పడకేసిన పాలన

ABN , First Publish Date - 2022-05-18T06:21:44+05:30 IST

మండలంలో పంచాయతీ పాలన పడకేసింది. 17 గ్రామ పంచాయతీలకు నలుగురు మాత్రమే రెగ్యులర్‌ కార్యదర్శులున్నారు. ఇన్‌చార్జిల పాలనలో గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కొత్త నియామకాల్లో సైతం మండలానికి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది.

పడకేసిన పాలన

  • 17 పంచాయతీలకు నలుగురే కార్యదర్శులు
  • కొత్తగా వచ్చిన వారు వేరేచోట్లకు ప్రయత్నాలు
  • దీర్ఘకాలిక సెలవులో మహిళా కార్యదర్శి
  • ఉప్పలగుప్తం మండలానికి వచ్చేందుకు ఉద్యోగుల విముఖత

ఉప్పలగుప్తం, మే 17: మండలంలో పంచాయతీ పాలన పడకేసింది. 17 గ్రామ పంచాయతీలకు నలుగురు మాత్రమే రెగ్యులర్‌ కార్యదర్శులున్నారు. ఇన్‌చార్జిల పాలనలో గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కొత్త నియామకాల్లో సైతం మండలానికి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది. ఏడాది క్రితం ముగ్గురు కొత్త ఉద్యోగులు విధుల్లో చేరారు. చేరిన రోజు నుంచే బదిలీ ప్రయత్నాలు ప్రారంభించి ఇతర మండలాలకు వెళ్లిపోయారు. తాజాగా గత నెల రెండో తేదీన విలసవిల్లి పంచాయతీ కార్యదర్శిగా నియమించిన జ్యోతిసుధ ఇప్పటికీ విధుల్లో చేరలేదు. వేరేచోటకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. చల్లపల్లి కార్యదర్శిగా ఉన్న  ఆర్‌.భవాని స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి తట్టుకోలేక లాంగ్‌ లీవ్‌ పెట్టిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్‌చార్జిలు, డిప్యుటేషన్లతో పాలన నెట్టుకొస్తున్నారు. తాగునీటి సరఫరా, చెత్త తొలగింపు వంటి అత్యవసర సమస్యల పరిష్కారానికి ఆటంకాలు ఎదురవుతున్నట్టు ఉద్యోగులే ఆవేదన చెందుతున్నారు. ఒక కార్యదర్శి నాలుగేసి పంచాయతీలు చక్కబెట్టాలంటే సాధ్యం కాక సతమతమవుతున్నారు. కార్యదర్శి తమకు అందుబాటులో ఉండట్లేదని సర్పంచ్‌లు ఆరోపిస్తుంటే ఒకే పంచాయతీలో రోజంతా పనిచేస్తే ఇతర పంచాయతీల మాటేమిటని కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. కనీసం రెండు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

నలుగురితో పనిచేయించడం ఇబ్బందికరంగా ఉంది

కె.విజయప్రసాద్‌. ఎంపీడీవో, ఉప్పలగుప్తం

ఉన్న వారిలో ఒకరు లాంగ్‌ లీవ్‌పై వెళ్లడంతో నలుగురే మిగిలారు. విలసవిల్లి కార్యదర్శిగా జ్యోతిసుధ ఇప్పటికీ విధుల్లో చేరలేదు. బిల్లు కలెక్టర్లను సైతం ఇన్‌చార్జిలుగా నియమించాం. రోజువారీ కార్యక్రమాలకు సైతం ఇబ్బందిపడుతున్నాం. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు పంచాయతీల్లో పూర్తిస్థాయిలో ఉద్యోగులు ఉండాలి.


Read more