బదిలీల బంతాట ఏడు నెలల్లో నలుగురు!

ABN , First Publish Date - 2022-09-13T09:32:21+05:30 IST

రాష్ట్ర రవాణా కమిషనర్‌ రాజబాబు ఆకస్మికంగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే రాష్ట్రప్రభుత్వం ఆయన్ను గ్రేటర్‌ విశాఖపట్నం కార్పొరేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేయడంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

బదిలీల బంతాట ఏడు నెలల్లో నలుగురు!

  • వాహనాల కన్నా వేగంగా రవాణా కమిషనర్ల బదిలీ
  • ఐఏఎస్‌, ఐపీఎస్‌లు వచ్చినా అదుపు చేయలేనంతగా అవినీతి
  • ఏ చర్యలు తీసుకుందామన్నా పై నుంచి తట్టుకోలేనంత ఒత్తిడి
  • మంత్రి కోరి తెచ్చుకున్న రాజబాబు కూడా విశాఖ కమిషనర్‌గా బదిలీ
  • తామీ శాఖకు వచ్చేది లేదని బ్యూరోక్రాట్ల స్పష్టీకరణ
  • ఇక అంతర్గత సర్దుబాటే దిక్కు


రాష్ట్ర రవాణా శాఖలో వేళ్లూనుకున్న అవినీతిని రూపుమాపడం ఏ కమిషనర్‌ వల్లా కావడం లేదు. ఏ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుందామనుకున్నా బదిలీలు బహుమతిగా అందుతున్నాయి. గత ఏడు నెలల్లో నలుగురు కమిషనర్లు మారడం ఈ శాఖలో పరిస్థితికి అద్దం పడుతోంది.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రవాణా కమిషనర్‌ రాజబాబు ఆకస్మికంగా బదిలీ అయ్యారు. బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే రాష్ట్రప్రభుత్వం ఆయన్ను గ్రేటర్‌ విశాఖపట్నం కార్పొరేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేయడంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవినీతి ఊడలెత్తడం.. చర్యలకు సమాయత్తమయ్యే క్రమంలో ఏడు నెలల్లో నలుగురు కమిషనర్లు మారిపోవడంతో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులెవరూ ఈ పదవి చేపట్టేందుకు సుముఖత వ్యక్తంచేయడం లేదు. ఇంత అవినీతి శాఖను చక్కదిద్దడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో అంతర్గత సర్దుబాటు చేసుకోవాలని ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. చెక్‌ పోస్టుల్లో అధికారుల అవినీతిపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించడం, ప్రైవేటు రవాణా బస్సుల్లో లగేజీ తరలింపుపై నిఘా పెట్టడం, రాష్ట్రం నుంచి బయటకు అడ్డదారుల్లో వెళ్తున్న ఇసుక లారీల గురించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పట్టించుకోవడం లాంటివి ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదని ప్రచారం జరుగుతోంది. ఎందులోనూ జోక్యం చేసుకోవద్దంటూ ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తానిక్కడ ఉండలేనంటూ స్వయంగా రాజబాబు రవాణా శాఖకు నమస్కారం పెట్టేశారన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి.


బదిలీల్లో రాజకీయ జోక్యం..

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐలు), ఇతర అధికారులు, సిబ్బంది బదిలీల్లో రాజకీయ జోక్యం ఇటీవల ఎక్కువైంది. గోదావరి జిల్లాలకు చెందిన ఒక ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరులు ఎంవీఐ పోస్టింగులకు బేరాలు పెట్టి జాబితా సిద్ధం చేసినట్లు గత జూన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల సందర్భంగా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రవాణా కమిషనర్‌గా ఉన్న కాటమనేని భాస్కర్‌ కొన్ని మార్గదర్శకాలు సిద్ధం చేసి వాటికి అనుగుణంగా బదిలీలకు సిద్ధమయ్యారు. అయితే కౌన్సెలింగ్‌కు తాము హాజరు కాబోమంటూ సుమారు 135 మంది ఎంవీఐలు, ఇతర అధికారులు అమాత్యుడి వద్దకు చేరారు. ఈ వివాదం కొనసాగుతుండగానే భాస్కర్‌ అనూహ్యంగా బదిలీ అయ్యారు. ఆ స్థానంలో రాజబాబును కూర్చోబెట్టి ఆటోనగర్‌లో బేరాలు పెట్టుకుని ఆదాయం ఉన్న పోస్టులను లక్షల్లో విక్రయించేశారని ఆరోపణలు గుప్పుమన్నాయి. విదేశీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌ తిరిగి వచ్చేలోపు ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ గడువు ముగిసినా రెండు వారాలు అదనపు సమయం సాధించి మరీ అనుకున్న బదిలీలు చేయించారు.


