బాల్యం..బలహీనం!

ABN , First Publish Date - 2022-09-27T05:21:24+05:30 IST

సమాజంలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.. దానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదంటూ ప్రభుత్వ పెద్దల ప్రకటనలకు కొదవే లేదు.

బాల్యం..బలహీనం!

పౌష్టికాహారం లోపంతో చిన్నారులు

ఐసీడీఎస్‌ ఆగస్టు నెల సర్వేలో వెల్లడి

67,781 మంది బాలల బరువు యాప్‌లో నమోదు

  

బాపట్ల, సెప్టెంబరు26(ఆంధ్రజ్యోతి): సమాజంలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.. దానికి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదంటూ ప్రభుత్వ పెద్దల ప్రకటనలకు కొదవే లేదు. కానీ క్షేత్రస్థాయిలో పోషకాహారం లోపంతో బాధపడే బాలలు ఇంకా గణనీయంగా ఉన్నారనే వాస్తవాన్ని ఐసీడీఎస్‌ ఆగస్టు నెలలో చేపట్టిన సర్వే బహిర్గతం చేసింది. వీరి లోపాలకు వారి ఇళ్లలో ఆర్థిక పరిస్థితి ఒక కారణం కాగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పాలు, గుడ్లు నాణ్యత లేకపోవడం మరో కారణంగా ఉంటుంది. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అయితే సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ ఆహారాన్ని పక్కదారి పట్టిస్తూ బాలల ఆరోగ్యం మీద దెబ్బ కొడుతున్నారు.  


అంగన్‌వాడీల ద్వారా పోషకాహారం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర శిశు అభివృద్ధి పథకంలో భాగంగా అంగన్‌వాడీల ద్వారా బాలలకు పౌష్టికాహారం అందిస్తున్నాయి.  ఎదుగుదలతో పాటు ఇతర లోపాలను బాల్యంలోనే కనిపెట్టడం ద్వారా దిద్దుబాటు చర్యలు తీసుకునే వీలుంటుందనే ఉద్దేశంతో ఆయా కేంద్రాల్లో ప్రత్యేక సర్వేను చేపట్టారు. ఈ వివరాలను పోషణ్‌ ట్రాకర్‌, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ యాప్‌లో నిక్షిప్తం చేశారు.


ఆగస్టు నెల సర్వేలో వెల్లడి..

జిల్లావ్యాప్తంగా తొమ్మిది ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,888 అంగన్‌వాడీ కేంద్రాలుండగా వీటిలో 18 మినీ అంగన్‌వాడీలుగా సేవలందిస్తున్నాయి. వీటన్నింటి పరిధిలో ఆగస్టు నెలలో సర్వేను సిబ్బంది చేపట్టింది. మొత్తం 67,781 బాలలను వివిధ కేటగిరీల్లో సర్వే చేసి వారి బరువు, ఎత్తు ఇతర అంశాలపై సమగ్రంగా సర్వే చేశారు. 


కేటగిరీల వారీగా లోపాలున్న పిల్లలు..

67,781 మంది బాలలను పరీక్షించగా వయసుకు తగ్గ ఎత్తు విషయంలో మధ్యస్థ ప్రభావం కలిగిన వారు 1,974, తీవ్రలోపం కలిగినవారు 634 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా వయసుకు తగ్గ బరువు విషయంలో స్వల్ప ప్రభావం ఉన్నవారు 2,481 బాలలను గుర్తిస్తే తీవ్రంగా ఉన్నవారిని 334 మందిగా నమోదు చేశారు. ఎత్తుకు తగ్గ బరువు కేటగిరీలో స్వల్ప లోపాలున్నవారిని 4,212 మందిగా గుర్తించగా తీవ్ర ప్రభావం ఉన్నవారిని 1,025 చిన్నారులను సర్వేలో గుర్తించారు. 

 

అవగాహన లోపమే కారణం..

ఈ లోపాలకు తల్లిదండ్రుల అవగాహన లోపంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం చెబుతున్నట్లుగా పిల్లల ఆహారంపై శ్రద్ధ చూపకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మాసోత్సవాలు నిర్వహించి తల్లులకు పోషకాహారంపై అవగాహన కల్పిస్తాం అనే మాటలు ప్రకటనలకే పరిమితం తప్ప క్షేత్రస్థాయిలో ఫలితాలు కనబడితే ఒట్టు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం విషయంలో నాణ్యత పాటించడంతో పాటు అవి పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొంతమంది సిబ్బంది పిల్లల ఆహారంపై కాసులు దండుకుంటున్నారు. ఇదిలా ఉంటే మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించాలంటే బిల్లులు సకాలంలో చెల్లించాలని నిర్వాహకులు వాపోతున్నారు. ఇచ్చే రేటు పెంచడంతో పాటు క్రమం తప్పకుండా తమకు ఇవ్వాల్సిన మొత్తాలను అందించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఇటీవల జరిపిన సమావేశంలో మహిళలతో పాటు చిన్నారులలో పోషకాహారలోపం ఉండడం పట్ల జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మెరుగైన ఫలితాలు రాబట్టడానికి కృషి చేయాలని సిబ్బందిని  ఆదేశించారు.


 

Read more