రాజధానిలో టిడ్కో గృహాల చిచ్చు

ABN , First Publish Date - 2022-09-09T05:06:59+05:30 IST

‘టిడ్కో గృహాలు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నాయని, వాటిని లబ్ధిదారులకు పంపిణీచేయటం వదిలేసి ఎక్కడెక్కడి వారికో అమరావతి రాజధానిలోనే టిడ్కో ఇల్లు ఇస్తామని ప్రభుత్వం క్యాబినెట్‌ సమావేశంలో తీర్మానం చేయటం దుర్మార్గం.

రాజధానిలో టిడ్కో గృహాల చిచ్చు
వెంకటపాలెం దీక్షా శిబిరంలో నినాదాలు చేస్తున్న మహిళలు

విద్వేషాలను, వైషమ్యాలను సృష్టించడానికి  ప్రభుత్వం కుట్ర

క్యాబినెట్‌ తీర్మాణాన్ని వెనక్కి తీసుకోవాలి

రాజధాని ప్రజలపై పాలకులు ఎందుకింత కక్ష ?

ఈ వంకతో భూములను కాజేయాలనే పన్నాగం..

996వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు 


తుళ్లూరు, సెప్టెంబరు 8: ‘టిడ్కో గృహాలు రాష్ట్రంలో  లక్షల సంఖ్యలో ఉన్నాయని, వాటిని లబ్ధిదారులకు పంపిణీచేయటం వదిలేసి ఎక్కడెక్కడి వారికో అమరావతి రాజధానిలోనే టిడ్కో ఇల్లు ఇస్తామని ప్రభుత్వం క్యాబినెట్‌ సమావేశంలో తీర్మానం చేయటం  దుర్మార్గం. ఈ చర్య ద్వారా ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతంలో వైషమ్యాలను, విద్వేషాలను సృష్టించే కుట్రకు ప్రభుత్వం పాల్పడుతుంది ఇంతకన్నా దుర్మార్గపు పాలన విధానం మరేదీ లేదు. ప్రభుత్వం తన తప్పుడు నిర్ణయాలతో ఇంకా ఎంతకాలం అమరావతి ప్రాంత ప్రజలను, రైతులను మానసిక క్షోభకు గురి చేస్తారు’ అని రాజధాని అమరావతికి 33 వేల ఎకరాలు భూములు త్యాగంచేసిన రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. బిల్డ్‌ అమరావతి సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు గురువారం నాటికి 996వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుండి వారు మాట్లాడుతూ, సీఆర్డీఏ చట్ట ససరణ రాజధాని రైతులను మరింత కుంగదీయాటానికేనన్నారు. ఈ సవరణను అడ్డం పెట్టుకొని భూములు కాజేయాలనే ఆలోచనతో వైసీపీ నేతలు ఉన్నారన్నారు. తన అనాలోచిత మూడు ముక్కల రాజధాని నిర్ణయంతో ఇప్పటికే అమరాతిని నాశనం చేస్తున్న సీఎం జగన్‌రెడ్డి ఇప్పుడు సీఆర్డీఏ చట్ట సవరణతో  అమరావతి నిర్మాణం  మాస్టర్‌ప్లాన్‌ను పూర్తిగా మార్చేవేసే పనిలో నిమగ్నమయ్యాడని, మాస్టర్‌ప్లాన్‌ నాశనం చేస్తే ఇక అమరావతి రాజధాని పూర్తిగా లేనట్టేననే దుర్మార్గపు ఆచోచనతో  ఉన్నాడని దుయ్యబట్టారు.  రాష్ట్ర ఆదాయ వనరైన అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలందరి ఆకాంక్ష అమరావతి రాజధాని నిర్మాణాన్ని ధ్వంసం చేయాలనుకునే ఇలాంటి పాలకులు రాష్ట్రానికి అవసరం లేదన్న విషయాన్ని ఐదు కోట్ల మంది ప్రజలు గుర్తించాలని విన్నవించారు. హైకోర్టు తీర్పును కూడా లెక్క చేయటం లేదంటే మున్ముందు పాలన ఎంత అడ్డగోలుగా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉందన్నారు. అభివృద్ధి నిరోదక ప్రభుత్వానికి ప్రజలు తప్పక బుద్ధి చెప్పాలని కోరారు. రాజధాని 29 గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. దీపాలు వెలగించి అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. బిల్డ్‌ అమరావతి అంటూ దీక్షా శిబిరాల్లో ప్రజలు నినాదాలు చేశారు.


‘అమరావతి’తోనే యువత భవిత 

పెదకాకాని : రాష్ట్ర యువత భవిష్యత్తు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారానే సాధ్యపడుతుందని దళిత బహుజన జేఏసీ కన్వీనర్‌ చిలకా బసవయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వ విద్యాల యంలో గురువారం డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వద్ద నిర్వహిం చిన దళిత బహుజన జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తిస్థాయిలో జరిగి ఉంటే పరిశ్రమల ఏర్పాటు జరిగి యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేవని అన్నారు. అమరావతి మహోద్యమంలో భాగంగా ఈ నెల 12 నుంచి అమరావతి నుంచి అరసవెల్లి మహా పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ యాత్రకి సంఘీభావం తెలియజేయాలని ఆకాంక్షించారు.


Read more