వాడపల్లి వెంకన్న ఆలయం కిటకిట

ABN , First Publish Date - 2022-09-25T06:30:32+05:30 IST

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం వేలాదిమంది భక్తజనంతో విరాజిల్లుతోంది. శనివారం వేకువజాము నుంచే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, బాలభోగం, ఐశ్వర్యలక్ష్మీహోమం తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

వాడపల్లి వెంకన్న ఆలయం కిటకిట
తరలివచ్చిన భక్తులు

ఆత్రేయపురం, సెప్టెంబరు 24: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రం వేలాదిమంది భక్తజనంతో విరాజిల్లుతోంది. శనివారం వేకువజాము నుంచే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, బాలభోగం, ఐశ్వర్యలక్ష్మీహోమం తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వర్ణశోభితుడైన స్వామివారిని వివిధ రకాల పుష్పాలు, నెమలి ఫించాలు, వేరుశనగ కాయలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఏడు వారాలు వ్రతమాచరిస్తున్న భక్తులు ఆలయ మాఢ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకుని తలనీలాలు, కానుకలు సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భారీ క్యూలైన్ల ద్వారా గోవిందనామస్మరణతో స్వామివారిని కనులారా దర్శించుకున్నారు. 19 వేల నుంచి 23 వేల మంది భక్తులు స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఉభయ గోదావరి జిల్లాలనుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ద్వారా భక్తులు స్వామి సన్నిధికి చేరుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.17,80,934 లభించినట్టు చైర్మన్‌ రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

Read more