అందరికీ రెబెల్‌ స్టార్‌... నాకు మాత్రం ‘అన్నగారు’

ABN , First Publish Date - 2022-09-17T09:20:58+05:30 IST

అందరికీ రెబెల్‌ స్టార్‌... నాకు మాత్రం ‘అన్నగారు’

అందరికీ రెబెల్‌ స్టార్‌... నాకు మాత్రం ‘అన్నగారు’

కృష్ణంరాజుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ నివాళులు

సినీ రంగానికి, బీజేపీకి తీరని నష్టం: కిషన్‌రెడ్డి

ఫిల్మ్‌నగర్‌లో కృష్ణంరాజు విగ్రహం: తలసాని


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అందరికీ రెబెల్‌ స్టార్‌గా సుపరిచితమైన కృష్ణంరాజును... తాను మాత్రం ‘అన్నగారు’గానే గుర్తుంచుకుంటానని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌ జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాల్లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కృష్ణంరాజు సంస్మరణ సభ జరిగింది. దీనికి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై కృష్ణంరాజు చిత్రపటానికి నివాళులర్పించారు. ‘‘వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అన్నగారు ఎంపీగా, మంత్రిగా బాధ్యతాయుతంగా పనిచేశారు. కొన్ని నెలల క్రితం ఢిల్లీ వచ్చినప్పుడు నన్ను కలిశారు. అదే ఠీవి.. అదే గాంభీర్యం చూసి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని భావించాను. అనారోగ్యంతో ఉన్నట్టు ఎక్కడా నాకు అనిపించలేదు’’ అన్నారు. కృష్ణంరాజు కుటుంబంతో కూడా తనకు పరిచయం ఉందని, బాహుబలి రిలీజ్‌ అయిన సమయంలో అన్నగారి కోరిక మేరకు తమ కుటుంబమంతా ఆ సినిమా చూసిందని రాజ్‌నాథ్‌ సింగ్‌ గుర్తుచేసుకున్నారు. ఎంపీగా, మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌లో తొలిసారిగా గోహత్య నిషేధ బిల్లును ప్రవేశపెట్టి కృష్ణంరాజు ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. సంస్మరణ సభకు రాజ్‌నాథ్‌ సింగ్‌ కృష్ణంరాజు కుటుంబీకులతో కలిసి వచ్చారు. సభకు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలుగు సినిమా, రాజకీయాల్లో మంచి పేరుప్రతిష్ఠలు సంపాదించిన వ్యక్తిగా కృష్ణంరాజును కొనియాడారు. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తాను బీజేపీ యూత్‌ వింగ్‌లో ఉన్నానని.. అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడిందని కిషన్‌రెడ్డి అన్నారు. కృష్ణంరాజు మృతి సినీ రంగానికి, బీజేపీకి తీరని లోటు అన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ... ఫిల్మ్‌నగర్‌లో కృష్ణంరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై సినీ ప్రముఖులతో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Updated Date - 2022-09-17T09:20:58+05:30 IST