క్రికెట్‌ గొడవకు తండ్రి బలి..!

ABN , First Publish Date - 2022-05-24T08:18:00+05:30 IST

క్రికెట్‌ ఆడుకుంటూ గొడవపడిన పిల్లలను మందలించిన ఓ విద్యార్థి తండ్రిపై కేసు నమోదు చేయించి, ఆపై వేధింపులకు గురి చేసి

క్రికెట్‌ గొడవకు తండ్రి బలి..!

పిల్లలను మందలించారని సోమరాజు అనే వ్యక్తిపై కేసు

స్టేషన్‌కు రమ్మనడంతో కలత... గుండెనొప్పితో ఆస్పత్రిలో మృతి


ఏలూరు క్రైం, మే 23: క్రికెట్‌ ఆడుకుంటూ గొడవపడిన పిల్లలను మందలించిన ఓ విద్యార్థి తండ్రిపై కేసు నమోదు చేయించి, ఆపై వేధింపులకు గురి చేసి ఆయన మరణానికి కారణమయ్యారని  రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి, రాష్ట్రంలోని ఓ జిల్లాలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్న సరితపై ఆరోపణలు గుప్పుమన్నాయి. ఏలూరు సమీపంలోని శనివారపుపేట ఇందిరా కాలనీకి చెందిన కుక్కటి సోమరాజు ఒక ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. కుమారుడు శ్యామ్‌ ఈ నెల 8న క్రికెట్‌ ఆడుతుండగా అతని స్నేహితుడు పెనుపోతుల సాయితో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో సోమరాజు వెళ్లి వారిద్దరినీ మందలించి కొట్టారు. ఈ ఘటనపై త్రీ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 9న సోమరాజు, శ్యామ్‌, మరో 15 మందిపై కేసు నమోదు చేశారు. ఏలూరు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌, ప్రముఖ న్యాయవాది బీవీ కృష్ణారెడ్డి, అదనపు ఎస్పీ సరిత ఒత్తిళ్లతోనే తప్పుడు కేసు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ కేసులో ఉన్న 15 మందీ పోలీసు స్టేషన్‌కు రావాలని పోలీసులు పిలవడంతో సోమరాజు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం ఇంటిలో గుండె నొప్పి వచ్చి కుప్పకూలి పోవడంతోఆయన్ను తొలుత ఏలూరు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ మృతి చెందారు. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన ఎంఆర్‌పీఎస్‌ నేతలు...సోమరాజు మృతదేహాన్ని కృష్ణారెడ్డి ఇంటిముందు పెట్టి ధర్నాకు దిగారు. సరిత, కృష్ణారెడ్డి వేధింపుల వల్లే సోమరాజు మరణించాడంటూ ధర్నా చేశారు.

Read more