అమరావతి అజరామరం

ABN , First Publish Date - 2022-09-29T06:12:04+05:30 IST

పాలకులు ఎన్ని కుట్రలు పన్నినా అమరావతిని ఏమీ చేయలేరని, అమరావతి అజరామరమని రైతులు స్పష్టం చేశారు.

అమరావతి అజరామరం
తుళ్లూరు శిబిరంలో బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న మహిళలు

దానిని నిర్వీర్యం చేయాలనుకోవడం అవివేకం 

1016వ రోజుకు రైతు ఆందోళనలు 


తుళ్లూరు, సెప్టెంబరు 28: పాలకులు ఎన్ని కుట్రలు పన్నినా అమరావతిని ఏమీ చేయలేరని, అమరావతి అజరామరమని రైతులు స్పష్టం చేశారు. రాజధానిపై కుట్రలు కుతంత్రాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెపుతారని హితవు పలికారు. బిల్డ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు బుధవారం 1016వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ మూడు ముక్కల ఆటతో ఒరిగేది లేదన్నారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటారు తప్పా ఏమీ చేయలేరన్నారు. న్యాయస్థానం తీర్పును అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తే అధికారులు, ప్రజాప్రతినిధులు జైౖలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలన్నారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి బిల్డ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు.  

రైతుల దీక్షకు విశాఖవాసి  సంఘీభావం

 ఉత్తరాంధ్రులు, కడపజిల్లావాసులు మూడు రాజధానులు వద్దని రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతే కావాలంటున్నారని విశాఖవాసి, తెలుగు శక్తి అధ్యక్షుడు  బీవీ రామ్‌ తెలిపారు. బుధవారం ఆయన తుళ్లూరు రైతు ధర్నా శిబిరంలో దీక్షలో ఉన్న రైతులకు, మహిళలకు, రైతు కూలీలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ అక్టోబరు 23న విశాఖలో జరిగే పాదయాత్ర భద్రతకు స్పెషల్‌ ఫోర్స్‌ ఇవ్వమని కేంద్ర హోమ్‌ శాఖను కోరుతున్నట్లు తెలిపారు. 

Read more