విజిట్రబుల్స్‌!

ABN , First Publish Date - 2022-09-29T06:08:44+05:30 IST

బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు పరుగెడుతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే మధ్యాహ్నానికి మరో రేటు.. సాయంత్రానికి ఇంకో రేటు. పరిస్థితులు,డిమాండ్‌ ఆధారంగా వ్యాపారులు ఽధరలను భారీగా పెంచి విక్రయాలు సాగిస్తున్నారు.

విజిట్రబుల్స్‌!

దసరా.. దరువు
పండగ పేరిట కూరగాయల ఽధరల  దోపిడీ
బహిరంగ మార్కెట్‌లో సాగుతున్న వైనం
నాణ్యత పేరిట కిలోకి రూ.20పైనే పెంపు
రైతు బజార్‌లో నాణ్యత లేని కూరలు
చోద్యం చూస్తున్న అధికారులు
మోసపోతున్న భక్తజనం



దసరా వచ్చిందని.. ధరలను పెంచేశారు.. బహిరంగ మార్కెట్‌లో భక్తులను మోసగిస్తున్నారు. కిలోకు సుమారు రూ. 20పైనే పెంచి విక్రయిస్తున్నారు. రైతు బజార్‌లో ధరలు ఒక రకంగా ఉంటే బహిరంగ మార్కెట్‌లో ధరలు మరోలా ఉంటున్నాయి. ఽధరలను చూసిన కొనుగోలుదారులు నోరెళ్లబెడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు నాణ్యత పేరుతో ధరల ఎక్కువకు విక్రయిస్తుంటే..                   రైతు బజార్‌లో నాణ్యత లేనివి ఉండడంతో ఽధర తక్కువకు విక్రయిస్తారని చెబుతున్నారు. అధికారులు ధరల నియంత్రణపై దృష్టి సారించి విజిట్రబుల్స్‌ను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.



రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 28 : బహిరంగ మార్కెట్లో కూరగాయల ధరలు పరుగెడుతున్నాయి. ఉదయం ఒక రేటు ఉంటే మధ్యాహ్నానికి మరో రేటు.. సాయంత్రానికి ఇంకో రేటు. పరిస్థితులు,డిమాండ్‌ ఆధారంగా వ్యాపారులు ఽధరలను భారీగా పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో సుమారు 10 రోజుల పాటు చాలా మంది  మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. మరో పక్క భవానీ దీక్షలు ఆచరించే భక్తుల సంఖ్య పెరిగింది. భవానీ దీక్షలు చేపట్టిన వ్యక్తుల కుటుంబాలు మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీంతో కూరగాయల వినియోగం ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఇది వ్యాపారులకు కలసి వస్తోంది. ఇదే అదనుగా కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. రైతుబజార్లలోని ధరలకు బహిరంగ మార్కెట్లు, తోపుడుబండ్లపై  రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. దసరా ఉత్సవాలు ముగిసే వరకూ కూరగాయల రేట్లు దిగొచ్చే పరిస్థితి లేనేలేదని వ్యాపారులు చెప్పడం గమనార్హం.ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాల కారణంగా కూరగాయల తోటలు,  పాదులు దెబ్బతినడంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితి  కూరగాయల ధరల పెరుగుదలకు మరో కారణంగా కనిపిస్తోంది.


ఒక్కో చోట.. ఒక్కో ధర..


