కాసేపట్లో గుడివాడకు పాదయాత్ర.. ఏ క్షణం ఏం జరుగుతుందోనని పోలీసులు అప్రమత్తం!

ABN , First Publish Date - 2022-09-24T22:25:13+05:30 IST

కాసేపట్లో గుడివాడ (Gudivada)కు రైతుల మహాపాదయాత్ర (Maha Padayatra) చేరుకోనుంది. రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో పోలీసులు ఆంక్షలు విధించారు.

కాసేపట్లో గుడివాడకు పాదయాత్ర.. ఏ క్షణం ఏం జరుగుతుందోనని పోలీసులు అప్రమత్తం!

గుడివాడ: కాసేపట్లో గుడివాడ (Gudivada)కు రైతుల మహాపాదయాత్ర (Maha Padayatra) చేరుకోనుంది. రైతుల పాదయాత్ర నేపథ్యంలో గుడివాడలో పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో గుడివాడలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. గుడివాడలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. యాత్రకు సంబంధం లేని వ్యక్తులు గుడివాడకు రావద్దని పోలీసులు సూచించారు. రైతుల యాత్రలో పాల్గొంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దావులూరు టోల్‌గేట్‌ (Davuluru Tollgate) దగ్గర వాహనాలను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. పెళ్లిచూపులకు వెళ్తున్నవారిని కూడా ఆపి వెనక్కి పంపారు. పోలీసుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసుల చర్యలపై కోర్టుకు వెళ్లే యోచనలో జేఏసీ నేతలున్నారు. పాదయాత్రకు వస్తున్న స్పందనతో ప్రభుత్వం కావాలనే యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని అమరావతి పరిరక్షణ సమితి నేతలు మండిపడుతున్నారు. 


గుడివాడలో భారీ బందోబస్తు

గుడివాడ వ్యవసాయ మార్కెట్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రథం, రైతులు, మహిళలకు‌ వేర్వేరుగా రోప్ పార్టీలతో పోలీసు బలగాలను మోహరించారు. రైతుల పాదయాత్రపై దాడి జరిగే అవకాశం ఉందని ఇప్పటికే పోలీసులకు జేఏసీ నాయకులు వివరించారు. ఏ క్షణం ఏం  జరుగుతుందోనని పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. తీవ్ర ఉత్కంఠ మధ్య రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి గుడివాడకు భారీగా పోలీసులను రప్పించారు. రైతుల పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో పోలీసుల కవాతు చేశారు. మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్నవారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. కంకిపాడు టోల్ గేట్‌ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వస్తున్నవారిని ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పోలీసుల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 600 మంది రైతులతో పాదయాత్రకు హైకోర్టు (High Court) అనుమతించిందని ఎస్పీ జాషువా (SP Joshua) తెలిపారు. హైకోర్టు ఆదేశాలను అందరూ పాటించాలని, గుడివాడలో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జాషువా హెచ్చరించారు.

Read more