‘అమరావతి వివాదాలు - వాస్తవాలు’ పుస్తకంలో అసలు నిజాలు.. నాడు మద్ధతిచ్చి సడన్‌గా విశాఖపట్టణానికి జగన్ జై కొట్టడం వెనుక..!

ABN , First Publish Date - 2022-09-07T14:10:45+05:30 IST

2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్తా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. అశాస్త్రీయ విభజన కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రపుటకెక్కిన దుస్థితి. ఎన్నో పరిణామాల అనంతరం అమరావతిని రాజధానిగా ఎంచుకున్న తర్వాత కూడా రాజకీయ అడ్డంకులు ఆగలేదు.

‘అమరావతి వివాదాలు - వాస్తవాలు’ పుస్తకంలో అసలు నిజాలు.. నాడు మద్ధతిచ్చి సడన్‌గా విశాఖపట్టణానికి జగన్ జై కొట్టడం వెనుక..!

2014వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్తా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయాయి. అశాస్త్రీయ విభజన కారణంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రపుటకెక్కిన దుస్థితి. ఎన్నో పరిణామాల అనంతరం అమరావతిని రాజధానిగా ఎంచుకున్న తర్వాత కూడా రాజకీయ అడ్డంకులు ఆగలేదు. రాజధానిగా ఎన్నుకున్న అమరావతి ప్రాంతంలో కమ్మ వారు ఎక్కువగా ఉన్నారనీ, వారి ఆధిపత్యమే ఇక్కడ కూడా ఉండబోతోందని మేధావి వర్గంగా చెప్పుకున్న వారు ఓ ప్రత్యేక చర్చకు తెరతీశారు. అదే సమయంలో అమరావతిని ఎంచుకున్నారు కానీ.. నాటి చంద్రబాబు సర్కారు రాజధాని నిర్మాణ పనులను చేయడంలో జాప్యం చేశారన్న కొత్త వాదన కూడా రాజకీయ కుట్రలో భాగంగా తెరపైకి వచ్చింది. రాజధానిగా అమరావతికి నాడు అసెంబ్లీలో మద్ధతు ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం.. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణం రాగాన్ని ఆలపించడం వెనుక కారణాలు ఏంటి..? అసలు నిజాలు ఏంటి..? అన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను ఇచ్చే ప్రయత్నం చేశారు సీనియర్ జర్నలిస్ట్ కందుల రమేష్. ఆయన రాసిన అమరావతి వివాదాలు-వాస్తవాలు పుస్తకంలో ‘రాజధాని అమరావతి’పై జరిగిన కుట్రలు, అమరావతిపై జరిగిన పుకార్లు, అబద్ధపు ప్రచారాలకు సంబంధించిన అసలు నిజాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ పుస్తకావిష్కరణ సెప్టెంబర్ 8వ తారీఖున విజయవాడలో జరగబోతోంది. ఈ సందర్భంగా ఆ పుస్తకంలోని కొంత భాగం ఆంధ్రజ్యోతి వీక్షకుల కోసం..


***********

అమరావతి వివాదాలు - వాస్తవాలు


మద్రాసు ఒక మహానగరంగా రూపొందడంలో ఆంధ్రులకు గణనీయమైన పాత్ర ఉన్నా, 1953లో మద్రాసును కోల్పోయినందుకు ఎటువంటి పరిహారాన్ని పొందలేదు. అందుకోసం అప్పటి నాయకులు గట్టిగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. గతం నుంచి పాఠాలు నేర్చుకోని కారణంగానే, 2014లో ఆంధ్రులకు ఇదే పరిస్థితి పునరావృతమైంది.


తమకంటూ రాష్ట్రం ఉండాలనే తెలుగువారి కోరికలో ఒక చారిత్రక అనివార్యత ఉన్నా, దీనివల్ల స్పష్టమైన రాజకీయ సరిహద్దులు లేని కాలంలో దక్షిణాది వ్యాప్తంగా స్థిరపడ్డ తెలుగువారి అస్తిత్వం ఆనాటి నుంచి ప్రమాదంలో పడింది. ఇప్పటి తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ప్రాంతాల్లో వందలాది సంవత్సరాలుగా తెలుగువారిగానే కొనసాగిన ఆంధ్రులు 1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత తమ అస్తిత్వాన్ని కోల్పోవడం ఒక చారిత్రక వైచిత్రి. 


ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత, దక్షిణాదిలో వివిధ ప్రాంతాల్లో శతాబ్దాలుగా నివసిస్తున్న ఆంధ్రులకు కోస్తా, రాయలసీమ ఆంధ్రులతో సంబంధాలు తెగిపోయాయి.  భాషాప్రయుక్త రాష్ట్రాల్లో మెజారిటి భాషకు ప్రాధాన్యం పెరగడంతో, అక్కడి ఆంధ్రులు స్థానిక భాషల్లోనే వ్యవహరించడం మొదలుపెట్టారు. క్రమంగా వారిలో తెలుగువారిమనే చైతన్యం చాలావరకు తగ్గింది. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ఏర్పడటం వల్ల జరిగిన నష్టాల్లో ఇదొకటి.

*******


ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్న దశలో రాజధాని మీద కూడా ఒక అవగాహనకు రాలేకపోతే ప్రపంచం ముందు ఆంధ్రులు నవ్వులపాలవుతారని, అన్ని విభేదాలను మరచి కర్నూలుకు అందరు మద్దతు ఇవ్వాలని ప్రకాశం పంతులు పిలుపునిచ్చారు. ఆ తర్వాత అన్ని సవరణ తీర్మానాలను ఓటింగుకు పెట్టారు. తిరుపతి కావాలన్న లచ్చన్న తీర్మానం, విజయవాడ కావాలన్న నాగిరెడ్డి తీర్మానం, విశాఖపట్నం కావాలన్న కె వెంకట నారాయణ దొర తీర్మానం వీగిపోయాయి. చివరగా విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉండాలన్న వావిలాల గోపాలకృష్ణయ్య తీర్మానం కూడా ఓటమి పాలైంది. పడిన ఓట్లను లెక్కపెట్టాలని ఆయన కోరారు. ఆ ప్రకారం తీర్మానానికి అనుకూలంగా - అంటే విజయవాడ-గుంటూరుకు అనుకూలంగా - 62 ఓట్లు వచ్చాయి. తీర్మానానికి వ్యతిరేకంగా 63 ఓట్లు వచ్చాయి. అంటే ఒక్క ఓటుతో విజయవాడ-గుంటూరు తీర్మానం ఓడిపోయింది. 


ఇక్కడ రెండు విషయాలు చెప్పుకోవాలి. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఉండాలని కోరుకున్న వారిలో కమ్యూనిస్టులే కాకుండా, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అందుకే సిపిఐ సభ్యుల సంఖ్య కంటే ఎక్కువ అనుకూల ఓట్లు విజయవాడకు వచ్చాయి. అయితే సిపిఐ నాయకుడు నాగిరెడ్డి తీర్మానానికి కాకుండా, ఇండిపెండెంట్‌ సభ్యుడైన వావిలాల తీర్మానానికి ఎక్కువ ఓట్లు రావడానికి కారణం బహుశా కమ్యూనిస్టులకు మద్దతు ఇవ్వడంలో మిగతా పార్టీల ఎమ్మెల్యేలకు ఉన్న ఇబ్బంది అనుకోవాలి.


రెండవది, ఈ తీర్మానాల మీద ఆంధ్ర సభ్యులు తప్ప మిగతా - తమిళ, మలయాళ, కన్నడ - సభ్యులు ఓటింగులో పాల్గొనవద్దని ముఖ్యమంత్రి రాజాజీ సూచించారు. అయినా, నలుగురు ఆంధ్రేతర సభ్యులు - తమిళనాడు సోషలిస్టు పార్టీకి చెందిన ఎస్‌సిసి ఆంథోని పిళ్లై, కేరళ కాంగ్రెస్‌కు చెందిన ఏ అప్పు, కేరళ ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌కు చెందిన కున్ని మహమ్మద్‌ షరీఫ్‌, తమిళనాడు కాంగ్రెస్‌కు చెందిన పి సెల్వరాజ్‌ - విజయవాడ-గుంటూరు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటువేశారు. అయినా ఒక్క ఓటు తేడాతో మాత్రమే విజయవాడ-గుంటూరు ఓడిపోవడం విశేషం. బహుశా ఈ కారణం చేతనే రీపోల్‌ కావాలని కొందరు కమ్యూనిస్టు సభ్యులు పట్టుబట్టినా, స్పీకర్‌ అందుకు ఒప్పుకోలేదు.