 బహిరంగ మార్కెట్లో కూరగాయల రేట్లు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. రైతు బజార్‌లో ఒకటా ఉంటే.. బహిరంగ మార్కెట్‌లో మరోలా ఉంటాయి. ఒక మార్కెట్‌కు, మరో మార్కెట్‌కు ధరలో పొంతన ఉండదు. ప్రస్తుతం దొమ్మేరు రకం వంకాయలు కిలో  రూ.90ల వరకూ విక్రయిస్తున్నారు. బీరకాయలు రూ.50, టమాటా రూ.60, బెండకాయలు రూ.50, దొండకాయలు రూ.50, పచ్చిమిర్చి రూ.60, బంగాళాదుంపలు రూ.40, క్యారట్‌ రూ.60, క్యాప్సికం రూ.120, బీట్‌రూట్‌ రూ.60,చిక్కుళ్లు రూ.120 పలుకుతున్నాయి. రైతు బజార్‌లో అయితే ధరలు సగానికి సగం ఉన్నాయి. బీరకాయలు కిలో రూ.24, బెండకాయలు రూ. 30, బంగాళాదుంపలు రూ. 29, వంకాయలు రూ. 30 టమాటా రూ. 28 ఉన్నాయి.ఇక చిక్కుళ్లు రూ. 100, ఆగాకర రూ. 90, బీట్‌రూట్‌ రూ. 40, క్యారట్‌ రూ. 40, అరటికాయలు 3 రూ.20, ఆకు కూరలు అయితే రెండు కట్టలు రూ.10లు ఉన్నాయి. అదే బహిరంగ మార్కెట్‌ లో అయితే ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఒక్కో రకంపై కిలో రూ.20 నుంచి రూ.30ల పైనే వేసుకుని విక్రయిస్తున్నారు. రైతు బజార్‌లో విక్రయించే కూరగా యల్లో అంతగా నాణ్యత లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో కూరగాయలనే ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ ఽధరలు పెంచి విక్రయిస్తుండడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. సాధారణ రోజుల్లో అయితే కిలో రూ. 10లు మాత్రమే తేడా ఉంటుంది. ప్రస్తుతం దసరా కావడంతో ఽధరలు పెంచి విక్రయిస్తున్నారు.  బహిరంగ మార్కెట్లో చాలా మంది వ్యాపారులు వివిధ పద్ధతుల్లో కూరగాయలు విక్రయిస్తుంటారు. కిలోకు ఒక రేటు, అర కిలోకు మరో రేటు, పావు కిలో అయితే ఇంకో రేటు ఇలా ధరల్లో వ్యత్యాసం చెబుతారు. ఉదాహరణకు ఏదైనా కూరగాయల ధర కిలో రూ.90లు చెబితే అర కిలో రూ.50లకు, పావు కిలో రూ.30లు ధర చెబుతారు. ఇలా వినియోగదారులను నిత్యం మాయ చేస్తుంటారు. దీంతో కూరగాయలు కొనాలంటేనే సామాన్య, మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు.


కొండెక్కిన కొత్తిమీర


ఇక కొత్తిమీర ధర కొరకొర మంటోంది. వ్యాపారులు కొత్తిమీరను పెద్దపెద్ద కట్టల లెక్కన కొనుగోలు చేసి వాటిని పెద్ద, చిన్న కట్టలుగా కట్టి మార్కెట్లో విక్రయిస్తుంటారు. కిలోల లెక్కన కొనుగోళ్లు ఉండవు. ప్రస్తుతం 130 కట్టలు రూ.3,600 నుంచి రూ.3,800ల వరకూ ధర ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రెండు రోజుల కిందట ఈ ధర మరింత ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు కాస్త తగ్గిందని అంటున్నారు. మొన్నటి వర్షాలకు కొత్తిమీర సాగు దెబ్బతినడంతో వ్యాపారులు బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంతో పాటు ఇతర అన్ని మార్కెట్లు, రైతుబజార్లలో బెంగుళూరు కొత్తిమీర మాత్రమే అందుబాటులో ఉంది. వాస్తవానికి జిల్లాలోని తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామ పరిసరాలు కొత్తిమీర, ఆకుకూరల సాగుకు పెట్టింది పేరు. అయితే వర్షాల కారణంగా నారు కుళ్లిపోవడంతో పెద్దేవం కొత్తిమీర రావడంలేదు. ఇప్పుడిప్పుడే మళ్లీ సాగు మొదలైంది. చేతికి రావాలంటే మరో నెలరోజులైనా పడుతుందని చెబుతున్నారు. ఆకుకూరల ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. చుక్కకూర, మెంతికూర పెద్దగా మార్కెట్లోకి రావడంలేదు. తోటకూర, పొన్నగంటి కూర, బచ్చలికూర, గోంగూర మాత్రమే దొరుకుతున్నాయి. ఇలా కూరగాయలు, ఆకుకూరల ధరలు భారీగా పెరగడంతో ఏం తిని బతకాలంటూ సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-09-29T06:08:44+05:30 IST