ప్రభుత్వ వైఫల్య మరణాలు 1.25 లక్షలు

ABN , First Publish Date - 2022-06-11T07:52:12+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా సంభవించిన మరణాలు ఒక లక్షా పాతిక వేలు..

ప్రభుత్వ వైఫల్య మరణాలు 1.25 లక్షలు

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడేళ్లలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా సంభవించిన మరణాలు ఒక లక్షా పాతిక వేలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ తెలిపింది. హత్యలు, వేధింపుల కారణంగా జరుగుతున్న ఆత్మహత్యలతో రాష్ట్రం వల్లకాడుగా మారుతోందని, వందల మంది దళితులు, బడుగు బలహీన వర్గాలవారి ప్రాణాలు తీసి అదే సామాజిక న్యాయం అన్నట్లుగా అధికార పార్టీ ప్రచారం చేసుకొంటోందని టీడీపీ ధ్వజమెత్తింది. ‘ఫ్యాక్షనిస్టు పాలనలో క్రూర హత్యలు’ పేరుతో ఆ పార్టీ ఒక పుస్తకాన్ని శుక్రవారం ఇక్కడ విడుదల చేసింది.


పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దీనిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పార్టీ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘జగన్‌ రెడ్డిది ఒక ఐరన్‌ లెగ్‌. ఎక్కడ కాలుపెడితే అక్కడ సర్వ నాశనం. అందుకే ఇన్ని మరణాలు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వంలో మీడియా వారికీ రక్షణ లేకుండా పోయిందని, ముగ్గురు అన్యాయంగా మరణించారని చెప్పారు. ‘వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ సుబ్రమణ్యాన్ని హత్య చేస్తే, ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద రెడ్డి బీసీ నేత నందం సుబ్బయ్యను చంపించారు. మరికొంతమంది బీసీ నేతలను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్య చేయించారు. తుని నియోజకవర్గంలో సత్యనారాయణ అనే పాత్రికేయుడిని వైసీపీ నేత హత్య చేయించాడు. సారా, కల్తీ కల్లు, శానిటైజర్‌ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. పేదలే ఇందులో బలైపోయారు. దీనిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. నేరగాళ్లకు తగిన శిక్షలు పడేవరకూ పోరాడాలి’ అని ఈ పుస్తకంలో కోరారు.


ఇదీ మరణాల లెక్క

 • కరోనా కారణంగా రాష్ట్రంలో 88 వేల మంది మరణించారు. కరోనాను ఎదుర్కోవడానికి ఒక వ్యూహం లేకపోవడం, ఆక్సిజన్‌ సదుపాయాలు కూడా కల్పించలేని దుస్ధితి ఇన్ని మరణాలకు దారితీసింది. 
 • అధ్వాన్న రోడ్లపై జరిగిన ప్రమాదాల్లో 32 వేల మంది మరణించారు.
 • రెండున్నర వేల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 
 • ఐదు వందల మంది నిరుద్యోగులు మరణించారు.
 • ప్రభుత్వ దాష్టీకానికి 291 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బలయ్యారు.
 • నాటుసారా మరణాలు  230
 • వేధింపులతో 218 మహిళలు ఆత్మహత్యలు చేసుకొన్నారు.
 • అమరావతిలో 186 ఆవేదనాపూరిత రైతుల మరణాలు
 • 77 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకొన్నారు.
 • అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన సమయంలో 62 మంది చనిపోయారు. 
 • ఇంకా పడవ ప్రమాదాల్లో 57 మంది, శానిటైజర్‌ మరణాలు 52, టీడీపీ కార్యకర్తల హత్యలు 37, పారిశ్రామిక ప్రమాదాల్లో 35, వైసీపీ దాష్టీకానికి బలైన మహిళల మరణాలు 18 ఉన్నాయని ఈ పుస్తకంలో వివరించారు. పదో తరగతి ఫెయిలై ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకొన్నారు. ఉద్యోగాలు, ఉపాధి లేక ఐదు వందల మంది నిరుద్యోగులు చనిపోయారు. అంతేగాకుండా ప్రభుత్వ వేధింపులు భరించలేక నంద్యాలలో అబ్దుల్‌ సలాం భార్యతోసహా ఆత్మహత్య చేసుకొన్నాడు. మాస్కు అడిగినందుకు డాక్టర్‌ సుధాకర్‌ను పిచ్చివాడని ముద్రవేసి మరణానికి కారణమయ్యారని పుస్తకంలో పేర్కొన్నారు.

Read more