ఏపీ ప్రజల భవిత అమరావతి

ABN , First Publish Date - 2022-09-26T05:02:08+05:30 IST

పాలకులు రాష్ట్ర రాజధాని అమరావతి నాశనం కోరుకుంటున్నారని భూములు త్యాగం చేసిన రైతులు మండిపడ్డారు.

ఏపీ ప్రజల భవిత అమరావతి
అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ఆందోళనలు చేస్తున్న రైతులు

1013వ రోజుకు  చేరుకున్న రైతు ఆందోళనలు 

తుళ్లూరు, సెప్టెంబరు 25 : పాలకులు రాష్ట్ర రాజధాని అమరావతి నాశనం కోరుకుంటున్నారని భూములు త్యాగం చేసిన రైతులు మండిపడ్డారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారం నాటికి 1013వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ, ఎన్నిఎత్తుగడలు, కుట్రలు పన్నినా అమరావతిని అంగుళం కూడా కదపలేరన్నారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయడానికే మూడు  రాజధానుల నాటకం మొదలు పెట్టారన్నారు. అది గుర్తించి రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం అమరావతి అభివృద్ధిని ఆరునెలల్లో  పూర్తి చేయమని తీర్పునిచ్చిందన్నారు. పాలకులు మారితే రాజధాని మారదని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర ఆదాయ వనరు అమరావతి అని పేర్కొన్నారు. ఐదు కోట్ల మంది  ఏపీ ప్రజల భవిత అమరావతి అన్నారు. కాని పాలకులు కక్ష కట్టి నాశనం చేస్తున్నారన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాల కోసం తప్పితే మూడు రాజధానుల వలన అభివృద్ధి శూన్యమన్నారు. ఒకటి సక్రమంగా అభివృద్ధి చేయలేని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మూడు  రాజధానులు కడతామనటం విచిత్రంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి దానిని గాలికి వదిలేశారన్నారు.  విభజన చట్టంలో హామీలను నెరవేర్చమని ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా.. అంటూ నిలదీశారు.   అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. బిల్డ్‌ అమరావతి అంటూ దీపాలు వెలిగించి నినాదాలు చేశారు. 


Read more