ఈఎస్ఐని ముంచేశారు

ABN , First Publish Date - 2022-02-16T07:19:04+05:30 IST

రిఫరల్‌ వ్యవస్థ అంటే ఈఎ్‌సఐ డైరెక్టరేట్‌ అధికారులకు అత్యంత మక్కువ. దీని వెనక మర్మం ఏమిటో తెలియదు. ...

ఈఎస్ఐని  ముంచేశారు

ఏదొచ్చినా ప్రైవేట్‌ ఆస్పత్రులకే రిఫరల్‌

కంటి నొప్పికీ, 

కాలినొప్పికీ చికిత్స చేయరు

వచ్చేవాటిలో 90ు రిఫరల్‌కే 

కార్మికుల వైద్యానికి 

ఏటా రూ.కోట్ల బడ్జెట్‌

అదంతా బయటి ఆస్పత్రులకు

టైఅప్‌లతో పటిష్ఠ వ్యవస్థకు

డైరెక్టరేట్‌ పాతర

భారీగా ముడుపుల దందా

అంపశయ్యపై ఈఎస్‌ఐ

ఏదొచ్చినా ప్రైవేట్‌ ఆస్పత్రులకే రిఫరల్‌


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రిఫరల్‌ వ్యవస్థ అంటే ఈఎ్‌సఐ డైరెక్టరేట్‌ అధికారులకు అత్యంత మక్కువ. దీని వెనక మర్మం ఏమిటో తెలియదు. కానీ ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో జ్వరం బాధితులకు కూడా సక్రమంగా వైద్యం అందించే పరిస్థితి లేకుండా చేసేశారు. గతంలో ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో జనరల్‌ సర్జరీ విభాగంలో హెర్నియా చికిత్సతోపాటు మరికొన్ని శస్త్ర చికిత్సలు అద్భుతంగా చేసేవారు. గొంతులో ఏర్పడే గవద బిళ్లలు, ముక్కులో గడ్డలను తొలగించే చికిత్సలూ నిర్వహించేవారు. అలాంటిది ఇప్పుడున్న ఐదింటిలో నాలుగు ఆస్పత్రుల్లో థియేటర్లు మూతపడడం... ప్రైవేటు ఆస్పత్రులపై డైరెక్టరేట్‌లోని ఓ కీలక అధికారి అత్యంత ప్రేమానురాగాలు కలిగి ఉండడంతో రిఫరల్‌ పెరిగి శస్త్ర చికిత్సలు కుంటుపడ్డాయి. రిఫరల్‌ వ్యవస్థను నడిపించే  ఈ అధికారికి కాసుల వర్షం కురుస్తోంది. ఈఎ్‌సఐ టై అప్‌ ఆస్పత్రులను ప్రోత్సహిస్తూ... ఈఎ్‌సఐ ఆస్పత్రులను సదరు అధికారి చంపేస్తున్నారు.


నిబంధనల మాటేమిటి?

ఒక రోగిని ఈఎ్‌సఐ నుంచి మరొక ఆస్పత్రికి రిఫర్‌ చేయాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. దీనికి ఒక కమిటీ ఉంటుంది. కమిటీ ఆమోదించిన తర్వాతనే రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు తరలించాల్సి ఉంటుంది. కమిటీకి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చైర్మన్‌గా ఉంటారు. ముగ్గురు ప్రత్యేక వైద్యులు ఈ కమిటీలో ఉంటారు. రిఫర్‌ చేయాల్సిన రోగిని కమిటీ పూర్తిస్థాయిలో పరీక్షిస్తుంది. తమ ఆస్పత్రిలో వైద్యం అందించే పరిస్థితి లేదని కమిటీ నిర్ధారణకు వస్తేనే రిఫరల్‌కు అనుమతించాలి. కానీ, ఇప్పుడు ఈ నిబంధనలేమీ లేవు. జ్వరం వచ్చినా.. కాలు నొప్పి వచ్చినా, ఏ చిన్న రోగం వచ్చినా డిస్పెన్సరీ డాక్టర్‌ చూడడం.. ఈఎ్‌సఐ స్పెషాలిటీ ఆస్పత్రికి పంపించడం.. అక్కడి మెడికల్‌ అధికారి ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్‌ చేయడం చకచకా జరిగిపోతోంది. ఈ విషయంలో వైద్యులను తప్పుపట్టడానికి లేదు. వైద్యులు రోగులకు శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చినా... వారికి అవసరమైన సదుపాయాలు కల్పించకపోవడం డైరెక్టరేట్‌ తప్పు. ఈ కారణంగా వైద్యులు కూడా చేసేది లేక రిఫరల్స్‌కు ఆమోదిస్తున్నారు. గతంలో 100 మంది రోగులకు 40 శాతం మంది రోగులను మాత్రమే రిఫర్‌ చేసేవారు. ఇప్పుడా సంఖ్య 90శాతానికి పెరిగింది. ఈఎ్‌సఐలో ఐపీ శాతం భారీగా పడిపోవడానికి కారణమిదే.

