చీకటి బడ్జెట్‌ కాదు

ABN , First Publish Date - 2022-03-16T09:20:32+05:30 IST

‘ఇది చీకటి బడ్జెట్‌ కాదు, రాష్ట్ర ప్రజలకు వెలుగులిచ్చే బడ్జెట్‌’’ అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంథ్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చకు ముగింపుగా మంగళవారం ఆయన

చీకటి బడ్జెట్‌ కాదు

ప్రజలకు వెలుగులిచ్చే బడ్జెట్‌

బడ్జెట్‌పై చర్చలో ఆర్థికమంత్రి బుగ్గన 


అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘‘ఇది చీకటి బడ్జెట్‌ కాదు, రాష్ట్ర ప్రజలకు వెలుగులిచ్చే బడ్జెట్‌’’ అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంథ్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్‌పై చర్చకు ముగింపుగా మంగళవారం ఆయన శాసనసభలో ప్రసంగించారు. ‘‘అప్పులు భారీగా తెచ్చారు... సంక్షేమం చేసిందింతే... మిగతా రూ.94వేల కోట్లు ఏమయ్యాయి? దోచిందెంత? దాచిందెంత? అని టీడీపీ సభ్యులు సభ బయట అంటున్నారు. ఏమీ కాలేదు. అవి వేస్‌ అండ్‌ మీన్స్‌లో భాగంగా వచ్చాయి. ఆ 94వేల కోట్లను అకౌంట్‌ ఫర్‌ చేశాం. ఆ మాటకొస్తే టీడీపీ హయాంలోనూ ఈ తేడా ఉంది. పైగా అప్పుడు చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమం ఏమీ చేయలేదు. మరి ఆ డబ్బు ఏమైనట్లు?’’ అని బుగ్గన ప్రశ్నించారు. కొవిడ్‌ వల్ల ఆదాయం తగ్గినా, సంక్షేమం, అభివృద్ధి కొనసాగించామన్నారు. 2021-22లో వ్యవసాయ రంగంలో 14.5, పారిశ్రామిక రంగంలో 25.88, సేవారంగంలో 18.91, మొత్తంగా 18.47శాతం వృద్ధిరేటు సాధించామని వివరించారు. జాతీయ స్థాయి వృద్ధిరేటు 19.4శాతానికి దగ్గరగా రాష్ట్రం కూడా వృద్ధి సాధించిందన్నారు. 2014-19 మధ్య కేంద్ర రుణాలు 9.89, రాష్ట్ర అప్పులు 17.33 శాతం చొప్పున పెరిగాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కేంద్ర అప్పులు 17.33, రాష్ట్ర అప్పులు 14.88 శాతం మాత్రమే పెరిగాయన్నారు. కొవిడ్‌ పరిస్థితుల్లోనూ 23శాతం పీఆర్సీ ఇచ్చామని, దీనివల్ల ఈ ఏడాది అదనంగా రూ.11,707కోట్లు, ఐఆర్‌ రికవరీ లేకపోవడం వల్ల రూ.5,156కోట్ల భారం పడిందని బుగ్గన పేర్కొన్నారు. 


‘‘రూ.94 వేల కోట్లు ఏమయ్యాయని కాగ్‌ అడిగిందంటూ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాగ్‌ సవాలక్ష ప్రశ్నలు అడుగుతుంది. వాటన్నింటికీ సమాధానాలు ఇస్తాం. కాగ్‌ లేఖలు రాయగానే వీళ్లకు ఎక్కడ దొరుకుతున్నాయో.. అవి తేవడం నేరం’’ అని బుగ్గన పేర్కొన్నారు. టీడీపీ నేతలది ఉక్రెయిన్‌ తెలివి అని ఎద్దేవా చేశారు. మామూలు మనుషులతో మాట్లాడొచ్చు కానీ ఉక్రెయిన్‌ తెలివి ఉన్నవాళ్లతో మాట్లాడలేం అని మంత్రి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-16T09:20:32+05:30 IST