Gannavaram': గుప్పిట్లో ‘గన్నవరం’!

ABN , First Publish Date - 2022-11-19T03:14:30+05:30 IST

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతపై ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లోపల చోటు చేసుకుంటున్న పరిణామాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Gannavaram': గుప్పిట్లో ‘గన్నవరం’!

బెజవాడ విమానాశ్రయానికి రాష్ట్ర బలగాల భద్రత

ప్రభుత్వ పెద్దల సన్నిహిత అధికారి పర్యవేక్షణ

2019లోనే సీఐఎ్‌సఎఫ్‌ బలగాలుపంపుతామన్న కేంద్రం

ఇప్పటికీ పంపకపోవడం వెనుక రహస్యమేంటో?

(అమరావతి-ఆంధ్రజ్యోతి): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతపై ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. లోపల చోటు చేసుకుంటున్న పరిణామాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర సాయుధ బలగాల రక్షణలో ఉండాల్సిన విమానాశ్రయం రాష్ట్ర పోలీసుల ఆధీనంలో ఎందుకుంది? రాష్ట్ర అధికార పార్టీ నేతల రహస్య కార్యకలాపాలకు వేదిక అయిందా? తమ అనుయాయుల గుప్పిట్లో పెట్టేందుకు ఢిల్లీలో ఎవరు చక్రం తిప్పారు? ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి ఎగిరినప్పుడు నల్ల బెలూన్లు అడ్డంగా ఎగరడం భద్రతా లోపం కాదా? వీవీఐపీ భద్రతకు ముప్పు తలెత్తినప్పుడు సమీక్షించరా? విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ అధికార పార్టీ వ్యక్తులు పట్టుబడినా పట్టించుకోరా?... రాష్ట్రంలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడిని అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆయన భార్య కనికా రెడ్డిపై కేసు నమోదు చేయడంతో కొత్త కొత్త విషయాలు బయటికి వస్తున్నాయి.

బెజవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేంద్ర సాయుధ బలగాలతో కాకుండా రాష్ట్ర స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌తో భద్రత కల్పించడం వెనకున్న రహస్యం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. కేంద్ర విమానయాన శాఖ పరిధిలోని విమానాశ్రయాల్లో కేంద్ర సాయుధ బలగాలు(సీఐఎ్‌సఎఫ్‌) కాపలా ఉంటాయి. విజయవాడ విమానాశ్రయానికి కేంద్ర బలగాలను సెక్యూరిటీగా పంపాలని గత ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 2019లోనే కేంద్రం ఇందుకు సమ్మతించింది. ఆ ఏడాది మార్చి 7న విజయవాడతో పాటు మరికొన్ని విమానాశ్రయాలకు భద్రత కల్పించనున్నట్లు సీఐఎ్‌సఎఫ్‌ డీజీ రాజేశ్‌ రంజన్‌ ప్రకటన చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏం మాయ చేసిందో కానీ ఇప్పటి వరకూ సీఐఎ్‌సఎఫ్‌ బలగాలు ఇటు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే అధికారి పర్యవేక్షణలో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌) విమానాశ్రయానికి భద్రత కల్పిస్తోంది. కాగా కేరళలో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ) కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఎన్‌ఐఏ... ఇటీవల దేశ వ్యాప్తంగా జరిపిన సోదాల్లో భాగంగా రాష్ట్రంలోని నెల్లూరు, కర్నూలులోనూ చేపట్టింది. ఈ సమయంలో కేరళలోని కొచ్చి నుంచి విజయవాడ మీదుగా విదేశాలకు వెళ్లొచ్చే విమానాల భద్రతపైనా చర్చ జరిగింది.

ఎంపీ నేరుగా రన్‌వే పైకి..

అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎవరైనా టెర్మినల్‌లోకి వెళ్లాల్సిందే. దేశీయ ప్రయాణికులైతే భద్రతాసిబ్బందికి టికెట్‌తో పాటు ఆధార్‌ కార్డు చూపిస్తే లోపలికి అనుమతిస్తారు. బోర్డింగ్‌ పాస్‌ తీసుకున్న తర్వాత లగేజీ స్కానింగ్‌ అయ్యాక లాంజ్‌లోకి పంపుతారు. అంతర్జాతీయ ప్రయాణికులైతే టికెట్‌తో పాటు పాస్‌ పోర్ట్‌, వీసా తప్పనిసరిగా చూపించాలి. ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌, సెక్యూరిటీ చెకింగ్‌, బ్యాగేజీ స్కానింగ్‌ ఇలా రెండున్నర గంటల పాటు తనిఖీలు ఉంటాయి. ఆ తర్వాతే లాంజ్‌లోకి పంపుతారు. కానీ విజయవాడ విమానాశ్రయంలో రాష్ట్రానికి చెందిన ఒక ఎంపీ నేరుగా వాహనంలో రన్‌ వేపైకి వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్లు తెలుస్తోంది. సెక్యూరిటీలో కీలక అధికారి ఆయనకు సహకరించగా గ్రౌండ్‌ క్లియరెన్స్‌ సిబ్బంది లగేజీ లోపల పెట్టేవారని తెలుస్తోంది. విమానాశ్రయంలో చాలా అధికారాలుండే అధికారి కూడా ప్రభుత్వ పెద్దల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అడ్డు చెప్పేవారు లేరు.

నేరుగా ఎవరెవరు రన్‌ వేపైకి...

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, కేంద్ర కేబినెట్‌ మంత్రి, గవర్నర్‌, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు, విదేశీ అంబాసిడర్లు, భారతరత్నలు, సుప్రీం కోర్టు జడ్జిలు, కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్‌, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌, అటార్నీ జనరల్‌, కేబినెట్‌ సెక్రటరీ, లెఫ్టినెంట్‌ గవర్నర్‌, హైకోర్టు సీజేలను విమానాశ్రయాల్లో నేరుగా రన్‌ వే పైకి అనుమతిస్తారు.

నిబంధనలు బేఖాతరు

విజయవాడ విమానాశ్రయంలో రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ వాహనంలో నేరుగా రన్‌ వేపైకి వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్టు తెలుస్తోంది. ఆయన వాహనం పలుమార్లు నేరుగా రన్‌ వేపైకి ఎలా వెళ్లింది? ఎవరు అనుమతించారనే దానిపై కేంద్ర సంస్థలు ఆరా తీస్తున్నాయి.

ఇటీవల విజయవాడ నుంచి షార్జాకు అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన సందర్భంగా వైసీపీ నేత, గన్నవరం జెడ్పీటీసీ తనను అనుమతించలేదనే కారణంతో భద్రతాధికారి వెంకటరత్నంతో గొడవకు దిగారు. సస్పెండ్‌ చేయిస్తానని ఏకంగా వార్నింగ్‌ ఇచ్చారు.

కువైట్‌, మస్కట్‌, షార్జా నుంచి కేరళలోని కొచ్చికి వచ్చి వెళ్లే విమానాలు విజయవాడలో ఆగుతాయి. ఇలాంటి విమానాశ్రయాల్లో రాష్ట్ర బలగాల రక్షణ మాత్రమే ఎందుకుంది? కేంద్ర బలగాలు ఎందుకు రాలేదు?

Updated Date - 2022-11-19T03:14:30+05:30 IST

Read more