ఎట్టకేలకు దిద్దుబాట

ABN , First Publish Date - 2022-09-08T09:04:43+05:30 IST

ఎట్టకేలకు దిద్దుబాట

ఎట్టకేలకు దిద్దుబాట

‘బతికుండగానే చంపేశారు’ కథనంపై స్పందించిన అధికారులు 

చనిపోయినట్టుగా నమోదైన వారి పేర్లు తొలగిస్తున్న యంత్రాంగం

తెలుగుదేశం వారే మార్చి ఉంటారని ఎమ్మెల్యే వక్రభాష్యం


అవనిగడ్డ టౌన్‌, సెప్టెంబరు 7: సంచలనం సృష్టించిన ఆంధ్రజ్యోతి ‘బతికుండానే చంపేశారు’ కథనంతో కృష్ణా జిల్లా అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న మోపిదేవి మండలానికి చెందిన 155 మంది పేర్లు చనిపోయినట్లుగా యాప్‌లో నమోదైన విషయాన్ని ఏబీన్‌-ఆంధ్రజ్యోతి బహిర్గతం చేయగా, అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. వెరిఫికేషన్‌ సమయంలో అవనిగడ్డ ఎంపీడీవోగా పనిచేసిన బి.ఎం.లక్ష్మికుమారిని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా వివరణ కోరగా, తాము యాప్‌లో ఎలిజిబుల్‌ అనే అప్‌లోడ్‌ చేశామని, తప్పు ఎక్కడ జరిగిందో విచారణ చేపట్టాలని ఆమె కలెక్టర్‌కు లేఖ రాశారు. దీనిపై డీఆర్‌డీఏ అధికారులు, జిల్లా అధికారులు విచారణ చేపట్టి మోపిదేవి మండలంలో చనిపోయిన వారి జాబితాలో ఉన్న పేర్లను ఆ జాబితా నుంచి తొలగించి అర్హుల జాబితాలో పెట్టినట్టు సమాచారం. ఒక్క మోపిదేవి మండలంలోనే కాక జిల్లాలోని మరి కొన్ని చోట్ల కూడా ఇదే తరహాలో అర్హులైన లబ్ధిదారుల పేర్లు డెత్‌ లిస్టులోకి వెళ్లాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటంతో ఆ దిశగా విచారణ చేపట్టిన జిల్లా యంత్రాంగం డెత్‌ లిస్టులోకి వెళ్లిన పేర్లు మరోమారు పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. అర్హులైన వారికి పింఛన్‌ వచ్చేలా చూస్తామని, ఇప్పటికే జిల్లా కలెక్టర్‌, డీఆర్‌డీఏ అధికారులతో ఈ విషయమై మాట్లాడానని తెలిపారు. మోపిదేవి మండలంలో వెరిఫికేషన్‌లో పాల్గొన్న ఆనాటి అవనిగడ్డ ఎంపీడీవో బి.ఎం.లక్ష్మికుమారి కూడా ఆ పేర్లను ఎలిజిబుల్‌ లిస్టులో పెట్టినట్లుగా జిల్లా కలెక్టర్‌కు లేఖ సమర్పించారని చెబుతూ ఎమ్మెల్యే ఆ లేఖను బహిర్గతం చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. రెండు రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ వారే అర్హుల జాబితా మార్చేసుంటారని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా మరో వింత వాదన తెరపైకి తెచ్చారు. జడ్పీటీసీ, ఎంపీపీలు తెలుగుదేశం పార్టీవారే కావటం, అక్కడ మండల పరిషత్‌ కార్యాలయం నుంచే లిస్టు వెళ్లటంతో అక్కడేమైనా తప్పు జరిగిందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Updated Date - 2022-09-08T09:04:43+05:30 IST