వాడపల్లి... శోభిల్లి

ABN , First Publish Date - 2022-08-01T05:36:37+05:30 IST

స్వయంభువుడై ఎర్రచందనమనే కొయ్య విగ్రహంతో మూర్తీభవించిన పరంధాముడీయన. ప్రస్తుతం దేశంలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, కోనసీమ తిరుమలగా భాసిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీదేవి ఽభూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో శోభిల్లుతోంది.

వాడపల్లి... శోభిల్లి

  • కోనసీమ తిరుమలగా విరాజిల్లుతున్న క్షేత్రం
  • భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీవేంకటేశ్వర స్వామి
  • ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం
  • కోట్లాది రూపాయలతో ఆలయ అభివృద్ధి

(ఆత్రేయపురం)

స్వయంభువుడై ఎర్రచందనమనే కొయ్య విగ్రహంతో మూర్తీభవించిన పరంధాముడీయన. ప్రస్తుతం దేశంలో ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, కోనసీమ తిరుమలగా భాసిల్లుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీదేవి ఽభూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం నిత్యం వేలాది మంది భక్తులతో శోభిల్లుతోంది. ధ్వజస్తంభం వద్ద నిండు మనసుతో కోరుకుంటే స్వామి కృపాకటాక్షాలు అందిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంగా భక్తులు విశ్వసించి ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శిస్తున్నారు. నిత్య కల్యాణాలు, అష్టోత్తర పూజలు నిర్వహించుకుని కానుకలు సమర్పిస్తున్నారు. ప్రతీ శనివారం 30వేల నుంచి 50వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుని పురమాడ వీధుల్లో ప్రదక్షిణలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఎన్నో సమస్యలతో వస్తున్న భక్తులు స్వామి దర్శనం ద్వారా అద్భుత ఫలితాలు పొందారు. 

ఈ దివ్య క్షేత్రంలో ప్రతీఏటా కోట్లాది రూపాయల వ్యయంతో స్వామివారి వార్షిక కల్యాణం, బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అధ్యయనోత్సవాలను వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం తిరుమల తరహాలో నిర్వహిస్తున్నారు. వీటిని తిలకించడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. నిత్యం 3వేల నుంచి 5వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని అష్టోత్తర పూజలు, కల్యాణాలు జరిపించుకుంటున్నారు.

వాడపల్లికి వచ్చే భక్తులు సరైన రహదారులు లేక ట్రాఫిక్‌ కష్టాలతో పాటు స్వామి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించేవారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయ చైర్మన కరుటూరి నరసింహారావు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు అభివృద్ధికి బాటలు వేశారు. మాస్టర్‌ ప్లాన రూపొందించి పనులకు శ్రీకారం చుట్టారు. లొల్ల నుంచి వాడపల్లి వరకు ఆర్‌అండ్‌బీ రహదారి నిర్మించారు. మెర్లపాలెం సమీపంలో నూతన వంతెన ఏర్పాటుచేసి పుంతను కొనుగోలు చేసి ఆర్‌అండ్‌బీ ద్వారా చూడచక్కని రహదారి నిర్మించారు. అన్నదాన భవనాన్ని తిరుమల తరహాలో భక్తులకు భోజనాలు పెట్టేలా నిర్మించారు. ప్రాకార మండపం పనులకు కూడా శంకుస్థాపన చేశారు. గత పాలకవర్గం చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోకుండా నూతన ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. నూతన చైర్మన రుద్రరాజు రమేష్‌రాజు, ఈవో సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాలపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తనదైన శైలిలో అభివృద్ధి చేసేందుకు సహకారం అందించారు. భక్తుల రద్దీ పెరగడంతో పాటు అవసరమైన అభివృద్ధి చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వాడపల్లిలో రూ.3.75 కోట్లతో ప్రాకార మండపం, రూ.70 లక్షలతో గ్రానైట్‌ ఫ్లోరింగ్‌, రూ.53 లక్షలతో షాపింగ్‌ కాంప్లెక్సు, రూ.14 లక్షలతో ఓవర్‌ బ్రిడ్జి, రూ.52 లక్షలతో కల్యాణ వేదిక, హోమశాల నిర్మాణాలను భక్తుల సహకారంతో చేపట్టారు. రథంతో పాటు గోక్షేత్రం కూడా నిర్మించారు. అనేక మంది దాతలు స్వామివారికి విలువైన ఆభరణాలతో పాటు బంగారు పాదాలు, బంగారు కిరీటాలు సమర్పించుకున్నారు. 


రూ.2 కోట్లతో పుష్కరిణి

రుద్రరాజు రమేష్‌రాజు, చైర్మన 

ఆలయం ఎదురుగా ఉన్న చెరువును పుష్కరిణిగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నిధుల నుంచి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. పనులు శరవేగంగా చేపడుతున్నాం. స్వామివారికి నిర్వహించే ఉత్సవాల్లో చక్రస్నానం, తెప్పోత్సవాలను ఇకపై   పుష్కరిణిలో నిర్వహిస్తాం. భక్తుల స్నానాలకు ఎంతో ఉపయోగం కానుంది. రానున్న కల్యాణోత్సవాలకు పుష్కరిణిని సిద్ధం చేస్తాం. 

భక్తులకు మరిన్ని సౌకర్యాలు

ముదునూరి సత్యనారాయణరాజు, ఈవో 

భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాం. అన్నదాన భవనం వద్ద రథం స్థలంలో యాత్రికులకు మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించాం. టీటీడీ ఆధ్వర్యంలో కాటేజీల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నాం. మాస్టర్‌ ప్లానలో భాగంగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నాం. 

Updated Date - 2022-08-01T05:36:37+05:30 IST