గెస్ట్‌ లెక్చరర్లకు ఒకే విధానం

ABN , First Publish Date - 2022-10-11T09:46:42+05:30 IST

గెస్ట్‌ లెక్చరర్లకు ఒకే విధానం

గెస్ట్‌ లెక్చరర్లకు ఒకే విధానం

ఒకే పారితోషికం ఇచ్చేలా ప్రభుత్వ ప్రతిపాదన


అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మోడల్‌ స్కూల్స్‌, ఇంటర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీల పరిధుల్లో వేర్వేరుగా పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లకు యూనిఫాం విధానం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సోమవారం తాడేపల్లిలోని ఇంటర్‌ విద్యామండలి కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పాఠశాల విద్య స్పెషల్‌ సీఎస్‌ బి.రాజశేఖర్‌, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, కళాశాల విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌, ఇంటర్‌ విద్య కమిషనర్‌ ఎంవీ శేషగిరిబాబు పాల్గొన్నారు. గెస్ట్‌ లెక్చరర్లకు గంటకు మోడల్‌ స్కూల్స్‌లో రూ.225, ఇంటర్‌ కాలేజీల్లో రూ.150, డిగ్రీ కాలేజీల్లో రూ.300, యూనివర్సిటీల్లో పలు రకాల పారితోషికాలు ఇస్తున్నారు. ఇలా వేర్వేరుగా కాకుండా అందరికీ ఒకే విధానం తేవడంపై సమావేశంలో అధికారులు చర్చించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనను వారం రోజుల్లో సిద్ధం చేయాలని నిర్ణయించారు. కాగా, ఉన్నత విద్యలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్ల అర్హతలకు, ఉన్నత విద్యలో బోధించే వారి అర్హతలకు వ్యత్యాసం ఉంది. అందుకు తగ్గట్టుగా వారి పారితోషికాలున్నాయి. అలాంటప్పుడు అందరికీ కలిపి యూనిఫాం విధానం ఎలా తెస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - 2022-10-11T09:46:42+05:30 IST