మోసపు పాలన మాకొద్దు

ABN , First Publish Date - 2022-06-07T06:08:01+05:30 IST

మోసపు పాలన మాకొద్దని రాష్ట్ర ప్రగతికి అమరావతి రాజధాని అభివృద్ధే ముద్దు అని రాజధాని గ్రామాల రైతులు పేర్కొన్నారు.

మోసపు పాలన మాకొద్దు
జై అమరావతి అంటూ వెంకటపాలెం శిబిరంలో నినాదాలు చేస్తున్న రైతులు

రాష్ట్ర ప్రగతికి అమరావతి అభివృద్దే ముద్దు

902 వ రోజుకు రైతుల ఆందోళనలు 

తుళ్లూరు, జూన్‌ 6: మోసపు పాలన మాకొద్దని రాష్ట్ర ప్రగతికి అమరావతి రాజధాని అభివృద్ధే ముద్దు అని   రాజధాని గ్రామాల రైతులు పేర్కొన్నారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ , ఉన్నత న్యాయ స్థానం తీర్పును అమలు చేయాలని కోరతూ, రైతులు, మహిళలు , రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు సోమవారం నాటికి 902 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ, బ్రహ్మాండగా అమరావతిని అభివృద్ధ్ది చేస్తామని ఇప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి  ఎన్నికల ముందు చెప్పారన్నారు. చెప్పలేదని ఆయన అంటే, ఉద్యమం నుండి తప్పుకుంటామని స్పష్టం చేశారు. అధికారంలో కి వచ్చిన తరువాత  బ్రహ్మాండమైన అభివృద్ది అలా ఉంచి.. విధ్వంసానికి తెరతీశారన్నారు. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన ప్రస్థానం అమరావతిని నాశనం చేసే వరకు వచ్చిందన్నారు. రాజధానిలో నిర్మాణ కంపెనీలు ఒక్కొక్కటి సీఎం జగన్‌రెడ్డి దెబ్బకు తరలిపోయాయన్నారు.. గత ప్రభుత్వం  రైతులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అమరావతిలో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయిల అభివృద్ది పనులు జరిగాయన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు అయినా తట్ట మట్టి వేయలేదన్నారు. అభివృద్దిని పక్కనడితే, రాజధానిలో వేసిన రోడ్లు తవ్వేశారన్నారు. నిర్మాణ కంపెనీలలో ఇసుకను అధికారికంగా దోచుకెళ్ళారని ఆరోపించారు. నిర్మాణ సామగ్రిని దొంగిలించారన్నారు. అమరావతి పై పాలకులు చేస్తున్న అరాచకం తో న్యాయస్థానం  తలుపులు తట్టామన్నారు. దీంతో  మూడు రాజధానుల ప్రతిపాదన వద్దని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిందన్నారు. ఒకటే రాజధాని అమరావతి ని అభివృద్ది చేయాలని చెప్పిందన్నారు. తీర్పును గౌరవించి ఇప్పటికైనా అమరావతిని అభివృద్ది చేయాలని డిమాండ్‌ చేశారు. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి అమరావతి వెలుగు కార్యక్రమంలో నినాదాలు చేశారు. రాజధాని 29 గ్రామాలల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 


Read more