 

గర్భిణులనూ తరలించేస్తున్నారు...

గర్భిణులకు వైద్య సేవలు అందించడంలో ఈఎ్‌సఐ ఆస్పత్రులు ముందుంటాయి. ఇది ఒకప్పటి మాట. గర్భిణులను ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో చేర్చుకుని చికిత్స అందిస్తున్న కేసులు బాగా తగ్గిపోయాయి. ఎక్కువభాగం ప్రైవేటు ఆస్పత్రులకే రిఫర్‌ చేసేస్తున్నారు. సాధారణ ప్రసవాలను కూడా ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో చేయడం లేదు. గతంలో ఈ ఆస్పత్రుల్లో నెలకు 120 వరకూ సాధారణ ప్రసవాలు, 40 వరకూ సీజేరియన్లు చేసేశారు. ఆపరేషన్‌ థియేటర్లు మూతబడ్డాక.. ఈ కేసులన్నీ ప్రైవేటు ఆస్పత్రులకే తరలిస్తున్నారు. దీంతో ఈఎ్‌సఐపై భారీగా ఆర్థిక భారం పడుతోంది. ప్రైవేటు ఆస్పత్రులకు గర్భిణులను పంపించడం వల్ల సాధారణ డెలవరీకి రూ.15 వేలు, సీజేరియన్‌కు రూ.20 వేలు ఈఎ్‌సఐ డైరెక్టరేట్‌ చెల్లించాలి. అంటే నెలకు రూ.24 లక్షలు, ఏడాదికి రూ.2.88 కోట్లను ఈఎ్‌సఐ బడ్జెట్‌లోని నిధుల్లోంచి ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లిస్తున్నారు. ఈ చికిత్సలు ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో నిర్వహిస్తే.. ఈ నిధులన్నీ ఈఎ్‌సఐ ఆస్పత్రుల అభివృద్ధికి ఉపయోగపడతాయి. కానీ అధికారులు మా త్రం ప్రైవేటుకు తరలించేందుకే మొగ్గు చూపుతున్నారు. 


రెన్యువల్‌ దందా..

