రక్తమోడిన రహదారులు

ABN , First Publish Date - 2022-08-16T05:22:16+05:30 IST

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సోమవారం రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు.

రక్తమోడిన రహదారులు
ప్రమాదం జరిగిన సంఘటనా స్థలంలో నుజ్జు అయిన కారు

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి

పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఘటనలు

తుమ్మలపాలెం వద్ద నలుగురు మిత్రుల దుర్మరణం

అరుణాచలం వెలుతూ అనంతలోకాలకు..

పల్నాడు జిల్లాలో మరో ముగ్గురు..

  

ప్రత్తిపాడు, దుర్గి, రాజుపాలెం, ఆగస్టు15: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సోమవారం రహదారులు రక్తమోడాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. అరుణాచలంలో స్వామిని దర్శించుకునేందుకు కారులో వెళుతున్న నలుగురు మిత్రులు రోడ్డు ప్రమాదంలో మృత్యుఒడికి చేరారు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద జాతీయ రహదారిపై సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఘటన జరిగింది. విజయవాడకు చెందిన  చుక్కా గౌతమ్‌రెడ్డి(26), కాకినాడ జగన్నాథపురానికి చెందిన వాడపల్లి అనంతపద్మ చైతన్యపవన్‌ (27), విశాఖ జిల్లా పెందుర్తి మండలం, దేశపాత్రునిపాలెం గ్రామానికి చెందిన పిరిడి శౌమిక(25) విశాఖకు చెందిన  పావని(24) విజయవాడలోని వరాహ ఆర్కిటెక్‌ కాలేజీలో 2014 -19 సంవత్సరంలో ఆర్క్‌టెక్‌ పూర్తి చేశారు. వీరిలో ముగ్గురు విజయవాడలోనే ఉద్యోగం చేస్తుండగా.. శౌమిక వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తోంది. వీరు నలుగురు కలిసి ఒక ప్రాజెక్టు వర్కు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే కలిసినవారు స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు తుమ్మలపాలెం వద్ద టైరు మార్చుకునేందుకు ఆగి ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడి మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ప్రత్తిపాడు ఎస్‌ఐ ప్రతాప్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

వాహనం ఢీకొని ఇద్దరు మృతి

 గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతిచెందిన ఘటన దుర్గి మండలంలోని ఓటులేశునిపల్లె సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. కారంపూడికి చెందిన రమావత్‌ దిబ్బానాయక్‌(45), అదే మండలంలోని పేటసన్నిగండ్లకు చెందిన రామావత్‌ హనుమానాయక్‌ (43) దుర్గి నుంచి కారంపూడికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యంలోని ఓబులేశునిపల్లె సమీపానికి రాగానే గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొని వెళ్లింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న దుర్గి ఎస్‌ఐ పాల్‌రవీందర్‌ ఘటనా ప్రాంతానికి చేరుకొని వారి మృతదేహాలను మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


రెడ్డిగూడెం సమీపంలో..

మనవళ్లను పాఠశాల నుంచి ఇంటికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. రాజుపాలెం మండల పరిధిలోని రెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఘటన జరిగింది. క్రోసూరు మండలం నాగవరం గ్రామానికి చెందిన గాలి వెంకటేశ్వరరావు(65) సోమవారం ఉదయం రాజుపాలెం వచ్చాడు. నాగవరంలో ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న తన మనవళ్లు సోమశేఖర్‌, జగదీష్‌లను తీసుకుని బయలుదేరాడు. లోలెవల్‌ చప్టా దగ్గరకి వచ్చేసరికే లారీ అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందగా చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని 108వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న రాజుపాలెం ఎస్‌ఐ షఫీ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more