అన్నీ ప్రజలకు చెప్పి చేయలేం!

ABN , First Publish Date - 2022-11-02T05:49:30+05:30 IST

ప్రతి విధాన నిర్ణయానికీ ప్రజాభిప్రాయం తీసుకోవడం సాధ్యం కాదని విద్యామంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే అప్పుడు వెనకడుగు వేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ అర్ధరాత్రి నోట్లు రద్దు చేశారని.. దేశ ప్రజలందరికీ ముందే చెప్పి చేయలేదు కదా అని ప్రశ్నించారు.

అన్నీ ప్రజలకు చెప్పి చేయలేం!
Minister Botsa Satyanarayana

మా సంస్కరణలు విఫలమైతే...ఎన్నికల్లో మేమే నష్టపోతాం

తెలుగు మీడియం కోసంప్రధానిని చట్టం చేయమనండి: బొత్స

అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రతి విధాన నిర్ణయానికీ ప్రజాభిప్రాయం తీసుకోవడం సాధ్యం కాదని విద్యామంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే అప్పుడు వెనకడుగు వేస్తామని చెప్పారు. ప్రధాని మోదీ అర్ధరాత్రి నోట్లు రద్దు చేశారని.. దేశ ప్రజలందరికీ ముందే చెప్పి చేయలేదు కదా అని ప్రశ్నించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం కూడా సంస్కరణలు తీసుకొస్తోందన్నారు. పిల్లల భవిష్యత్‌ బాగుండాలని సంస్కరణలు చేస్తున్నామని.. అవి ఫలితాలు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో తామే నష్టపోతామని వ్యాఖ్యానించారు. మంగళవారమిక్కడ తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అందరూ ఇంగ్లిష్‌ మీడియం కోరుకుంటుంటే.. తెలుగు మీడియం ఎందుకని ప్రశ్నించారు. ఐదో తరగతి వరకు బోధన మాతృభాషలోనే ఉండాలని ప్రధాని చెప్పారని విలేకరులు ప్రస్తావించగా.. ‘అయితే తెలుగు మీడియం కచ్చితంగా ఉండాలనే చట్టం చేయాలని మోదీకి చెప్పండి. అందుకోసం రాజ్యాంగ సవరణ చేయమనండి. మా ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ప్రాధాన్య రంగాలుగా తీసుకుంది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు పథకం అమలుచేస్తున్నాం.

నాడు-నేడు అంటే అదొక అద్భుత పదార్థం కాదు. పాఠశాలలు అప్పుడెలా ఉన్నాయి.. ఇప్పుడెలా ఉన్నాయో చూపించే ప్రయత్నమే’ అని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం 2,900 పాఠశాలలను పూర్తిగా మూసివేసిందని, తాము ఒక్కటి కూడా మూసేయలేదన్నారు. తమ విధానాలు బాగున్నందునే ఉపాధ్యాయ సంఘాలు కూడా వ్యతిరేకంగా మాట్లాడడం లేదని.. వాటితో తమకెలాంటి లాలూచీ లేదని చెప్పారు. ఎమ్మెల్యేల అభ్యంతరాలతో 891 పాఠశాలల్లో విలీనం నిలిపివేశామని, చివరకు 4,943 పాఠశాలల్లో పూర్తిచేశామని పాఠశాల విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ రాజశేఖర్‌ తెలిపారు. విలీనం విషయంలో లోతుగా కసరత్తు చేసి జాప్యం చేశామని, దీంతో సీఎం తమపై అసహనం వ్యక్తంచేశారని చెప్పారు. కొన్ని పత్రికలు టార్గెట్‌ చేసి వార్తలు రాస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో పాఠశాల విద్య, ఇంటర్‌ విద్య కమిషనర్లు సురేశ్‌కుమార్‌, ఎంవీ శేషగిరిబాబు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T05:50:04+05:30 IST