‘గాంధీ’ కేసులో అంతా గోప్యం!

ABN , First Publish Date - 2022-09-08T08:56:58+05:30 IST

‘గాంధీ’ కేసులో అంతా గోప్యం!

‘గాంధీ’ కేసులో అంతా గోప్యం!

కన్ను పొడిచేసిన ముగ్గురు అరెస్టు

రహస్యంగా కోర్టుకు హాజరు 

రిమాండ్‌ను తిరస్కరించిన జడ్జి

నిజమైన టీడీపీ నేతల అనుమానం


విజయవాడ, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై ఈ నెల 3న విజయవాడ పటమటలంకలో  వైసీపీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాంధీ కుడి కన్నును కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. పటమటలంకకు చెందిన గద్దె కల్యాణ్‌, రామలింగేశ్వరనగర్‌కు చెందిన అలచింతల సుబ్రహ్మణ్యం అలియాస్‌ సుబ్బు, రాణిగారితోటకు చెందిన తమ్మిశెట్టి లీలాకృష్ణలను విజయవాడ నాలుగో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ కోర్టులో బుధవారం హాజరుపరిచారు. కేసు నమోదులో, ఆధారాల సేకరణలో పోలీసులతీరును కోర్టు తప్పుబట్టింది. నిందితులకు రిమాండ్‌ను తిరస్కరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిందితులకు 41(ఏ) నోటీసు ఇవ్వాలని ఆదేశించింది. నిందితుల తరపున న్యాయవాది కిలారుబెనర్జీ వాదనలు వినిపించారు. కాగా, ఈ కేసులో ఆది నుంచి టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్న అనుమానమే నిజమైందని రాజకీయ నేతలు అంటున్నారు. పోలీసులు.. నిందితులను కాపాడేందుకే బలహీనమైన సెక్షన్లను నమోదు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. 

Read more