6 నెలల్లో పూర్తి చేయండి

ABN , First Publish Date - 2022-10-11T09:35:50+05:30 IST

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులపై సీబీఐ నమోదు చేసిన ఓబులాపురం అక్రమ మైనింగ్‌ కేసు విచారణను వచ్చే నెల 9వ

6 నెలల్లో పూర్తి చేయండి

‘గాలి’ కేసులో రోజువారీ విచారణ

నవంబరు 9 నుంచి ప్రారంభించాలి

సీబీఐ ప్రత్యేక కోర్టుకు సుప్రీం ఆదేశం 

నిందితులు విచారణకు సహకరించాలి

జాప్యానికి యత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తాం 

విచారణ పూర్తయ్యే వరకు జనార్దన్‌ రెడ్డి

బళ్లారి, కడప, అనంతపురం వెళ్లరాదు

జనార్దన్‌ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి కేసులో

ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం


న్యూఢిల్లీ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులపై సీబీఐ నమోదు చేసిన ఓబులాపురం అక్రమ మైనింగ్‌ కేసు విచారణను వచ్చే నెల 9వ తేదీన ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణ నిర్వహించాలని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు స్పష్టం చేసింది. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బళ్లారి, అనంతపురం, కడప జిల్లాలకు వెళ్లకుండా విధించిన బెయిల్‌ షరతును రద్దు చేయాలని కోరుతూ గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. ఆయన కుమార్తె ఇటీవల ప్రసవించిన నేపథ్యంలో వచ్చే నెల 6 వరకు ఆయన బళ్లారిలో ఉండడానికి అనుమతించింది.


7వ తేదీ నుంచి విచారణ పూర్తయ్యే వరకు బళ్లారి, కడప, అనంతపురం జిల్లాలకు ఆయన వెళ్లరాదని స్పష్టం చేసింది. సాధ్యమైనంత వరకు బళ్లారి, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన సాక్షులను మొదట విచారించాలని సీబీఐ కోర్టుకు సూచించింది. విచారణ త్వరగా పూర్తి కావడానికి నిందితులు కోర్టుకు సహకరించాలని ఆదేశించింది. విచారణను జాప్యం చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ‘‘ఐపీసీ సెక్షన్లు 120(బీ), 420, 379, 409, 468, 411, 427, 447తో పాటు భారతీయ అటవీ చట్టంలోని సెక్షన్‌ 2, గనులు, ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టంలోని 4(1), 4(1)(ఏ), 23వ నిబంధనలు రెడ్‌ విత్‌ 21వ నిబంధన కింద శిక్షార్హమైన తీవ్ర నేరాల విచారణను గాలి జనార్దన్‌ రెడ్డి ఎదుర్కొంటున్నారు. సీబీఐ కేసు దర్యాప్తు చేస్తోంది. కేసులో సాక్షులుగా ముఖ్యంగా అనంతపురం, కడప, బళ్లారి జిల్లాలకు చెందిన వారున్నారు. ఈ మూడు జిల్లాలకు వెళ్లడానికి ఆయనకు అనుమతిస్తే... సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను చెరిపివేయడం వంటివి చేసే అవకాశముందని సీబీఐ వ్యక్తం చేస్తున్న అనుమానాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం.


గతంలో ఈ అనుమానాలు నిజమని తేలాయి. న్యాయాధికారులను కూడా ప్రభావితం చేశారు. విచారణను వేగవంతం చేయాలని పలుమార్లు సుప్రీంకోర్టు ఆదేశించినా... ఎఫ్‌ఐఆర్‌ నమోదై 11 ఏళ్లు గడిచినా...  విచారణ ప్రారంభం కాకపోవడం దురదృష్టకరం. నిందితులు ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేయడం వల్లే విచారణ మొదలు కాలేదని అర్థమవుతోంది. సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను తార్కిక ముగింపునకు తీసుకురావాలి. తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులో నిందితులు విచారణను జాప్యం చేయడానికి ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఎంత జాప్యమైతే అంత మేర సాక్షులను ప్రభావితం చేసే అవకాశముంది. కాబట్టి రోజువారీ విచారణకు ఆదేశిస్తున్నాం’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Updated Date - 2022-10-11T09:35:50+05:30 IST