ఓటుకు ఆధార్‌ అనుసంధానం చేసుకోండి

ABN , First Publish Date - 2022-08-01T05:47:53+05:30 IST

బోగస్‌ ఓటర్లకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటుకు ఆధార్‌ అనుసంధానం కార్యక్రమాన్ని ఓటర్లంతా వినియోగించుకోవాలని తహశీల్దార్‌ పవన్‌కుమార్‌ పేర్కొన్నారు.

ఓటుకు ఆధార్‌ అనుసంధానం చేసుకోండి

రాజానగరం, జూలై 31: బోగస్‌ ఓటర్లకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటుకు ఆధార్‌ అనుసంధానం కార్యక్రమాన్ని ఓటర్లంతా వినియోగించుకోవాలని తహశీల్దార్‌ పవన్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసిందన్నారు. నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే నమోదైన ఓటర్లు 2023 ఏప్రిల్‌ 1 తేదీ నాటికి తమ ఆధార్‌ నెంబర్‌ను తెలిపాలని సూచించార న్నారు. ఆగస్టు 1నుంచి నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో పలు అంశాలను వివరించారు. ఫారం-6బి ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారు తమ ఆధార్‌ నెంబరు అనుసంధానం కోసం నూతనంగా ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఫారం-6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించారని, ఓటరు నియోజకవర్గం మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేం దుకు అవకాశం ఉండదన్నారు. జాబితాలో పేరు తొలగింపునకు ఉపయోగించే ఫారం-7 విషయంలో ఇకపై మరణ ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాల్సి ఉంటుందని, ఇది లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి కాని, వారి పరిసరాల్లో ఉన్నవారి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకోవాలన్నారు. ఇక ఫారం-8 విషయంలో కీలక మార్పులు జరిగాయని, ఇప్పటివరకు దీన్ని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణకు వినియోగిస్తుండగా ఇకపై విభిన్న అంశాలకు వినియోగించనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోనే కాకుండా ఇతర నియోజకవర్గాలకు ఓటు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డుల జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం-8 వినియోగించవచ్చని తహశీల్దార్‌ వివరించారు.

Read more