ఫలించిన.. పోరాటం

ABN , First Publish Date - 2022-03-04T05:44:49+05:30 IST

అమరావతి రైతుల అలుపెరగని పోరాటం ఫలించింది...

ఫలించిన.. పోరాటం
బాణసంచా కాలుస్తున్న అమరావతి పరిరక్షణా సమితి జేఏసీ నాయకులు

అమరావతిపై హైకోర్టు తీర్పుతో సంబరాలు

807 రోజుల తర్వాత రాజధాని రైతుల ముఖాల్లో ఆనందం

బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచిన ఉద్యమకారులు

సహకరించిన ప్రతీ ఒక్కరికి పేరుపేరునా పాదాభివందనాలు

న్యాయదేవతకు పాలాభిషేకాలు

 

 ఒకటి, రెండు రోజులు కాదు... ఏకంగా 807 రోజుల నుంచి వారి ముఖాల్లో చిరునవ్వు అనేదే లేదు. నిత్యం పోరాటమే. ఎన్నోసార్లు ధూషణలు, లాఠీదెబ్బలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అక్రమ కేసులు, అరెస్టులతో అనునిత్యం టెన్షనే. పండగైనా... శుభకార్యం అయినా అంతా శిబిరాల్లోనే... రెండేళ్లకు పైగా ఆనందం అన్న పదానికి దూరమైన ఆ అన్నదాతలను ఎట్టకేలకు చిరునవ్వు పలకరించింది. ఇన్నాళ్లు పోరాడినందుకు ప్రతిఫలంగా సంతోషం కలిగించే సమాచారం రావడంతో వారంతా ఆనందసాగరంలో మునిగిపోయారు. ఏపీసీఆర్‌డీఏ చట్టం ప్రకారం అమరావతి రాజధానిని మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం యథాతథంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్డు ఆదేశించడంతో రైతుల్లో ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా ఆరునెలల అల్టిమేటం కూడా విధించడం రైతులను సంతోషానికి గురి చేస్తోంది. 

 

 గుంటూరు, తుళ్ళూరు, మార్చి 3(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల అలుపెరగని పోరాటం ఫలించింది... 807 రోజులుగా చేస్తున్న ఉద్యమానికి న్యాయస్థానంలో విజయంతో పరిపూర్ణత దక్కింది. అమరావతినే ఏకైక  రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు తేల్చి చెప్పటంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీసీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సుదీర్ఘంగా విచారణ జరిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌ గురువారం తీర్పుని అమరావతి రాజధాని రైతులకు అనుకూలంగా వెలువరించడంతో సర్వత్రా ఆనందోత్సాహాలు మిన్నంటాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడిలోని అమరావతి రాజధాని సాధన ఉద్యమ శిబిరాల్లో రైతులకు హైకోర్టు తీర్పు తెలియగానే ఒక్కసారిగా ఉద్వేగభరితమైన వాతావరణం నెలకొంది. తమ పోరాటానికి న్యాయదేవత కరుణించిందన్న భావనని ప్రతీ ఒక్కరూ వ్యక్తపరిచారు. ప్రతీఒక్కరికి పాదాభివందనాలు చేస్తున్నామంటూ ఆనందభాష్పాలు రాల్చారు. 


వెన్నంటి నిలిచిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు

 తమ ఈ పోరాటంలో వెన్నంటి నిలిచిన 13 జిల్లాల ప్రజలకు రైతులు కృతజ్ఞతలు వ్యక్తపరిచారు. 807రోజుల ఉద్యమంలో ఎన్నో అవమానాలు, కుట్రలను ఎదుర్కొన్నామన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానానికి పాదయాత్ర పేరుతో తాము హైకోర్టు నుంచి తిరుమలకు గత ఏడాది 100 రోజుల పాటు పాదయాత్ర చేశామన్నారు. ఆ సందర్భంలో ఎన్నో ఇబ్బందులు కలిగించారు. రోడ్ల పక్కన అన్నం వండుకొంటే ఆ కుండలను కూడా దొర్లించారు. అయినా కాలే కడుపులతో ముందుకు సాగామే తప్పా ఎక్కడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదని చెప్పారు. అమరావతి రాజధానిని శ్మశానం, అడవి అని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు కేసులు, లాఠీ దెబ్బలకు ఏమాత్రం వెన్ను చూపలేదన్నారు. 


శాంతియుత పోరాటమే మా బలం

అమరావతి ఉద్యమం ప్రారంభమైన రోజునే మేమంతా కలిసి చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా శాంతియుత మార్గాన్ని వీడరాదని నిర్ణయించుకొన్నారు. ఏ ఒక్క ప్రభుత్వ ఆస్తికి మేము నష్టం కలిగించలేదు. రోడ్ల పక్కన ప్రభుత్వం అనుమతించకపోయినా మా సొంత స్థలాల్లో ఉద్యమ శిబిరాలను ఏర్పాటు చేసుకొన్నాం. ప్రజా జీవితానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉద్యమాన్ని కొనసాగించాం. మాపై ఎన్నో నిందలను ప్రభుత్వం, పోలీసులు మోపినప్పటికీ న్యాయస్థానాలు వాటిని కొట్టివేశాయి. హైకోర్టు తీర్పుతో సంబరపడిపోమని, ప్రభుత్వం 6 నెలల్లో మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేసేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. 


న్యాయదేవత విగ్రహాలకు పాలాభిషేకాలు

 హైకోర్టు తీర్పు అనంతరం తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి తదితర దీక్షా శిబిరాల్లో న్యాయదేవత విగ్రహాలకు, రైతులు, మహిళలు పాలాభిషేకం చేశారు.  రాజధానిపై కోర్టు తీర్పు వచ్చే వరకు టీవీల ముందు ఉత్కఠంగా ఎదురు చూసిన రైతులు అనుకూలమైన తీర్పుతో స్వీట్లు పంచుకున్నారు. ఆకుపచ్చ రంగు చల్లుకుంటూ ఆనందాన్ని వ్యక్త పరిచారు. తూళ్లురు. వెలగపూడి, మందడం తదితర 29 గ్రామాల్లో రైతులు బాణాసంచా కాల్చారు. అలానే అమరావతికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వటంపై కోర్టు ప్రాంగణం బయట రైతులు, మహిళలు సాష్టాంగ నమస్కారాలు చేశారు.  సమష్టి కృషితో సాధించిన విజయాన్ని నిలబెట్టుకుంటామంటూ రైతులు, మహిళలు నినాదాలు చేశారు.  రైతులకు, మహిళలకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ స్వీట్లు తినిపించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తుళ్లూరు లైబ్రరీ సెంటర్‌లో దివంగత ఎన్టీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గద్దె అనురాధ రైతు శిబిరాలకు వచ్చి స్వీట్లు పంపిణీ చేశారు.  హైకోర్టు న్యామూర్తులు వెళ్లే రోడ్డులో అమరావతి రైతులు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. 


హైకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం 

రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ జిల్లాలో పలుచోట్ల సంబరాలు చేసుకున్నారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర అమరావతి పరిరక్షణ నాయకులతో కలసి లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తూ టీడీపీ, అమరావతి జేఏసీ నాయకులు తెనాలి పట్టణంలోని టీడీపీ కార్యాలయం నుంచి గాంధీచౌక్‌ వరకూ పాదయాత్ర చేపట్టారు.  అంబేద్కర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సత్తెనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గురువారం ఎన్టీఆర్‌భవన్‌ వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు.  

Updated Date - 2022-03-04T05:44:49+05:30 IST