ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మళ్లీ ఈడీ దాడులు

ABN , First Publish Date - 2022-09-17T09:40:01+05:30 IST

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మళ్లీ ఈడీ దాడులు

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మళ్లీ ఈడీ దాడులు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌/నెల్లూరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. శుక్రవారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి మెరుపుదాడులు చేశారు. ఏపీ, తెలంగాణ సహా ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 40చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌కు 25 ప్రత్యేక బృందాలుగా వచ్చిన అధికారులు.. ఉదయం నుంచే పలు సంస్థల కార్యాలయాలు, పలువురి నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆడిటర్‌గా వ్యవహరిస్తున్న గోరంట్ల బుచ్చిబాబు కార్యాలయంలోనూ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. కవితకు సంబంధించిన జాగృతి కార్యాలయం, ఆమె వ్యక్తిగత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాలపై బుచ్చిబాబును అడిగి తెలుసుకున్నట్లు, వాటికి సంబంధించిన పత్రాలను సేకరించినట్లు సమాచారం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారి రామచంద్రన్‌ పిళ్లైకి చెందిన సంస్థలు, నివాసంలో ఈడీ అధికారులు శుక్రవారం మరోసారి సోదాలు చేశారు. రాబిన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలకు పిళ్లై డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ సంస్థ భాగస్వాములుగాఉన్న బోయినపల్లి అభిషేక్‌రావు, ప్రేమ్‌సాగర్‌ నివాసాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. అభిషేక్‌రావు డైరెక్టర్‌గా ఉన్న మాదాపూర్‌లోని అనూస్‌ కార్పొరేట్‌ కార్యాలయంలోనూ ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి మరోవైపు అగస్త్య ఎల్‌ఎల్‌పీ లిమిటెడ్‌ డిజిగ్నేట్‌ డైరెక్టర్‌ అభినయ్‌రెడ్డి నివాసంలోనూ ఈడీ సోదాలు జరిపింది. కాగా, తనిఖీల్లో లభించిన ఆధారాల మేరకు అధికారులు పలువురికి నోటీసులు జారీ చేసినట్లు, వారిని ప్రశ్నించనున్నట్లు తెలిసింది. అయితే నోటీసుల జారీకి సంబంధించి ఈడీ అధికారులు మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. కానీ, సీఎం కేసీఆర్‌ కుమార్తె, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా నోటీసులు ఇచ్చారంటూ ప్రచారం జరిగింది. కవితకు కరోనా సోకడంతో ప్రస్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. దీంతో ఆమె సహాయకులకు నోటీసులు ఇచ్చారంటూ వార్తలు వెలువడ్డాయి. కానీ, ఈ ప్రచారాన్ని కవిత ఖండించారు. 


నాకు ఎలాంటి నోటీసులు అందలేదు: కవిత

ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులూ అందలేదని ఎమ్మెల్సీ కవిత ట్టిటర్‌ ద్వారా తెలిపారు. కొందరు ఢిల్లీలో కూర్చుని తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మీడియా తమ సమయాన్ని వృథా చేసుకోకుండా నిజాలను ప్రసారం చేయాలని సూచించారు. వీక్షకుల సమయాన్ని కూడా వృథా చేయొద్దనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. 


ఎంపీ మాగుంట నివాసంలో సోదాలు 

ఈ కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి కూడా బుచ్చిబాబు సీఏగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో  శ్రీనివాసులురెడ్డి నివాసంలోనూ సోదాలు జరిపారు. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసమైన 91, లోధి ఎస్టేట్‌ బంగ్లాకు ఉదయం చేరుకున్న ఈడీ అధికారులు.. సాయంత్రం దాకా సోదాలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే నెల్లూరులోని రాయాజీ వీధిలో ఉన్న మాగుంట కార్యాలయంలోకి ఐదుగురు అధికారుల బృందం ఉదయం 6.30 గంటలకు ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాకుండా ఆ ప్రాంత రహదారులను గంటసేపు బ్లాక్‌ చేశారు. కార్యాలయంలోకి అధికారులు ప్రవేశించి, లోపలి నుంచి తలుపులకు తాళం వేసిన తరువాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. బయట బీఎ్‌సఎఫ్‌ బలగాలు రక్షణగా ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బుచ్చిరెడ్డిపాళెం మండలం రేబాలలో ఉంటున్న మాగుంట సమీప బంధువు ఏటూరు శివరామకృష్ణారెడ్డి నివాసంలో నలుగురు అధికారులతో కూడిన మరో బృందం తనిఖీలు చేపట్టింది. శ్రీనివాసులురెడ్డి భార్య, శివరామకృష్ణారెడ్డి భార్య అక్కాచెళ్లెళ్లు. ఈ రెండుచోట్లా రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. మధ్యాహ్నం 2గంటల సమయంలో తాళాలు, లాకర్లను తెరవగలిగిన టెక్నీషియన్‌ను మాగుంట కార్యాలయంలోకి తీసుకెళ్లినట్లు సమాచారం. అక్కడున్న బీరువాలు, లాకర్లు తెరిచి ఆధారాల కోసం క్షుణ్నంగా గాలించినట్లు తెలుస్తోంది. సుమారు 13 గంటల పాటు ఈడీ అధికారులు నిర్విరామంగా తనిఖీలు చేశారు. 

Updated Date - 2022-09-17T09:40:01+05:30 IST