ఈఎ్‌సఐ టై అప్‌ ఆస్పత్రులు మూడేళ్లకు ఒకసారి రెన్యువల్‌ చేసుకోవాలి. కానీ, ఈ నిబంధనలను తుంగలో తొక్కారు. టై అప్‌ ఆస్పత్రులకు తొలుత ఒక ఏడాదికి అనుమతి ఇస్తారు. అందిస్తున్న సేవలు బాగుంటే మరో ఏడాది పొడిగిస్తారు. ఈఎ్‌సఐ డాక్టర్లు సిఫారసు చేస్తే ఇంకో ఏడాది అవకాశమిస్తారు. ఇలా మూడేళ్ల పాటు ఒక ఆస్పత్రిని టై అప్‌ ఆస్పత్రిగా కొనసాగించవచ్చు. మూడేళ్ల తర్వాత నోటిఫికేషన్‌ ఇవ్వాలి. నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత టై అప్‌ ఆయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రుల్లో తనిఖీలు చేస్తారు. అంతా బాగానే ఉందనుకుంటేనే టై అప్‌కు ఆమోదముద్ర పడుతుంది. కానీ, ఈ ప్రక్రియ కోసం నోటిఫికేషన్‌ ఇచ్చి నెలలు గడుస్తున్నా... ఫైల్‌ మాత్రం కదలడం లేదు. ఇప్పటికే ఉన్న టై అప్‌ ఆస్పత్రులనే ప్రతి నెలా రెన్యువల్‌ చేస్తూ వస్తున్నారు. దీని వెనుక భారీగా ముడుపులు చేతులు మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. టై అప్‌లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల నుంచి డైరెక్టరేట్‌లోని ఒక కీలక అధికారి ప్రతి నెల ముడుపులు తీసుకుంటూ.. నోటిఫికేషన్‌ ప్రక్రియను తొక్కిపెడుతున్నట్టు ఈఎ్‌సఐ వర్గాలే చెబుతున్నాయి. దీనివెనుక పెద్ద స్కెచ్చే ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే టై అప్‌లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం ప్రతి నెల ఈఎ్‌సఐ డైరెక్టరేట్‌కి బిల్లులు పెడుతుంది. ఈ ప్రక్రియలో కొంత మంది ప్రైవేటు వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారని సమాచారం. ప్రైవేటు వ్యక్తులు నేరుగా ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదిస్తున్నారు. ఈఎ్‌సఐలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు తాము ఇప్పిస్తామని, అక్కడి కీలక అధికారి ద్వారా పని అయ్యేటట్టు చూస్తామని చెబుతున్నారట! ఇందుకుగాను బిల్లులో 20 శాతం డిమాండ్‌ చేస్తున్నారని తెలిసింది. ఇలా వసూలుచేసిన డబ్బులను వాళ్లు సదరు  అధికారికి చేరుస్తున్నారు. విజయవాడలోని ప్రముఖ హోటల్‌లో ఈ లావాదేవీలను ఆయన సాగిస్తారని చెబుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులతోనూ ఆయన బేరాలు కుదుర్చుకుంటున్నారని తెలిసింది.


టై అప్‌కు రేటు ఫిక్స్‌..

నోటిఫికేషన్‌ చూసి విశాఖలో ఓ దంతవైద్యశాఖ టై అప్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. వారం రోజుల క్రితం డైరెక్టరేట్‌ నుంచి ఇద్దరు ఉద్యోగులు నేరుగా ఆ ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి నిర్వాహకుడిని కలిసి బేరసారాలు ప్రారంభించారు. కొంత మొత్తం చెల్లిస్తే వెంటనే టై అప్‌కు అనుమతిస్తామని మాట్లాడినట్టు తెలిసింది. ఈ వ్యవహారాన్నంతా ఆయన ఫోన్‌లో రికార్డు చేసి నేరుగా డైరెక్టరేట్‌కి ఫిర్యాదు చేశారు. సదరు ఉద్యోగులపై డైరెక్టరేట్‌ తూతూమంత్రంగా చర్యలు తీసుకుని వదిలేసింది. ఈ ఉద్యోగులను వెనుకుండి సదరు అధికారే నడిపించినట్టు సమాచారం. 


ఏటా కోట్ల రూపాయల బడ్జెట్‌....అత్యంత పెద్ద నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ ఈఎ్‌సఐ సొంతం. అయినా కడుపు నొప్పి వచ్చినా...కాళ్ల నొప్పి వచ్చినా.. కంటి నొప్పి వచ్చినా... రిఫరల్‌ మాత్రం కామన్‌. రోగం ఏదైనా ప్రైవేటు ఆస్పత్రే దిక్కు అన్న మాదిరిగా ఈఎ్‌సఐ వ్యవస్థను మార్చేశారు. టై అప్‌ ఆస్పత్రుల సంఖ్య పెంచేసి.. రిఫరల్‌ పేరుతో ఈఎ్‌సఐ బడ్జెట్‌ మొత్తాన్ని డైరక్టరేట్‌ అధికారులు ప్రైవేటు ఆస్పత్రులకు దోచి పెడుతున్నారు. డైరెక్టరేట్‌లోని ఒక కీలక అధికారి ప్రత్యేకించి ఇదే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. 

Read more