మునిసిపాలిటీపై.. మూకుమ్మడి వ్యతిరేకత

ABN , First Publish Date - 2022-09-17T05:45:14+05:30 IST

అమరావతి మునిసిపాలిటీ ఏర్పాటుపై రాజధాని గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే వుంది. విలీన తీర్మానాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.

మునిసిపాలిటీపై.. మూకుమ్మడి వ్యతిరేకత
అమరావతి మునిసిపాలిటీలో గ్రామ విలీనాన్ని వ్యతిరేకిస్తూ చేతులు పైకెత్తిన కృష్ణాయపాలెం వాసులు

అధికారులను నిలదీసిన గ్రామస్తులు

విలీన తీర్మానాన్ని వ్యతిరేకించిన ప్రజలు

మంగళగిరి సిటీ, తుళ్లూరు, సెప్టెంబరు 16: అమరావతి మునిసిపాలిటీ ఏర్పాటుపై రాజధాని గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూనే వుంది. విలీన తీర్మానాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. శుక్రవారం కృష్ణాయపాలెం, మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. కృష్ణాయపాలెంలో ప్రత్యేకాధికారి జి.విశాలి అధ్యక్షతన గ్రామ సభ జరిగింది. గతంలో ఉన్న అమరావతి క్యాపిటల్‌ సిటీ కార్పొరేషన్‌కు బదులుగా ఇప్పుడు అమరావతి మునిసిపాలిటీ ఏర్పాటు చేయడానికి గల కారణాలు తెలపాలని స్థానికులు కోరారు. అధికారుల నుంచి సమాధానం లేకపోవడంతో  తామంతా గ్రామ విలీన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని గ్రామస్తులు స్పష్టం చేశారు. గ్రామసభకు మొత్తం 80 మంది హాజరు కాగా, అందరూ తీర్మానాన్ని వ్యతిరేకించారు. గ్రామస్తులు ఆవల వెంకటేశ్వరరావు, కారుమంచి అనిల్‌, రవికిరణ్‌ తదితరులు గ్రామ ప్రజల సంతకాలతో కూడిన అభ్యంతరపత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ గ్రామసభలో మండల అభివృద్ధి అధికారి రామ్‌ప్రసన్న, ఈవోఆర్డీ శ్రీనివాస్‌నాయక్‌, పంచాయతీ కార్యదర్శి ఎన్‌.వెంకటకుమార్‌, వీఆర్వో జి.కోటేశ్వరరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి గ్రామాల్లో గ్రామ సభల్లో స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మునిసిపాల్టీకి పూర్తి వ్యతిరేకమన్నారు. రాజధాని 29 గ్రామాలతో కూడుకున్న అమరావతి క్యాపిటల్‌ సిటీ కావాలని లిఖిత పూర్వకంగా తెలిపారు. 


Updated Date - 2022-09-17T05:45:14+05:30 IST