ఫండ్‌ యూనిట్లలో తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రాసిక్యూట్‌ చేయడానికీ, సంస్థలను మూసివేయడానికీ వెనుకాడొద్దని రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు.

Updated Date - 2022-12-10T02:20:43+05:30 IST