కర్నూలు ఎంపిక జరిగినా ఈ నిర్ణయానికి మద్దతు లేని విషయాన్ని నెల్లూరు నుంచి ప్రచురితమయ్యే ప్రఖ్యాత రాజకీయ పత్రిక జమీన్‌ రైతు ఇలా ప్రకటించింది, ‘‘అసలు యీ కర్నూలు నిర్ణయమనేది హృదయపూర్వకంగా జరిగింది కాదని మొన్నటి ఓటింగ్‌ రుజువుపరచింది. పట్టింపులు, పార్టీ నిర్బంధాల వల్ల కర్నూలుకు ఓటు వేశారే గాని, ఆ సూచన ఎవ్వరికీ అంగీకారం కాదని తేలింది’’.

******


అప్పటి ప్రభుత్వం ఎందుకు శివరామకృష్ణన్‌ కమిటి రిపోర్టుని పట్టించుకోలేదు? కమిటి సూచించిన విధంగా కాకుండా ఒక సరికొత్త నగరాన్ని నిర్మించాలని ఎందుకు నిర్ణయించింది? ముందుగా శివరామకృష్ణన్‌ కమిటి రిపోర్టులో ఒక ప్రధాన లోపాన్ని గమనించాలి. ఏ పరిస్థితుల్లో అవశేష ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భవించింది, ఏ చారిత్రక శక్తుల ఘర్షణలో నలిగిపోయింది, ఏ సంక్లిష్ట సందర్బంలో రాజధాని అవసరమైంది అనే స్పృహ ఈ రిపోర్టును తయారుచేసిన వారిలో లోపించింది.


ఉదాహరణకు చత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రం 2000వ సంవత్సరంలో ఏర్పడిన విధానం, ఆంధ్రప్రదేశ్‌ 2014లో ఆవిర్భవించిన తీరు వేర్వేరు. చత్తీస్‌ఘఢ్‌ ఇష్టపూర్వకంగా మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ తన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా విభజించబడింది. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌తో చత్తీస్‌ఘఢ్‌కు అనుబంధం లేదు. కాని హైదరాబాద్‌ను కోల్పోవడానికి ఆంధ్ర మానసికంగా సిద్ధపడలేదు. ఈ తేడాని, దానివల్ల ఆంధ్ర సమాజానికి జరిగిన సైకలాజికల్‌ డ్యామేజిని అర్థం చేసుకోవడానికి, అంచనావేయడానికి శివరామకృష్ణన్‌ కమిటి ప్రయత్నం కూడా చేయలేదు.


కమిటి రిపోర్టులో స్పష్టత లోపించింది. ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సి ఉండగా, కమిటి ఏ ఒక్క నగరాన్ని రాజధానిగా సూచించలేదు. ప్రభుత్వ కార్యాలయాలన్నిటిని ఒకచోట కాకుండా, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో నెలకొల్పాలని మాత్రమే సిఫార్సు చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రభుత్వ కార్యాలయాల వికేంద్రీకరణ మధ్య తేడాని అర్థం చేసుకోవడంలో శివరామకృష్ణన్‌ విఫలమయ్యారు. రాష్ట్రంలో విభజనానంతర ప్రత్యేక పరిస్థితులను, అస్తిత్వానికి సంబంధించి పెల్లుబుకుతున్న ఆక్రోశాన్ని, సాంస్కృతిక భావోద్వేగ అంశాలను కమిటి పట్టించుకోలేదు. రాజధానిని కొన్ని గవర్నమెంటు ఆఫీసుల సముదాయంగా తప్ప, దిక్కుతోచని చౌరస్తాలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ నిలబడ్డ చారిత్రక సందర్భాన్ని అర్థం చేసుకోలేదు.


*********


రాజధానిగా నిర్ణయించిన అమరావతి గ్రామాల్లో దళితులకు చోటు లేదని, ఇక్కడ కమ్మల జనాభా అత్యధికమని చాలామంది నమ్ముతున్నారు. ఈ అబద్ధాన్ని గోడకట్టినట్టు ప్రచారం చేయడంలో రాజకీయ పార్టీలతో పాటు, మేధావులమని చెప్పుకునేవారు కూడా పాత్ర పోషించారు. వాస్తవాలకు ఇది పూర్తి విరుద్ధం. సీఆర్‌డీఏ 2015 ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించిన విస్తృత సర్వే ప్రకారం, రాజధానిగా ప్రకటించిన గ్రామాల్లో జనాభా 1,03,874 కాగా, 37,682 కుటుంబాలు నివాసం ఉన్నాయి.  వీరిలో అందరికంటే దళితుల సంఖ్యే ఎక్కువ. ఆ తర్వాత బిసిలు, ఓసిలు ఉన్నారు. ఎస్సీలు, ఎస్టీలు 37.9 శాతం ఉండగా, బిసిలు 30 శాతం, ఓసిలు 29.6 శాతం, మైనారిటీలు 2.5 శాతం ఉన్నారు.


