ధాన్యం కొనలేక రైతులను వేధిస్తోంది

ABN , First Publish Date - 2022-11-08T04:22:40+05:30 IST

‘‘ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయలేక పనికిమాలిన నిబంధనలతో వైసీపీ ప్రభుత్వం రైతులను వేధిస్తోంది. ఇంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఏనాడూ లేదు. ధాన్యం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది’’ అని టీడీపీ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

ధాన్యం కొనలేక రైతులను వేధిస్తోంది

జగన్‌ ప్రభుత్వంపై గోరంట్ల ఆగ్రహం

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘‘ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయలేక పనికిమాలిన నిబంధనలతో వైసీపీ ప్రభుత్వం రైతులను వేధిస్తోంది. ఇంత ఘోరమైన పరిస్థితి రాష్ట్రంలో ఏనాడూ లేదు. ధాన్యం రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది’’ అని టీడీపీ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ ఏడాది ధాన్యం కొనుగోలు లక్ష్యం గతం కన్నా 10 లక్షల మెట్రిక్‌ టన్నులు తక్కువ. అయితే దిగుబడి భారీగా పెరిగింది. మిగిలిన ధాన్యాన్ని రైతులు ఏం చేసుకోవాలి? ధాన్యం కొనుగోళ్లకు తొమ్మిది కోట్ల గోనె సంచులు కావాల్సి ఉండగా ఇప్పుడు కేవలం 55 లక్షలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల్లో కమీషన్‌ ఏజెంట్లకు చేతులు తడిపితే తప్ప ధాన్యం కొనే దిక్కు లేదు. వైసీపీ నేతల సిఫార్సులు ఉంటే తప్ప ధాన్యాన్ని తీసుకోవడం లేదు. ఉన్న సమస్యలు చాలక ఈ ఏడాది కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఉత్పత్తి అయిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఆ మేరకు రైతు భరోసా కేంద్రాలకు తగిన వనరులు సమకూర్చాలి. పోయిన ఏడాది బకాయిలు పూర్తిగా చెల్లించడంతోపాటు ఈసారి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలి’’ అని బుచ్చయ్య చౌదరి డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-11-08T04:22:40+05:30 IST

Read more