సింహపురి కన్నీరు!

ABN , First Publish Date - 2022-02-23T07:43:55+05:30 IST

సౌమ్యుడు, వివాద రహితుడు, అందరివాడిగా పేరు తెచ్చుకున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇకలేరన్న సంగతి తెలిసి సింహపురి కన్నీరు పెట్టింది. ఆయనను కడసారి చూసేందుకు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ..

సింహపురి కన్నీరు!

  • నెల్లూరుకు చేరిన గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
  • ఎయిర్‌ అంబులెన్స్‌లో నెల్లూరుకు.. అక్కడి నుంచి ఇంటికి
  • కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు
  • మంత్రులు, ఉన్నతాధికారులు, నేతల ఘన నివాళి
  • నేడు ఉదయగిరిలో అంత్యక్రియలు.. సీఎం జగన్‌ రాక


నెల్లూరు, హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): సౌమ్యుడు, వివాద రహితుడు, అందరివాడిగా పేరు తెచ్చుకున్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇకలేరన్న సంగతి తెలిసి సింహపురి కన్నీరు పెట్టింది. ఆయనను కడసారి చూసేందుకు నెల్లూరు జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అభిమానులు, నేతలు, అధికారులు పెద్దఎత్తున మేకపాటి నివాసానికి తరలివచ్చారు. ‘గౌతమ్‌ అన్న.. అమర్‌రహే..’ అంటూ నినాదాలు చేశారు. విషణ్నవదనాలతో నివాళులర్పించారు. గుండెపోటుతో సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూసిన గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని అక్కడి నుంచి ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్స్‌లో మంగళవారం నెల్లూరుకు తీసుకొచ్చారు. ఉదయం 8.30గంటలకు జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 47లోని స్వగృహం నుంచి ఆయన పార్థివదేహాన్ని అంబులెన్స్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్మీ హెలికాప్టర్‌లో భౌతికకాయాన్ని నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ మైదానానికి తరలించారు.


అక్కడి నుంచి నగరంలోని మేకపాటి నివాసానికి రోడ్డు మార్గాన తీసుకొచ్చారు. గౌతమ్‌రెడ్డి తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అదిమూలపు సురేశ్‌ ఎయిర్‌ అంబులెన్స్‌లోనే నెల్లూరు చేరుకోగా.. తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మంత్రి సోదరులు, మిగతా కుటుంబ సభ్యులు మరో ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ చక్రధర్‌బాబు.. గౌతమ్‌రెడ్డి భౌతిక కాయంపై జాతీయ జెండా కప్పి నివాళులర్పించారు. కుమారుడి భౌతికకాయాన్ని చూసిన తల్లి మణిమంజరి గుండె పగిలేలా విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. కాగా మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ప్రజలకు సందర్శన కల్పించారు. ఈ సమయంలో తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, మేకతోటి సుచరిత, తానేటి వనిత, గుమ్మనూరు జయరాం, శ్రీరంగనాథరాజు, సీఎస్‌ సమీర్‌శర్మ, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, తెలుగు-సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, గల్లా జయదేవ్‌, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, సలహాదారు అజేయ కల్లంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డితో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


మేధావిని కోల్పోయాం: సోమిరెడ్డి

నేటి రాజకీయాల్లో సంస్కారవంతమైన మనిషి గౌతమ్‌రెడ్డి అని, ఆయన ఉన్నత చదువులు అభ్యసించిన మేధావి అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న మంచి మేధావిని కోల్పోవడం తీరని లోటని వ్యాఖ్యానించారు. తండ్రికి తగ్గ తనయుడిగా గౌతమ్‌ ఎదిగారని, అజాత శత్రువుగా పేరు సంపాదించుకున్నారని కొనియాడారు.


ఉదయగిరిలో నేడు అంత్యక్రియలు

దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల(మెరిట్స్‌) ప్రాంగణంలో ఉదయం 11గంటలకు జరగనున్నాయి. ఉదయం 6గంటలకు భౌతికకాయాన్ని రోడ్డు మార్గాన నెల్లూరు నుంచి ఆత్మకూరు మీదుగా ఉదయగిరికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియల్లో సీఎం జగన్‌ పాల్గొననున్నారు. ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్‌లో మెరిట్స్‌ ప్రాంగణానికి రానున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. 
అబద్ధమైతే బాగుండు: మంత్రి బొత్స

ఏపీ భవన్‌లో మేకపాటి సంతాప సభ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): ‘‘ఎంతో ఆరోగ్యంగా ఉండే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాత్తుగా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ వార్త అబద్ధమైతే బాగుండు’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గౌతమ్‌రెడ్డి సంతాపసభ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. కాగా, సౌమ్యుడు, మంచి వ్యక్తిత్వం కలిగిన గౌతమ్‌రెడ్డి కన్నుమూయడం బాధాకరమని హోంమంత్రి సుచరిత అన్నారు. 


సీఎం క్షోభవల్లే గౌతమ్‌రెడ్డి మృతి: బండారు 

తునిరూరల్‌/తుని, ఫిబ్రవరి 22: ‘‘సౌమ్యుడు, యువ మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి బాధాకరం. ఆయన మరణానికి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయమే కారణమని చాలామంది చెబుతున్నారు. దీనిపై విచారణ జరపాలి. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన గుండెపోటుతో మరణించడం వెనుక ఉన్న కారణం తెలియాలి’’ అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఆరోగ్యం గా దుబాయ్‌ వెళ్లొచ్చిన గౌతమ్‌రెడ్డి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీబీఐ విచారణ జరపాలని కోరారు. చాలామంది చెబుతున్న విషయాన్నిబట్టి.. ‘‘దుబాయ్‌ వెళ్లిన మంత్రి గౌతమ్‌రెడ్డి అక్కడ నుంచి పరిశ్రమలు తీసుకురాలేకపోయారు. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోలేకపోయారు. దీంతో ముఖ్యమంత్రే ఆయనను దెబ్బలాడారు. దీనికితోడు కొంతమంది సలహాదారులు కూడా ఫోన్‌ చేసి ముఖ్యమంత్రి కోప్పడుతున్నారం టూ హెచ్చరించారు. దీంతో ఆయన తీవ్రమైన ఆత్మక్షోభకు గురయ్యారు. సౌమ్యుడైన ఆయన ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోవడంతోనే గుండెపోటు వచ్చిం ది. కేవలం ముఖ్యమంత్రి పెట్టిన క్షోభ వల్లే గౌతమ్‌రెడ్డి చనిపోయారు’’ అని వ్యాఖ్యానించారు.  Read more