padayatra: గర్జించిన ‘గుడివాడ’

ABN , First Publish Date - 2022-09-25T01:03:21+05:30 IST

రాజధాని అమరావతి (Amaravathi) కోసం కాదు, యావత్తు ఆంధ్రరాష్ట్ర పరిరక్షణ కోసం అమరావతి రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు.

padayatra: గర్జించిన ‘గుడివాడ’

మచిలీపట్నం: ‘రాజధాని అమరావతి  (Amaravathi) కోసం కాదు, యావత్తు ఆంధ్రరాష్ట్ర పరిరక్షణ కోసం అమరావతి రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కోరి అంతదూరం నుంచి మా ప్రాంతానికి పాదయాత్ర చేస్తూ వచ్చిన రైతులకు సంఘీభావం తెలపడం మా ధర్మమని’ గుడివాడ రైతులు గొంతెత్తిచాటారు. అమరావతి మహాపాదయాత్రలో పాల్గొన్న రైతులకు అడుగడుగునా పూలుచల్లి ఘనస్వాగతం పలికారు. వారితో అడుగులో అడుగేసి నడిచారు. ఒకేరాష్ట్రం, ఒకే రాజధాని అంటూ దిక్కులు పిక్కటిల్లేలా రైతులు చేసిన నినాదాలతో గుడివాడ (Gudivada) పట్టణం, గ్రామాలు హోరెత్తాయి. రాజధానిగా అమరావతినే అభివృద్ధి చేయాలంటూ రైతులు తమ గళం విప్పారు. గుడివాడలో సాగుతున్న పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు నలువైపుల నుంచి వస్తున్న వారిని ఎక్కడికక్కడ నిర్బంధించినా జనం ఎక్కడా ఆగలేదు. పోలీసులతో వాగ్వివాదానికి దిగి మరీ గుడివాడ చేరుకొని తమ మద్దతు తెలిపారు. 


రైతులతోపాటు టీడీపీ (tdp), ఇతర ప్రతిపక్షాల నాయకులనే కాకుండా పెళ్లి చూపులకు వెళుతున్న వారిని సైతం పోలీసులు అడ్డుకున్నారు. అయినా జనం ఎక్కడా వెనక్కు తగ్గలేదు. శనివారం ఉదయం 8 గంటలకు కృష్ణాజిల్లా (Krishna District) కౌతవరం నుంచి 13వ రోజు మహాపాదయాత్ర ప్రారంభమైంది. కౌతవరం, గుడ్లవల్లేరు, అంగలూరు, బొమ్ములూరు మీదుగా గుడివాడ పట్టణ శివారు వరకు 19 కిలోమీటర్లమేర సాగింది. గుడ్లవల్లేరు వద్ద సూర్యరధానికి 108 కొబ్బరికాయలు కొట్టారు. 9 గుమ్మడి కాయలతో వెంకటేశ్వరస్వామికి, సూర్యరధానికి దిష్టి తీశారు. కౌతవరం వద్ద పాదయాత్రకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుడివాడ కో-ఆపరేటివ్‌ అర్భన్‌ బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జి), మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, యెర్నేని సీతాదేవి, రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాధ్‌లు స్వాగతం పలికారు. గుడ్లవల్లేరు వైబ్రిడ్జి నుంచి ఎడ్లబండ్లను స్థానిక రైతులు ఏర్పాటు చేసి పాత్రలో పాల్గొన్నారు. అంగలూరు వద్ద మాజీమంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు మాగంటి బాబు, కొనకళ్ల నారాయణరావు, పెనుమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ గద్దె అనూరాధ, కొనకళ్ల బుల్లయ్య తదితరులు మహాపాదయాత్రలో పాల్గొని రైతులతో కలిసి నడిచారు.

Updated Date - 2022-09-25T01:03:21+05:30 IST