 అప్పటి నుంచి రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులు మొదలుకొని ప్రైవేటు బస్సుల అక్రమాల వరకూ పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు జిల్లాలకు తరలుతున్న అక్రమ ఇసుక లారీలు.. తమిళనాడు, ఒడిశా నుంచి వచ్చే బియ్యం లారీలు.. ఆఖరుకు పశ్చిమ బెంగాల్‌కు వెళ్లే చేపల కంటైనర్లను సైతం ఎక్కడి కక్కడ ఆపేసి వసూళ్లు చేయడం ఎక్కువైంది. ఆరోపణలు ఎదుర్కొన్న ఎంవీఐలకు కమిషనర్‌ రాజబాబు సంజాయిషీ నోటీసులు ఇవ్వడంతో కీలక ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. ఇంకోవైపు.. ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు ఏకంగా బోర్డులు పెట్టుకుని బస్టాండ్ల ముందే ఆపి ప్రయాణికులను తమ వాహనాల్లో తరలిస్తున్నారు. ఇదంతా నిబంధనల ఉల్లంఘన అంటూ ఆర్టీసీ డిపో మేనేజర్ల నుంచి, లగేజీ అక్రమంగా తరలిస్తున్నారని వాణిజ్య పన్నుల అధికారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రైవేటు బస్సుల లైసెన్స్‌ల్లోని నిబంధనలు పాటించేలా చూడాలంటూ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇందులోనూ ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. అన్నీ పట్టుకుంటే ఎలా.. కొన్ని చూసీ చూడనట్లు వెళ్లాలని ఫోన్లో గట్టిగా చెప్పడంతో రాజబాబు ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. చివరకు సమయపాలన పాటించని ఉద్యోగులపైనా చర్య తీసుకోలేని దుస్థితి ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉద్యోగం చేయలేనంటూ ప్రభుత్వ పెద్దలకు తెలియజేసి రవాణా శాఖకు ఆయన టాటా చెప్పేశారని తెలిసింది. మరోవైపు.. గ్రేటర్‌ విశాఖ కమిషనర్‌గా ఉన్న డాక్టర్‌ లక్ష్మీశ కొన్ని అంశాల్లో పాలక పక్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు వెళ్లింది. దీంతో ఆయన్ను తప్పించి.. రాజబాబుకు ఆ పదవి కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.


ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ససేమిరా..

ఏడు నెలల్లోనే నలుగురు కమిషనర్లు మారడంతో అటువంటి శాఖలోకి తాము రాలేమంటూ ఇతర ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు తల అడ్డంగా ఊపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో పీఎ్‌సఆర్‌ ఆంజనేయులును నిఘా విభాగం అధిపతిగా నియమించిన ప్రభుత్వం.. రవాణా కమిషనర్‌ బాధ్యతలను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఎంటీ కృష్ణబాబుకు అప్పగించింది. ఏప్రిల్‌ మొదటి వారంలో మూడో కృష్ణుడిగా కాటమనేని భాస్కర్‌ ప్రవేశించినా జూన్‌ చివరి వారంలో ఆయన్ను అనూహ్యంగా సాగనంపారు. అమాత్యుడు కోరి తెచ్చుకున్న రాజబాబు సైతం తాజాగా బదిలీ అవడం.. రవాణా శాఖలోనే అంతర్గతంగా కమిషనర్‌ పోస్టును సర్దుబాటు చేసుకోవాలని ప్రభుత్వం జీవోలోనే పేర్కొనడం మరింత చర్చనీయాంశమైంది.

Read more