ఆంధ్రప్రభలో ఈడీ సోదాలు!

ABN , First Publish Date - 2022-10-08T08:50:58+05:30 IST

ఆంధ్రప్రభలో ఈడీ సోదాలు!

ఆంధ్రప్రభలో ఈడీ సోదాలు!

బోయినపల్లి అభిషేక్‌ పెట్టుబడులపై ముత్తా గోపాలకృష్ణను ప్రశ్నించిన ఈడీ?

ఢిల్లీ మద్యం కుంభకోణం కింగ్‌పిన్‌.. గతంలో ఆంగ్ల చానల్‌ సేల్స్‌ ఇన్‌చార్జి 

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబర్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం అటూ ఇటూ తిరిగి ఆంధ్రప్రభ పత్రికకు కూడా చుట్టుకుంది. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన అర్జున్‌ పాండే ఆంధ్రప్రభ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఆంగ్ల వార్తా చానెల్‌ ‘ఇండియా అహెడ్‌’కు గతంలో కొంతకాలం సేల్స్‌ విభాగాధిపతిగా పని చేశారు. మరొకరు బోయినపల్లి అభిషేక్‌ ‘ఆంధ్రప్రభ-ఇండియా అహెడ్‌’లో పెట్టుబడులు పెట్టారు. వారిద్దరితో ఆంధ్రప్రభకు ఉన్న సంబంధం నేపథ్యంలో పత్రికాధిపతి ముత్తా గోపాలకృష్ణను శుక్రవారం ఈడీ ప్రశ్నించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఈడీ శుక్రవారం హైదరాబాద్‌లోని ఆంధ్రప్రభ పత్రిక కార్యాలయం సహా ఢిల్లీ, పంజాబ్‌, హైదరాబాద్‌లతో పాటు దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో తాజాగా దాడులు నిర్వహించింది. జూబ్లీహిల్స్‌లోని ఆంధ్రప్రభ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈడీ సోదాలు జరిగాయి. ముత్తా కుటుంబం నిర్వహిస్తున్న ఆంగ్ల చానెల్‌కు అర్జున్‌ పాండేకు ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మద్యం కంపెనీలు, పంపిణీదారులు, సరఫరా నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న వారిపై ఈ దాడులు నిర్వహించినట్లు ఈడీ ధ్రువీకరించింది. ఢిల్లీలో  ఉప ముఖ్యమత్రి మనీష్‌ సిసోడియా సన్నిహితుడుగా భావిస్తున్న  దినేశ్‌ అరోరా, హైదరాబాద్‌లో అభినవ్‌(మాదాపూర్‌), శరత్‌ చంద్ర(కూకట్‌పల్లి) ఇళ్లపైనా దాడులు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. గతంలో అరెస్టు చేసిన సమీర్‌ మహేంద్రు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి. దినేశ్‌ అరోరాకు గతంలో యూకో బ్యాంకు ద్వారా సమీర్‌ మహేంద్రు బదిలీ చేసిన రూ.కోటి... నగదు రూపంలో మనీష్‌ సిసోడియాకు ముట్టిందని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. రూ.5 కోట్ల మేరకు నగదు బదిలీ చేసిన అర్జున్‌ పాండే, విజయ్‌ నాయర్‌, రామచంద్ర పిళ్లయిల మీద కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. తెలంగాణలో అధికార పార్టీ ముఖ్యనేతలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బోయిన్‌పల్లి అభిషేక్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ ఇదివరకు సోదాలు నిర్వహించింది. పిళ్లై సంస్థల్లో అభిషేక్‌ భాగస్వామిగా ఉన్నట్లు పూర్తి ఆధారాలను ఈడీ ప్రత్యేక బృందాలు సేకరించాయి. తాజాగా ఈడీ జరిపిన దాడుల్లో ఇండియా అహెడ్‌ సంస్థలోనూ అభిషేక్‌ డైరెక్టర్‌గా ఉన్నట్లు తేలింది. ముత్తా గౌతంతోపాటు అభిషేక్‌ జేఈయూఎస్‌ నెట్‌వర్కింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇండియా అహెడ్‌లో అభిషేక్‌ పెట్టుబడులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించిన ఈడీ పత్రిక అధినేత గోపాలకృష్ణను విచారించినట్లు సమాచారం. 


Read more