*********


రాజధాని నిర్మాణానికి పూనుకున్న తర్వాత అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పనుల్లో చాలా జాప్యం చేసిందనే భావన విస్తృతంగా మీడియాలోను, జనంలోను ప్రచారమైంది. నిజానికి ఈ జాప్యానికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్టును అడుగడుగునా ఇలా అడ్డుకున్న సైంధవులే. ఒకవైపు అమరావతిలో పనులు జరగడం లేదని ప్రచారం చేసిన వాళ్లే, మరోవైపు వెనకనుంచి న్యాయపరమైన చిక్కుల్లో (vexatious litigation) రాజధానిని ఇరికించారు. ఎన్జీటిలో కేసు నడిచిన దాదాపు రెండేళ్ల పాటు అమరావతిలో పనులు వేగంగా జరగడానికి అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత సుప్రీం కోర్టులో మరో ఏడాది గడిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు డిజైన్లకు తుదిరూపు ఇస్తూ, మరోవైపు కోర్టు కేసులతో కుస్తీ పట్టాల్సి వచ్చింది.


 అమరావతి వంటి భారీ ప్రాజెక్టుల్లో పర్యావరణ అనుమతులు పొందే ప్రక్రియ క్లిష్టతరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. 2014 డిసెంబరులో రాజధాని నిర్మాణం కోసం సీఆర్‌డీఏ చట్టాన్ని చేస్తే, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాన్నంతా పూర్తిచేసుకొని 2015 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతిని పొందింది. ఆ తర్వాత ఈ అనుమతిని సవాలు చేస్తూ అమరావతి వ్యతిరేకులు ఎన్జీటిలో కేసు వేస్తే తీర్పు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత ఎన్జీటిలో రివ్యూ పిటిషన్‌ వేసి, అక్కడ ఓడిపోయాక సుప్రీం కోర్టులో అప్పీలుకు అమరావతి వ్యతిరేకులు వెళ్లారు. చివరకు సుప్రీం కోర్టులో 2019 జనవరి 4న అమరావతి నిర్మాణానికి అనుకూలంగా తుది తీర్పు వచ్చింది. అంటే పర్యావరణ అనుమతిని పొందడానికి ఏడాది పడితే, కోర్టుల్లో కేసుల నుంచి బయటపడటానికి రాష్ట్ర ప్రభుత్వానికి మరో మూడు సంవత్సరాలపైన పట్టింది.


*******


1953లో విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా లేకుండా చేయడానికి అప్పటి కాంగ్రెస్‌ నాయకులు విశాఖపట్నాన్ని ముందుకు తీసుకువచ్చారు. అదేవిధంగా ఇప్పుడు  అమరావతిలో కొంతదూరం ప్రయాణించిన తర్వాత ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ పేరుతో విశాఖపట్నానికి తరలివెళ్లాలన్న ప్రతిపాదనను జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆయన అనూయాయులు చేస్తున్నారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్‌లో చరిత్ర పునరావృతమవుతోంది. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఏర్పడకుండా కాంగ్రెస్‌ పార్టీ గతంలో ఏవిధంగా అడ్డుకుందో, ఇవాళ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అదే ఎత్తుగడ అవలంబిస్తోంది. ఆనాడు కమ్యూనిస్టులకు పలుకుబడి ఎక్కువ అనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఈనాడు తెలుగుదేశం పార్టీకి ప్రాబల్యం ఎక్కువనే దురభిప్రాయంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజధాని అంశాన్ని పూర్తి రాజకీయం చేశాయి. ఇందుకోసం అప్పుడూ ఇప్పుడూ కులాన్ని వాడుకోవడానికి ఏమాత్రం సందేహించలేదు.


(సీనియర్ పాత్రికేయుడు కందుల రమేష్ రచించిన ‘అమరావతి   వివాదాలు - వాస్తవాలు’ నుంచి కొన్ని భాగాలు. సెప్టెంబరు 8 న విజయవాడలో ఈ పుస్తకావిష్కరణ జరుగుతోంది.) 

Read more