జీపీఎస్‌..అంతే

ABN , First Publish Date - 2022-09-07T07:56:44+05:30 IST

జీపీఎస్‌..అంతే

జీపీఎస్‌..అంతే

పాత పెన్షన్‌ ఊసే ఎత్తొద్దు.. డీఆర్‌, ఫిట్‌మెంట్‌ కుదరదు

తేల్చి చెప్పిన మంత్రులు బొత్స, బుగ్గన

నేడు జీపీఎ్‌సపై అధికారిక ప్రకటన!?

తీవ్రంగా వ్యతిరేకించిన ఉద్యోగ నేతలు

ఓపీఎ్‌సపై మాట నిలబెట్టుకోవాలి

సీపీఎ్‌సనే సరిగా అమలు చేయడంలేదు

కొత్త వ్యవస్థతో లాభమంటే నమ్మేదెలా?

ఓపీఎస్‌ కోసం ఉద్యమం ఆగదు

స్పష్టంచేసిన ఉద్యోగ సంఘాల నేతలు

నేడు మళ్లీ చర్చలకు రావాలని పిలుపు


అమరావతి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించే అవకాశమే లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) స్థానంలో ‘గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌’ (జీపీఎస్‌) ప్రవేశపెడతామని స్పష్టం చేసింది. బహుశా.. బుధవారమే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. అయితే... తమకు పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) మినహా, మరేదీ ఆమోదయోగ్యం కాదని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు కుండబద్దలు కొట్టాయి. అటు మెట్టు దిగని ప్రభుత్వం... ఇటు పట్టు వదలని ఉద్యోగులు! దీంతో... ‘పెన్షన్‌’పై పీటముడి బిగుసుకుంటోంది. మంగళవారం విజయవాడలో మంత్రి బొత్స క్యాంపు కార్యాలయంలో సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలతో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో బొత్సతోపాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి కూడా పాల్గొన్నారు. ‘పాడిందేపాట’ అన్నట్లుగా మళ్లీ జీపీఎస్‌ రాగం ఎత్తుకోవడంతో సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేత లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘ ఓపీఎ్‌సపై చర్చలకు అంటేనే వచ్చాం. జీపీఎ్‌సపై చర్చించేది లేదు’’ అని స్పష్టం చేశారు. పాత పెన్షన్‌ అనే మాట మాట్లాడొద్దని మంత్రులు తేల్చి చెప్పారు. ‘‘ఏదైనా కావాలంటే జీపీఎ్‌సలోనే చేస్తాం. మీరు ఊహించనిదానికన్నా ఎక్కువ చేస్తాం. జీపీఎ్‌సలో మార్పులు సూచించండి. పాత పెన్షన్‌ అనే మాటేవద్దు. బుధవారం జీపీఎ్‌సపై అధికారిక ప్రకటన చేస్తాం’’ అని స్పష్టం చేశారు. ‘‘జీపీఎ్‌సకు ఒప్పుకోం. ఓపీఎ్‌సను పునరుద్ధరించండి. అందులో కొన్ని వెసులుబాట్లకు మేం సిద్ధమే’’ అని ఉద్యోగ సం ఘాల నేతలు తెలిపారు. ఓపీఎస్‌ మాటే ఎత్తొద్దని మంత్రులు తేల్చిచెప్పారు. జీపీఎ్‌సలో కూడా డీఆర్‌, పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ఇవ్వడం కుదరదని మంత్రులు తెగేసి చెప్పేశారు. ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రొంగల అప్పల్రాజు, పార్థసారధి, ఏపీసీపీఎ్‌సయూఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు సీఎం దాస్‌, రవికుమార్‌లు మంత్రుల ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ‘జీపీఎస్‌ అంటే చర్చలకే వచ్చేవాళ్లం కాదు. ఓపీఎ్‌సపై అంటేనే వస్తాం’’ అని తేల్చిచెప్పారు.


మంత్రుల బెదిరింపులు...

జీపీఎ్‌సకు ఉద్యోగ సంఘాల నేతలు ఒప్పుకోకపోవడంతో మంత్రులు బెదిరింపు దోరణితో మాట్లాడినట్లు తెలిసింది. ‘ఓపీఎస్‌ తప్ప మరేదీ వద్దు’ అని పదేపదే చెప్పడంతో... ‘‘గౌరవప్రదంగా చర్చలకు పిలుస్తున్నాం. జీపీఎ్‌సకే ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓపీఎస్‌ అమలు చేసే అవకాశమేలేదు. మొండి పట్టుదలకు పోతే రేపు సాయంత్రానికే జీవోలు ఇచ్చేస్తాం’’ అని హెచ్చరించిన ట్లు సమాచారం. దీంతో ఉద్యోగులు విస్తుపోయారు. ‘జీవోలు ఇస్తే ఇచ్చుకోనీ! మన పోరాటం మనం చే ద్దాం’ అని తీర్మానించుకున్నారు. ప్రభుత్వం జీపీఎ్‌సపై ఎంత మొండిగా ముందుకు వెళ్లినా... తాము మాత్రం ఓపీఎ్‌సకే కట్టుబడి ఉన్నామని మంత్రులకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. వేలాది మంది ఉపాధ్యాయులపై పోలీసులు కేసులు పెట్టారని, అక్రమ కేసులు రద్దు చేయాలని మంత్రులను ఇరు సంఘాల నేతలు కోరా రు. 24 గంటల్లో కేసులు రద్దు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్లు తెలిసింది. 


నేడు జీపీఎ్‌సపై ప్రకటన

జగన్‌ సర్కార్‌ ఇప్పటికే జీపీఎస్‌ అమలు చేయాల నే ఆలోచనకు వచ్చేసిందని... బుధవారం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశముందని ప్రభుత్వ, ఉద్యో గ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బుధవారం జరిగే మం త్రివర్గ సమావేశంలో దీనిని ఆమోదిస్తారని సమాచా   రం. ‘‘ఇప్పటికే జీపీఎ్‌సకు సంబంధించిన ముసాయిదా జీవోలు సిద్ధమయ్యాయి. కేబినెట్‌లో ఆమోదించి... అర్ధరాత్రికి ఉత్తర్వులు ఇచ్చే అవకాశముంది’’ అని ఉద్యోగ వర్గాలు అనుమానిస్తున్నాయి. మంగళవారం చర్చల్లో ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉన్నప్పటికీ... బుధవారం ఉద్యోగ, ఉపాధ్యాయ, సీపీఎస్‌ సంఘాలతో మంత్రుల కమిటీ సచివాలయంలో భేటీ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలోనే జీపీఎ్‌సపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది.

Read more